మనిషిలో ఆశను.. ఆశయాన్ని బతికించేది నమ్మకం... నమ్మకమే మనిషి లక్ష్యానికి ప్రాణవాయువు.. నమ్మకమే మనిషి విజయానికి శ్రీరామరక్ష.. అయితే ఇదే నమ్మకం లోపించినా లేదా మితిమీరినా కష్టమే సుమా..! నమ్మకం ఆత్మవిశ్వాసానికి పునాదులు వేసే మార్గం చూపించాలి.. కానీ అహంకారాన్ని ప్రేరేపించే తత్వానికి బీజాలు వేయకూడదు. అందుకే.. మనిషి తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా.. దానిని సన్మార్గం వైపు నడిపించే స్నేహితుడిగానే మలచుకోవాలి తప్ప.. లక్ష్యమనే సౌధానికి బీటలు వేసే శత్రువుగా మార్చుకోకూడదు. మరి ౨౦౨౦ కి గుడ్ బై చెప్పేసి, కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే వేళ - ఏ విషయంలో నైనా సరే మనం గట్టిగా నమ్మితే జరిగే మ్యాజిక్ ఏంటో ఓసారి చూద్దాం రండి!
అపజయానికి భయపడద్దు..
ఏదో ఒక విషయంలో విఫలమయ్యారని మొత్తం జీవితాన్నే కోల్పోయినట్లు భావించకూడదు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయని బలంగా నమ్మాలి. అయితే ఆ నమ్మకానికి మీ శ్రమ, అకుంఠిత దీక్ష తోడైతేనే తగిన ఫలితం దక్కుతుంది. కానీ చాలామంది మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, అతి నమ్మకంతో చేతులారా అవకాశాల్ని జారవిడుచుకుంటూ ఉంటారు. అలాంటి వారి జాబితాలో మీరు చేరకూడదు సుమా! మీరనుకున్న రంగంలో విజయం సాధించాలంటే మొదట మీకంటూ ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి శక్తివంచన లేకుండా నిజాయతీగా కృషి చేయాలి. అంత కష్టపడి పనిచేసినా కొన్ని సందర్భాల్లో విజయం మీకు కూతవేటు దూరంలోనే ఉండిపోవచ్చు. అలాంటప్పుడు ఆ ఓటమి నుంచే గెలుపు పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అంతే కానీ.. ఒక్క ఓటమితో సర్వస్వం కోల్పోయామనే ప్రతికూల దృక్పథానికి ఆహ్వానం పలకడం భావ్యం కాదు.

అవహేళనలనూ తట్టుకోవాలి..
అసాధ్యాలను సుసాధ్యం చేయచ్చా? పట్టుదల, దీక్ష ఉంటే 100% చేయచ్చు. అయితే అందులో ప్రయత్నలోపం ఉండకూడదు సుమా. ఒక సాధారణ పౌరుడు బిలియనీర్ అవ్వగలడా? అన్న ప్రశ్నకు సమాధానం 'అవును' అని నిర్మొహమాటంగా చెప్పచ్చు. కటిక పేదరికంలో పుట్టిపెరిగిన వారెందరో ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. అయితే కొన్ని సందర్భాల్లో మనం లక్ష్యసాధనలో ఉన్నప్పుడు మన ఉత్సాహాన్ని నీరుగార్చే విధంగా, మన ప్రయత్నాన్ని హేళన చేసే విధంగా కొందరు మాట్లాడుతుంటారు. అటువంటి అవహేళనలను సైతం తట్టుకుంటేనే జీవితంలో మనం ముందుకు వెళ్లగలం. ఎందుకంటే.. మనం మనకోసం జీవిస్తున్నాం తప్ప... ఏ ఒక్కరి కోసమో కాదు కదా..

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి..
మీ మీద మీకున్న నమ్మకం మీరు తలపెట్టిన కార్యానికి ఉపయోగపడాలంటే.. ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎంత నమ్మకంగా మీరు ఆ పనిని తలపెట్టినా అందులో సాధ్యాసాధ్యాలను కూడా బేరీజు వేసుకోవాలి. అందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి. దాని ప్రకారంగా మీ మజిలీని ప్రారంభించండి. అంతే తప్ప.. మనం చేసేయగలం? సాధించేయగలం? అని మితీమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తే.. కొన్ని సందర్భాల్లో ఎదురదెబ్బలు కూడా తగులుతాయని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు అప్పుడప్పుడు ప్రపంచ ఛాంపియన్లుగా పేరుపొందిన క్రీడాకారులే తమకన్నా తక్కువ ర్యాంకున్న ఆటగాళ్ల చేతిలో పరాజితులవ్వడం మనం చూస్తుంటాం. సమయం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటుందో.. ఎప్పుడు ఎదుటివారికి అనుకూలంగా మారుతుందో తెలుసుకోవడం కష్టం కాబట్టి, మనది బలమైన నమ్మకమే అయినా దానికి సరైన ప్రణాళిక, కష్టపడే తత్వం కూడా జత చేస్తేనే దేనిలోనైనా విజయం సాధించగలం.

'ఈగో' ని వీడండి..
నమ్మకం వేరు.. అహంకారం వేరు. ఎంత గొప్ప ప్రతిభావంతులైనా అహంతో వ్యవహరిస్తే పాతాళానికి పడిపోతారన్నది అందరికీ తెలిసిన సత్యమే. మీ మీద మీకు నమ్మకం ఉండడం మంచిదే. అయితే మీరే గొప్పవారని, మీరు చెప్పిందే వేదమని అనుకోవడం అవివేకం. అహం మనలోని విచక్షణను చంపేస్తుంది. ఎప్పుడైతే మనుషులు విచక్షణ కోల్పోతారో వారు తమది కాని లోకంలో జీవిస్తుంటారు. వాస్తవాలను పట్టించుకోరు. అయితే.. విజయతీరాలను చేరుకోవాలనుకొనే ఉన్నత లక్ష్యం కలవారు ఇటువంటి వాస్తవాలను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత మంచిది. లేకపోతే మీకు మీరే నమ్మకద్రోహం చేసుకున్న వారవుతారు.