Photo: Instagram
యుద్ధమంటే ఆమెకు భయం లేదు.. శత్రువు ఏ మూల నుంచి ఎలాంటి వ్యూహాలతో వచ్చినా పసిగట్టి తిప్పికొట్టగల ఓర్పును, నేర్పును ఒంటబట్టించుకుందామె. ఈ క్రమంలోనే భారత వాయుసేనలో మహిళా యుద్ధవిమాన పైలట్‌గా చేరి ఆ అరుదైన ఘనత దక్కించుకున్న అతివగా రికార్డులకెక్కింది. ఆమే.. ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్. ఇక ఇప్పుడు మరోసారి ఆమె గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. కారణం.. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అద్భుత అవకాశం ఆమె తలుపు తట్టడమే! ఊహ తెలిసిన దగ్గర్నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌ను టీవీలో చూసిన తనకు ఇలాంటి అరుదైన అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానంటోన్న ఈ డేరింగ్ లేడీ తన గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి...
చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి చాలామంది.. ‘ఎప్పటికైనా అలాంటి విమానమెక్కాలి’.. అనుకొని ఉంటారు. అయితే నేను అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించాను. భవిష్యత్తులో అలాంటి విమానం నడపాలని అప్పుడే నిర్ణయించుకున్నా. యుద్ధ విమాన పైలట్ కావాలని కలలు కన్నా. నిజానికి ఇలాంటి సాహసాల గురించి అబ్బాయిలే ఆలోచిస్తారనుకుంటారు. కానీ నా తల్లిదండ్రులు నా కల తెలుసుకొని నన్ను ఈ దిశగా ప్రోత్సహించారు. ‘నువ్వు అమ్మాయివి అయినంత మాత్రాన నీ లక్ష్యాన్ని మార్చుకోనక్కర్లేదు. అందరికంటే భిన్నంగా ఆలోచించు.. అడుగు ముందుకెయ్!!’ అంటూ వెన్ను తట్టారు. అదిగో అక్కడ్నుంచి నా పైలట్ జర్నీ మొదలైంది.
ఐటీ ఉద్యోగం వదులుకొని..!
బిహార్‌లోని బరౌనీలో పుట్టిపెరిగిన నేను 2014లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఈ క్రమంలోనే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐటీ ఉద్యోగం కూడా వచ్చింది. నిజానికి నా కల అది కాదు. అందుకే దాన్ని వదులుకున్నా. మరి, ఆ సమయంలో యుద్ధ విమాన పైలట్‌గా చేరదామంటే ఇంకా అప్పటికి మహిళలకు ఈ విభాగంలో అవకాశాలివ్వట్లేదు. అయినా నా కలను పక్కన పెట్టలేదు. భారత వాయుసేనలో చేరడానికి ప్రవేశ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించాను. ఆ తర్వాత 2016లో మహిళల్ని యుద్ధ విమాన పైలట్లుగా నియమించుకోవడం.. అందులోనూ తొలి దశ మహిళా ఫైటర్ పైలట్లలో ఒకరిగా నన్ను ఎంపికచేయడంతో నా కల నెరవేరింది. ఆ తర్వాత హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఆరు నెలల పాటు శిక్షణ కొనసాగింది. అనంతరం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించాను.
అది నా అదృష్టం!
ప్రస్తుతం రాజస్థాన్ బికనీర్‌లోని నాల్ బేస్‌లో విధులు నిర్వర్తిస్తోన్న నేను ఇప్పటికే పగటి సమయాల్లో పూర్తి స్థాయిలో యుద్ధ విమానం నడపడంలో శిక్షణ తీసుకున్నాను. ఈ క్రమంలోనే 2018, మార్చిలో కొన్ని గంటల పాటు మిగ్-21 బైసన్ ఎయిర్‌క్రాఫ్ట్ నడిపిన అనుభవం కూడా నాకుంది. ఇక ఇప్పుడు మరో అరుదైన అవకాశం నా తలుపు తట్టింది. ఈసారి జరగబోయే రిపబ్లిక్ పరేడ్‌లో ప్రత్యక్షంగా పాల్గొనే సువర్ణావకాశం నాకొచ్చింది. ఇందులో భాగంగా సుఖోయ్-30 యుద్ధ విమానంతో విన్యాసాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నా. చిన్నతనం నుంచి గణతంత్ర వేడుకలు, పరేడ్‌ను టీవీలో చూడడమే తప్ప నేరుగా చూసింది లేదు. అలాంటిది ఇప్పుడు ఈ వేడుకల్లో భాగమవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకెంతో గర్వకారణం.
ఇక నా ఇతర వ్యాపకాల విషయానికొస్తే.. నాకు చిన్నప్పట్నుంచి ఆటలంటే మహా ఇష్టం. ఖో-ఖో, బ్యాడ్మింటన్, ఈత, వాలీబాల్ బాగా ఆడతా. బైక్ రైడింగ్ అంటే ప్రాణమిస్తా.