Image for Representation
కలలు కనడం ఎవరైనా చేస్తారు. వాటిని సాకారం చేసుకునే దిశగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి అంతిమ లక్ష్యం చేరుకున్న వారే అసలైన విజేత అవుతారు. తమ కృషి, పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల సోనాల్ శర్మ. పేదరికం వెక్కిరించినా, ఆర్థికంగా ఆటంకాలు ఎదురైనా తన ఆశయాన్ని వీడలేదామె. సవాళ్లను సానుకూలంగా స్వీకరిస్తూనే తన కలను సాకారం చేసుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. అందుకే తన విజయంతో పలువురి ప్రశంసలందుకుంటోంది. మరి, ఇంతకీ ఎవరీ సోనాల్? ఏంటి ఆమె లక్ష్యం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
చదువు ఆగకూడదని!
సోనాల్ శర్మ... రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఈ అమ్మాయికి చదువంటే పంచ ప్రాణాలు. అందరు పిల్లల్లాగే ఉన్నత చదువులు అభ్యసించాలని, నలుగురిలో ఒక్కరిగా గుర్తింపు సంపాదించాలని అనుకుంది. అనుకోవడమైతే అనుకుంది కానీ అందుకు ఆర్థికంగా కాస్తో కూస్తో చదువుకయ్యే ఖర్చులు భరించే శక్తి ఉండాలి కదా... దురదృష్టవశాత్తూ ఆ స్థోమత కూడా లేని పేద కుటుంబం ఆమెది. సోనాల్ తండ్రి ఓ పాల వ్యాపారి. ఆయనకు సోనాల్‌తో పాటు మరో ముగ్గురు పిల్లలున్నారు. ఇంట్లో అందరూ కష్టపడితే కానీ పొట్ట నింపుకోలేని పరిస్థితి ఆ కుటుంబానిది. ఈ క్రమంలో తండ్రితో కలిసి సోనాల్ కూడా పశువుల పాకలో నిరంతరం శ్రమించేది. రోజూ ఉదయం 4 గంటలకు నిద్ర లేచే ఆమె పశువుల పాకను శుభ్రం చేయడం, పేడ ఎత్తడం, పాలు పితకడం, అనుకున్న సమయానికి వినియోగదారులకు సరఫరా చేయడం... వంటి పనులన్నీ చేస్తుండేది. అలా రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లోనూ బాగా చదువుకోవాలన్న తన కలను వీడలేదామె.
మూడు బంగారు పతకాలు!
పశువుల పాకలోనే అధిక సమయం గడుపుతూ వచ్చిన సోనాల్ బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎమ్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచి మూడు బంగారు పతకాలు సాధించడం విశేషం. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఎల్ఎల్ఎమ్ పూర్తి చేసిన ఆమె రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ (ఆర్జేఎస్)-2018కు ప్రిపేరవ్వాలని నిర్ణయించుకుంది. కానీ ఈ పరీక్షలో విజయం సాధించాలంటే ఆషామాషీ విషయమేమీ కాదు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే. ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సిందే. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో రోజూ సైకిల్ మీద కళాశాలకు వెళ్లి లైబ్రరీలో చదువుకుంది సోనాల్. అక్కడే నోట్స్ ప్రిపేర్ చేసుకుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి నాన్నకు సాయపడుతూనే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రివిజన్ చేసుకునేది. అలా ఎంతో కష్టపడుతూనే ఆర్జేఎస్ పరీక్ష రాసింది సోనాల్.
ఒక్క మార్కు తేడాతో!
గతేడాది చివరిలో ఆర్జేఎస్-2018 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపినప్పటికీ దురదృష్టవశాత్తూ కేవలం ఒక్క మార్కు తేడాతో అర్హుల జాబితాలో చోటు కోల్పోయింది సోనాల్. దీంతో ఆమె పేరు వెయిటింగ్ లిస్టులో ఉండిపోయింది. అయితే ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఏడుగురు సర్వీస్‌లో జాయిన్ కాలేదు. ఈ విషయం తెలుసుకున్న సోనాల్ తనకు అవకాశమివ్వాలని ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాజస్థాన్ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. దీనిని విచారించిన ఆ న్యాయస్థానం ఆ ఏడుగురు అభ్యర్థుల స్థానాల్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న వారితో భర్తీ చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీ నూనె డబ్బాలతో స్టడీ టేబుల్!
త్వరలో రాజస్థాన్ సెషన్స్ కోర్టులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు తీసుకోనుంది సోనాల్. తద్వారా మొదటి ప్రయత్నంలోనే ఈ అవకాశం దక్కించుకున్న యువతిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ‘నలుగురు పిల్లలను చదివించడానికి అమ్మానాన్న ఎంతో కష్టపడ్డారు. మా చదువుల కోసం లోన్లు కూడా తీసుకున్నారు. ఎన్నికష్టాలు ఎదురైనా ‘ఆడపిల్లలకు చదువు ఎందుకు?’ అని ఎవరూ నన్ను అడగలేదు. వారి శ్రమ వృథా పోకూడదని నేను కూడా బాగానే చదువుకున్నాను. ఇందుకోసం పశువుల పాకలోనే కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాను. ఖాళీ నూనె డబ్బాల సాయంతో అక్కడే ఓ స్టడీ టేబుల్‌ను ఏర్పాటు చేసుకున్నాను. ఓ పక్క పశువుల పాకలో పని చేస్తూనే, మరో పక్క చదువుకునే దాన్ని. ఇక చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు మాది పాల వ్యాపారం చేసే కుటుంబం అని చెప్పుకోవడానికి సిగ్గుపడేదాన్ని. కానీ నేడు మా నాన్న ఓ దూద్‌వాలా అని గర్వంగా చెప్పుకొంటాను. నా విజయం మా కుటుంబంలో ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చింది. ఇక వారందరినీ ఏ కష్టం రాకుండా చాలా సంతోషంగా చూసుకుంటాను’ అని చెబుతోందీ టీనేజ్ సెన్సేషన్.
సాధించాలన్న పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కాదని మరోసారి నిరూపించింది సోనాల్ శర్మ. ఈ క్రమంలో త్వరలో ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె తన విజయంతో ఎంతోమందికి స్ఫూర్తినిస్తోందంటూ పలువురు మెచ్చుకుంటున్నారు.