హాయ్ మేడమ్.. నా వయసు 25. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నన్ను బాధ పెట్టిన విషయాలే నాకు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. దానివల్ల ఎంతకీ చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నా.. నా మనసును చదువు మీదే కేంద్రీకరించాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు? - ఓ సోదరి
జ. మనసులో వచ్చే ఆలోచనలను బలవంతంగా నియంత్రించాలని ప్రయత్నిస్తే అవి మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెడుతున్నాయని మీ ప్రశ్న సూచిస్తుంది. ప్రతికూల ఆలోచనలను మనసులోకి రానీయకుండా సానుకూలంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. వెలుగు, చీకటి లాగానే ప్రతి విషయంలోనూ మంచి, చెడు ఉంటుంది. మీకు చెడుగా కనిపించిన సంఘటనల్లో మంచి ఏంటనేది ఆలోచించే ప్రయత్నం చేయండి. అందులో నేర్చుకున్న పాఠం ఏంటి? దానివల్ల నేర్చుకున్న మంచి ఏంటి? అనేది ఆలోచించే ప్రయత్నం చేయండి. అలాగే జీవితంలో బాధాకరమైన సంఘటనలతో పాటు అంతో ఇంతో సంతోషం కలిగించిన సందర్భాలు కూడా ఉంటాయి కదా.. కాబట్టి బాధ పెట్టే విషయాలు గుర్తుకువచ్చినప్పుడల్లా సంతోషం కలిగించిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయండి.
ఇక చదువు విషయానికొస్తే మీరు క్రమశిక్షణతో, ప్రణాళికబద్ధంగా చదివే ప్రయత్నం చేయండి. దీనివల్ల ప్రతికూల ఆలోచనలు పక్కకు పోయి మీరు సాధించాలనుకున్నా లక్ష్యం పైపు మీ ఆలోచనలు మళ్లే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మొదట చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుంటూ ముందుకు సాగండి. ఫలితం తప్పకుండా మీకు అనుకూలంగా వస్తుంది.
డా|| పద్మజ, సైకాలజిస్ట్