Photo: Instagram
నిజం ఇంటి అరుగు దాటే లోపు అబద్ధం ఊరు దాటుతుందంటారు. కానీ సోషల్ మీడియా పుణ్యాన ఊరేంటి, ఏకంగా ప్రపంచాన్నే చుట్టేస్తోంది. ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలీ బిర్లా విషయంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు చూస్తే ఈ మాటలు నిజమనిపించకమానవు. కొద్ది రోజుల క్రితం ఐఏఎస్‌గా ఎంపికైన ఆమె.. తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని అత్యున్నత ఉద్యోగాన్ని పొందారంటూ కొంతమంది నెటిజన్లు ఆమెపై విషం చిమ్మారు. సివిల్స్ పరీక్ష రాయకుండానే ఉద్యోగం సంపాదించారంటూ ఆమెను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పలు విద్వేషపూరిత పోస్టులు షేర్ చేశారు. ఈక్రమంలో సామాజిక మాధ్యమాల సాక్షిగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు తనదైన రీతిలో సమాధానమిచ్చేందుకు స్వయంగా అంజలీనే రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా తన యూపీఎస్సీ ర్యాంకుకు సంబంధించిన డాక్యుమెంట్లను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది.
ఐఏఎస్, ఐపీఎస్...లాంటి దేశ అత్యున్నత ప్రభుత్వోద్యోగాల్లో చేరి ప్రజా సేవ చేయాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొంటూ సహనంతో ప్రయత్నించినప్పుడే ఇలాంటి కొలువులు సొంతమవుతాయి. ఈక్రమంలో రాజకీయ నేతగా నిత్యం ప్రజా సేవలో తరిస్తోన్న తన తండ్రి(ఓం బిర్లా)ని చూసి అంజలి కూడా సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. వైద్యురాలిగా రోగుల ప్రాణాలు కాపాడుతున్న తన తల్లి (అమితా బిర్లా), ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా ప్రజలకు సేవ చేస్తోన్న తన సోదరి(ఆకాంక్ష) స్ఫూర్తితో ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్‌లో చేరి ప్రజా సేవలో తరించాలనుకుంది. అందుకు తగ్గట్టే ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్-2019 పరీక్ష రాసిన అంజలి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం!
ఈమేరకు గతేడాది ఆగస్టులో సివిల్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు గ్రూప్-ఎ, గ్రూప్-బి లాంటి కేంద్ర సర్వీసుల నియామకం కోసం మొత్తం 927 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. మెరిట్ క్రమంలో మొదటగా 829 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇటీవల రిజర్వ్డ్ జాబితా నుంచి వివిధ సర్వీసుల కోసం మరో 89 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో దిల్లీలోని రామ్జాస్ కాలేజీ నుంచి రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన అంజలి కూడా ఉంది. అయితే ఆమె తన తండ్రి పలుకుబడితో అడ్డదారిలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారని కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. అసలు ఆమె యూపీఎస్సీ పరీక్ష కూడా రాయకుండానే సివిల్స్‌కి ఎంపికయ్యారని ఆ పోస్టుల్లో ఆరోపించారు.
ఈరోజు నేను... రేపు మరొకరు!
ఇలా సోషల్ మీడియా సాక్షిగా అంజలిపై సాగుతున్న విష ప్రచారానికి మొదట ‘ఏఎఫ్‌పీ ఫ్యాక్ట్ చెక్’ అడ్డుకట్ట వేసింది. ఈక్రమంలో అంజలి 2019లో యూపీఎస్సీ ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ పరీక్షలు రాసిందని చెబుతూ యూపీఎస్సీ ప్రచురించిన ర్యాంకుల జాబితాను షేర్ చేసింది. అందులో ఆమె హాల్ టికెట్ నంబర్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం అంజలి కూడా రంగంలోకి దిగి సోషల్ మీడియాలో తనపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసింది. ఈ సందర్భంగా తన ర్యాంకుకు సంబంధించిన డాక్యుమెంట్లను సామాజిక మాధ్యమాల ద్వారా అందరితో షేర్ చేసుకుందామె. ‘నాపై వస్తున్న అసత్యపు ప్రచారాన్ని చూసి తొలుత దిగ్ర్భాంతికి గురయ్యాను. ఇలా ఇతరుల మీద విష ప్రచారం చేసే వారి జాడ కనిపెట్టి కఠినంగా శిక్షించాలి. ఈరోజు నేను బాధితురాలిని అయ్యాను. రేపు మరొకరు అవుతారు. కాబట్టి సోషల్ మీడియా ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా ఓ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది.’
దాంతో నా మనసు మరింత దృఢమైంది!
‘మన దేశంలో యూపీఎస్సీ పరీక్షలు అత్యంత నిష్పక్షపాతంగా జరుగుతాయి. ఒకే ఏడాదిలో మూడు దశలలో జరిగే ఈ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎంతో కఠోర పరిశ్రమ చేయాలి. అయినా ఒక ఏడాదిలో లక్షల మంది పరీక్ష రాస్తే కేవలం కొద్దిమంది మాత్రమే ఎంపికవుతారు. ఇక్కడ బ్యాక్ డోర్ ఎంట్రీలకు అసలు ఆస్కారం ఉండదు. నేను ఎప్పుడూ నిజాయతీగా ఉంటాను. ఈ పరీక్షల కోసం నేను రెండేళ్ల పాటు కష్టపడ్డాను. రోజుకు కనీసం 8 నుంచి 12 గంటలు చదివేదాన్ని. ఈ పరీక్షల కోసం నేనెంత కష్టపడి చదివానో.. నాకు దగ్గరగా మెలిగిన వారికి మాత్రమే తెలుసు. మొదటి జాబితాలో కేవలం 8 మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పోయాను. రెండో లిస్టులో నా పేరు రావడంతో నేను కోరుకున్న కల సాకారమైంది. అయితే కొందరు ఆకతాయిల కారణంగా ఇలా అందరి ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. వారు నన్ను కాకపోయినా కనీసం యూపీఎస్సీని గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ట్రోల్స్ వల్ల నాకు కాస్త మంచే జరిగింది. భవిష్యత్‌లో ఇలాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చింది. ఈ ప్రతికూల కామెంట్లతో నా మనసు మరింత దృఢంగా మారింది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది అంజలి.