ఆమె తండ్రి ఓ రాజకీయనేతగా నిత్యం ప్రజా సేవలో తరిస్తున్నారు. తల్లి వైద్యురాలిగా రోగుల ప్రాణాలు కాపాడుతోంది. అక్కేమో ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా ప్రజలకు సేవ చేస్తోంది. ఇలా వీరందరినీ దగ్గర్నుంచి చూసిన ఆమె కూడా సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. తన కుటుంబ సభ్యుల స్ఫూర్తితో ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్‌లో చేరి ప్రజాసేవలో తరించాలనుకుంది. అందుకు తగ్గట్టే చక్కటి ప్రతిభ కనబరిచి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. తద్వారా తన కలను సాకారం చేసుకుంది. ఆమె ఎవరో కాదు.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలీ బిర్లా. యూపీఎస్సీ తాజాగా విడుదల చేసిన 89 మంది అభ్యర్థుల రిజర్వ్ జాబితాలో అంజలి కూడా చోటు దక్కించుకుంది.
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించింది!
ఐఏఎస్, ఐపీఎస్... లాంటి దేశ అత్యున్నత ప్రభుత్వోద్యోగాల్లో చేరాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సవాళ్లను ఎదుర్కొంటూ సహనంతో ప్రయత్నించినప్పుడే ఇలాంటి కొలువులు సొంతమవుతాయి. ఈ మేరకు సివిల్ సర్వీసెస్-2019 పరీక్షా ఫలితాలు గతేడాది ఆగస్టు 4న విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు గ్రూప్ ఎ, గ్రూప్ బి లాంటి కేంద్ర సర్వీసుల నియామకం కోసం మొత్తం 927 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. మెరిట్ క్రమంలో మొదటగా 829 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. తాజాగా రిజర్వ్ జాబితా నుంచి వివిధ సర్వీసుల కోసం మరో 89 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో లోక్‌సభ స్పీకర్ చిన్న కుమార్తె అంజలి కూడా ఉన్నారు. దిల్లీలోని రామ్జాస్ కాలేజీలో రాజనీతి శాస్ర్తం (ఆనర్స్) అభ్యసించిన అంజలి తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం విశేషం.
నా విజయం అక్కకే అంకితం!
ఇలా తాజాగా ఐఏఎస్‌కు ఎంపికయ్యానన్న విషయం తెలియగానే తెగ సంబరపడిపోయింది అంజలి. ‘నా తండ్రి( ఓం బిర్లా) రాజకీయ నేతగా దేశ ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తున్నారు. అమ్మ (అమితా బిర్లా) వైద్యురాలు. అక్క (ఆకాంక్ష) ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.. ఇలా మా కుటుంబ సభ్యులంతా ఏదో ఒక రకంగా ప్రజాసేవలో తరిస్తున్నారు. వారిని చూసి నేను కూడా సమాజానికి నావంతుగా ఏదైనా చేయాలనుకున్నాను. అందుకు సివిల్ సర్వీసెస్ సరైన మార్గమని అనుకున్నాను. ఇక సివిల్స్ సాధించే క్రమంలో నా సోదరి నాకు ఎంతగానో సహకరించింది. తన కారణంగానే మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాను. అందుకే నా విజయాన్ని అక్కకే అంకితమిస్తున్నాను. ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళా సాధికారతకు పెద్ద పీట వేయాలనుకుంటున్నా’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది అంజలి.
ఇంట్లో పండగ వాతావరణం!
ఇక తమ కూతురు సివిల్స్‌కు ఎంపికైందన్న విషయం తెలియగానే ఓం బిర్లా దంపతులు సంతోషంలో మునిగిపోయారు. ఇక పలువురు రాజకీయ ప్రముఖులు నేరుగా వచ్చి ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తోన్న రాజస్థాన్‌లోని కోట శక్తినగర్ నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే లాంటి ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఆమె మరెన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.