Image for Representation
సాంకేతికంగా ప్రపంచం ముందంజలో దూసుకెళుతోన్నా...ఆకాశంలోకి రాకెట్లను పంపిస్తున్నా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇంకా వెనకబడే ఉన్నాయని చెప్పాలి. అలాంటివాటిలో ఆఫ్రికా దేశమైన జింబాబ్వే కూడా ఒకటి. కేవలం అభివృద్ధిలోనే కాకుండా అక్కడి ప్రజల ఆలోచనల్లోనూ వెనకబాటుతనం స్పష్టంగా కనిపిస్తుంది. సమాజం ఎప్పుడో వదిలేసిన కొన్ని అమానుష ఆచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో బాల్య వివాహాలు కూడా ఒకటి. ఎన్ని చట్టాలు వచ్చినా...ఎంత ప్రచారం కల్పించినా...వారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆ దేశంలో ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో తన కళ్లముందు జరుగుతోన్న ఆ అమానుషాన్ని చూస్తూ ఊరుకోలేదో బాలిక. వయసులో చిన్నదే అయినా తనదైన శైలిలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి..? తనేం చేసిందో తెలుసుకుందాం రండి...
తైక్వాండోతో బాల్య వివాహాలపై పోరాటం!
ఆఫ్రికా దేశమైన జింబాబ్వేలో అమ్మాయిలకు 18 ఏళ్లు వచ్చే వరకు వివాహం చేయరాదనే నిబంధన ఉంది. కానీ కటిక పేదరికం, అనాగరిక సంప్రదాయాల కారణంగా ఇక్కడ 10 ఏళ్లు నిండకుండానే బాలికలకు పెళ్లి చేసేసి తమ చేతులు దులుపుకుంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. ఇక పేదరికంలో మగ్గే ముక్కుపచ్చలారని ఆడపిల్లలను ధనికులు, కొందరు వయోవృద్ధులు డబ్బును ఎరగా వేసి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా పుస్తకాలు పట్టుకునే వయసులోనే పెళ్లి పీటలెక్కుతున్న చిన్నారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. సరదాగా అందరితో కలిసి ఆడుకునే వయసులో అమ్మలై అనారోగ్యాలకు బలైపోతున్నారు. దీంతో పాటు ఆ దేశంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు, గృహహింస తారస్థాయికి పెరిగిపోతున్నాయి. ఇలాంటి అఘాయిత్యాలను దగ్గర్నుంచి గమనించిన నట్సిరైషా మరిస్టా అనే 17 ఏళ్ల అమ్మాయి వీటికి ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పెళ్లి కాని బాలికలకు, వివాహమై గృహ హింస, లైంగిక వేధింపులు ఎదుర్కొంటోన్న మహిళలకు తైక్వాండో నేర్పిస్తోంది. తద్వారా ఆ నరక కూపంలో మరెవరూ కూరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది.
మరెవరూ బలికాకుండా!
5 ఏళ్ల వయసు నుంచే తైక్వాండోపై ఆసక్తి పెంచుకుంది మరిస్టా. ఆమె తండ్రి ఓ సన్నకారు రైతు, కాగా తల్లి గృహిణి. అయినప్పటికీ తమ కుమార్తె ఆసక్తిని గమనించిన వారు తైక్వాండోలో రాటుదేలేలా తనను ప్రోత్సహించారు. ఈక్రమంలోనే తైక్వాండోలో ఛాంపియన్‌గా నిలిచి ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది మరిస్టా. ఇదే సమయంలో తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకుని ప్రత్యక్ష నరకం అనుభవించడాన్ని గమనించిందీ టీనేజ్ సెన్సేషన్. మరెవరూ ఆ నరక కూపంలో కూరుకుపోకుండా తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. అందుకు తనకు తెలిసిన విద్యనే ఆయుధంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా జింబాబ్వే రాజధాని హరారేకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి ప్రాంగణంలో పెళ్లి కాని చిన్నారులు, పెళ్లైన వారు, చిన్న వయసులోనే తల్లులైన అమ్మలందరికీ తైక్వాండో నేర్పుతోంది. తద్వారా బానిసల కంటే అధ్వాన్నంగా బతుకీడుస్తోన్న మహిళలకు జీవితంపై కొత్త ఆశలు రేకెత్తిస్తోంది మరిస్టా.
అందుకే ఈ ప్రయత్నం!
తైక్వాండో శిక్షణతో అమ్మాయిలందరినీ శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుస్తోంది మరిస్టా. దీంతో పాటు ఇప్పటికే బాల్య వివాహాలు చేసుకొని చిన్న వయసులోనే తల్లులుగా మారిన అమ్మాయిలతో ప్రత్యేకంగా కొన్ని తరగతులు నిర్వహిస్తోంది. బాల్య వివాహాలకు సంబంధించి వారి సాధక బాధకాలు చెప్పిస్తే ఇకపై జరిగే బాల్య వివాహాలను అడ్డుకోవచ్చనేది ఆమె ప్రయత్నం. ‘అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా 18 ఏళ్లు నిండే వరకు వివాహం చేయకూడదనే నిబంధన ఇక్కడ ఉంది. కానీ పేదరికం, అనాగరిక సంప్రదాయాల కారణంగా మా దేశంలో 30 శాతం మంది బాలికలు 10 ఏళ్లు నిండకుండానే పెళ్లి పీటలెక్కుతున్నారు. అందులోనూ కొవిడ్ మహమ్మారి అమ్మాయిల పరిస్థితులను మరింత అధ్వాన్నంగా మార్చింది. ఈ వైరస్ ప్రభావంతో బాల్యవివాహాల సంఖ్య ఇక్కడ తారస్థాయికి చేరింది. దీంతో నాకు తెలిసిన తైక్వాండో విద్యను అందరికీ నేర్పుతున్నా. పెళ్లి కాని బాలికలు, పెళ్లైన అమ్మాయిలు, తల్లులైన వారు నా వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. తైక్వాండోలో భాగంగా స్ట్రెచ్, కిక్, పంచ్, స్పార్.. వంటివన్నీ చేసే క్రమంలో వారు శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా మారుతారనే ఈ విద్యను నేర్పిస్తున్నాను.
ఇక రోజూ తైక్వాండో శిక్షణ పూర్తయ్యాక కాసేపు మహిళా సమస్యలపై అందరం కలిసి చర్చిస్తాం. ప్రధానంగా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని బాలికలు పడుతున్న మానసిక, శారీరక కష్టాలను అందరికీ వివరిస్తాం. మరెవ్వరికీ ఇలాంటివి జరగకూడదని, బాల్య వివాహాలను అరికట్టాలని వారికి చెబుతాం. ఇందులో భాగంగా టీన్ మదర్స్‌తో ప్రత్యేకంగా క్లాసులు కూడా ఏర్పాటుచేస్తున్నాం. స్వయంగా వారితో తమ సాధక బాధకాలు చెప్పిస్తేనైనా బాల్య వివాహాలకు చెక్ పెట్టచ్చనేది నా ఆశ-ఆశయం!’
అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే!
‘కొవిడ్ కారణంగా ప్రస్తుతం దేశమంతా కఠిన నిబంధనలు, ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో నేను కూడా సాధ్యమైనంత తక్కువ మందితో తైక్వాండో క్లాసులు నిర్వహిస్తున్నాను. సెషన్‌కు 15 మందికి మించకుండా శిక్షణ అందిస్తున్నాను. ఇక తైక్వాండోలో నేను సాధించిన విజయాలన్నీ మా అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే నాకు దక్కాయి. వారు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇక ఇప్పుడు కూడా శిక్షణలో భాగంగా హాజరైన అమ్మాయిలకు అవసరమైన ఫ్రూట్ జ్యూస్, బిస్కట్లు అందిస్తున్నారు. వారికి నేనెంతో రుణపడి ఉంటాను’ అని అంటోందీ టీనేజ్ సెన్సేషన్.