టీనేజీలో ఉన్న అమ్మాయిలకు తమ వక్షోజాల పరిమాణం విషయంలో ఎన్నో అపోహలుంటాయి. తమ స్తనాలు సమానంగా లేవని, చిన్నగా ఉన్నాయని కొందరు ఫీలైతే.. మరికొందరు పెద్దగా ఉన్నాయని బాధపడుతుంటారు. ఇలా ఈ విషయంలో ఎన్నో అనుమానాలు.. కానీ ఎవరితోనూ పంచుకోలేరు. కొందరు ధైర్యం చేసి ఈ విషయాలన్నీ అమ్మనడిగి తెలుసుకుంటారు. కానీ చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. అలాంటివారికోసమే.. ఈ సమాచారం..
చాలామంది టీనేజీ అమ్మాయిల్లో తమ లైంగిక అవయవాల పట్ల సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా తమ స్తనాల గురించి వాళ్లకు తెలీని విషయాలెన్నో ఉంటాయి. అలాంటివాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

ఒకటి పెద్దగా, మరోటి చిన్నగా..?
చాలామంది యువతులు చేసే మొట్టమొదటి కంప్లెయింట్ తమ రొమ్ములు రెండూ ఒక సైజులో లేవని.. రొమ్ములు రెండూ సమానంగా లేకపోవడం సాధారణమైన విషయమే.. ఎందుకంటే - రెండు స్తనాల్లో ఒకే రకం ఎదుగుదల ఉండదు. ఓ వైపు ఎక్కువగా పెరిగితే మరోవైపు తక్కువగా పెరగొచ్చు. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వక్షోజాల పరిమాణంలో తేడా మరీ ఎక్కువగా కనిపిస్తుంటే.. అది హార్మోన్ల అసమతౌల్యం కావచ్చు... అందుకే పరిష్కారం కోసం డాక్టర్ని సంప్రదించాలి. వక్షోజాలు ఒకే సైజులో కనిపించాలంటే రిమూవబుల్ ప్యాడ్స్ ఉన్న బ్రాలను వాడచ్చు. పెద్దగా ఉన్న వైపు ప్యాడ్ తొలగించి వాడాలి.
చాలా చిన్నగా..
స్తనాలు చిన్నగా, లేక పెద్దగా ఉండటమనేది మన శరీరతత్వం పైన కూడా ఆధారపడి ఉంటుంది. వీటిని సహజసిద్ధంగా పెంచే మందులేవీ ఉండవు. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కొంతవరకు పరిష్కారం చూపించవచ్చు. అయితే సంబంధిత నిపుణులను సంప్రదించి మంచి, చెడులను జాగ్రత్తగా విశ్లేషించుకున్న తర్వాతే ఇలాంటి వాటికి సిద్ధపడాలి. సైజును చూసి సిగ్గుపడటం కాకుండా దాన్ని అంగీకరించే ప్రయత్నం చేయడం అన్నిటికన్నా ముఖ్యం.

పెరుగుదల ఎప్పటివరకు?
చాలామంది ఎత్తు పెరగడం ఆగిపోగానే స్తనాల ఎదుగుదల కూడా ఆగిపోతుందనుకుంటారు. కానీ వీటి ఎదుగుదల ఇరవై సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా శరీరం లావైనప్పుడు వాటిలో ఉన్న కొవ్వూ పెరగడంతో వాటి సైజు పెరుగుతుంది.
నిపుల్స్ చుట్టూ నల్లని భాగం
నిపుల్స్ చుట్టూ ప్రతి ఒక్కరిలో నల్లని భాగం ఉంటుంది. దీనినే 'ఏరియోలా' అంటారు. అయితే దీని సైజు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందరిలోనూ సమానంగా ఉండదు. సాధారణంగా ఇది నాణెం సైజులో ఉంటుంది. కొంతమందిలో పెద్దగా, లేదా చిన్నగా ఉండే అవకాశాలున్నాయి.
కొన్ని భాగాల్లోనే నొప్పి?
ఒక్కోసారి వక్షోజాల్లో కొన్ని భాగాల్లోనే నొప్పి కలగడానికి కారణం అక్కడ ఉండే కణజాలాలు. వక్షోజాలు ఎక్కువ శాతం ఫ్యాటీ టిష్యూ (కొవ్వు కణజాలం)తో, తక్కువ శాతం కండరాలతో నిర్మితమవుతాయి. అక్కడ ఉండే ఈ కణజాలాల్లో కలిగే నొప్పి వల్ల కొన్ని ప్రదేశాల్లోనే నొప్పి తెలుస్తుంది. అలాగే నెలసరికి ముందు రొమ్ముల్లో మంట, దురద రావడం సహజం.

సున్నితంగా...
చాలామందిలో అప్పుడప్పుడు రొమ్ములు చాలా సున్నితంగా (సెన్సిటివ్) తయారవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందా? అని కంగారు పడటం కూడా సహజం. అయితే ఇది సాధారణ ప్రక్రియే... రొమ్ముల్లో కొత్త కణజాలం తయారయ్యే క్రమంలో అవి సున్నితంగా మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు నిపుల్స్ కూడా సున్నితంగా మారతాయి. అయితే నిపుల్స్ నుంచి ఏవైనా ద్రవాలు కారుతూ ఉంటే మాత్రం గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, వారి సలహా తీసుకోవాలి.
స్ట్రెచ్ మార్క్స్?
కొంతమందిలో రజస్వల అయినప్పుడు స్తన కణజాలంలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో స్తనాలపై ఉన్న చర్మం వదులయ్యే అవకాశముంది. అది తిరిగి బిగుతుగా మారే సమయంలో స్ట్రెచ్ మార్క్స్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొంత కాలానికి ఇవి చర్మం రంగులో కలిసిపోతాయి. కాబట్టి వీటి గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు.
బ్రెస్ట్ క్యాన్సర్
యుక్తవయసున్న అమ్మాయిల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ స్తనాల్లో సాధారణంగా ఉండే గడ్డలనే రొమ్ము క్యాన్సర్‌గా భావిస్తూ, ఆందోళనకు గురవుతుంటారు కొంతమంది. ఇలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎప్పుడైనా అసహజంగా, అసాధారణంగా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించాలి.
చూశారుగా... వక్షోజాల విషయంలో అనవసర ఆందోళనలకు లోనవడంలో అర్థం లేదు. ఒకవేళ ఇతరత్రా ఎలాంటి సందేహాలొచ్చినా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.