శాంటాక్లాజ్, క్రిస్మస్ తాత.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆనందంగా, మనస్ఫూర్తిగా బహుమతులందిస్తూ.. సంతోషపెడుతుంటాడు. ఆయన చెప్పే మాటలు వింటూ.. అందించిన కానుకలను స్వీకరించి మురిసిపోతుంటారు చిన్నారులు. అయితే క్రిస్మస్ తాత కేవలం ఇలా కానుకలందించేందుకు మాత్రమే పరిమితం కాలేదు.. మన జీవితానికి అవసరమైన ఎన్నో విషయాలను తన చేతల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఆయన చెప్పే విషయాలను గ్రహించి, వాటిని అలవర్చుకోవడం ద్వారా వ్యక్తిగా మనం ఎంతో ఎదగచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా...
సాయం చేసే గుణం..
క్రిస్మస్ తాత వస్తున్నాడంటేనే చిన్నారులంతా తమకు కావాల్సిన బొమ్మలు, చాక్లెట్లు తదితర బహుమతులు ఇస్తాడని ఎదురు చూస్తుంటారు. శాంటాక్లాజ్ కూడా క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బహుమతి అందిస్తూనే ఉంటాడు. తద్వారా తన సంతోషాన్ని ఇతరుల ఆనందంలో వెతుక్కొంటూ ఉంటాడు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మనస్ఫూర్తిగా ఇతరులకు మనం ఏదైనా ఇస్తే దానివల్ల ఎంతో సంతృప్తి కలుగుతుందని చెప్పకనే చెబుతున్నాడు శాంటా. అందుకే మనచుట్టూ ఎవరైనా అవసరార్థులు ఉంటే మనకున్న దాంట్లో వారికి కావాల్సిన సాయం చేసే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే ఎవరికి ఏది అవసరమో దాన్ని అందిస్తూ ఉంటాడు క్రిస్మస్ తాత. ఎవరికైనా సాయం చేసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది. దీని ద్వారా మనలోని స్వార్థగుణాన్ని వదులుకోవాలని మనకు అవగతమవుతుంది. అంతేకాదు.. దీనివల్ల మనకు ఎంతో సంతృప్తిగా కూడా అనిపిస్తుంది.. కావాలంటే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.

సంతోషంగా జీవించడం..
శాంటాక్లాజ్ ఎప్పుడూ మనసారా నవ్వుతూ, సంతోషంగా కనిపిస్తాడు. అంతేకాదు తన చుట్టూ ఉన్నవారందరినీ తన మాటల గారడితో ఆనందంలో ముంచెత్తుతాడు. ఇలా జీవితంలో ఎప్పుడూ మనం సంతోషంగా ఉంటూ, పక్కవాళ్లనీ సంతోషపెట్టాలనే సందేశాన్నిస్తాడు. క్రిస్మస్ తాత రాత్రి వేళల్లోనే బహుమతులను అందిస్తాడు. ఇలా మనం చీకట్లో ఉన్నప్పటికీ మన ముఖంలో ఆనందాల వెలుగుల్ని నింపేస్తాడు. దీనిలో మరో గూఢార్థం కూడా ఉంది. మనకు ఏవైనా బాధలు, ఇబ్బందులు ఉంటే.. వాటినే ఎక్కువగా తలుచుకుంటూ.. నిస్సహాయత అనే వూబిలో కూరుకుపోతూ ఉంటాం. ఫలితంగా ఎందులోనూ విజయం సాధించడం లేదనో లేదా చేపట్టిన పని పూర్తి చేయలేకపోతున్నామనే నిస్పృహల్లో మునిగిపోతుంటాం. ఇలాంటివన్నీ దూరం చేసుకొని, మనలోని సానుకూల అంశాలపై దృష్టి సారిస్తే.. మన జీవితంలో చీకటిని పారదోలి వెలుగులు నింపుకోవచ్చు. ఈ సందేశాన్నే రాత్రివేళ రహస్యంగా తానందించే చిన్న చిన్న బహుమతుల ద్వారా తెలియజేస్తున్నాడు మన క్రిస్మస్ తాత.
సమభావం..
శాంటాక్లాజ్ ఆస్తులు, అంతస్తులు.. సౌందర్యం.. వంటి అంశాల గురించి అసలు పట్టించుకోడు. అందరినీ సమానంగానే చూసే లక్షణం క్రిస్మస్ తాతకు మాత్రమే సొంతం. తాను ఎవరికి ఏదివ్వాలనుకొంటాడో అది ఇచ్చేస్తూ ఉంటాడు తప్ప వారి గురించి ఇతర విషయాలు పట్టించుకోడు. ముఖ్యంగా క్రిస్మస్ సమయంలో చిన్నపిల్లలు ఒక్కరిని సైతం విడిచిపెట్టకుండా అందరికీ కానుకలిస్తుంటారాయన. అంతేకాదు వీళ్లు మంచివారు.. వీళ్లు చెడ్డవాళ్లు అనే భేదాలేమీ క్రిస్మస్ తాతయ్యకు ఉండవు. శాంటా దృష్టిలో అందరూ సమానమే. దేవుడి ముందు అందరూ ఒకటే అనే భావన శాంటాది. ఈ లక్షణం కూడా మనం కచ్చితంగా అలవరచుకోవాల్సిన వాటిలో ఒకటి.
మంచి అనుబంధాలు..
శాంటాక్లాజ్ లక్ష్యం మనలోని బాధలను తొలగించి అందరినీ సంతోషంగా ఉంచడం. ఈ విషయంలో ఆయనకు ఎల్ఫ్స్, రెయిన్‌డీర్ సహకరిస్తుంటాయి. ఇవి లేకుండా శాంటాక్లాజ్‌ను వూహించడం కష్టం. శాంటాలోని ఈ మంచి విషయం.. మనం ఏదైనా సాధించాలనుకొన్నప్పుడు దాన్ని చేరుకోవడానికి సహకరించే స్నేహితులు మన చుట్టూ ఉండాలని తెలియజేస్తోంది. ఉదాహరణకు మనం మంచి ఉద్యోగం సంపాదించాలని భావిస్తున్నాం. అలాంటప్పుడు దాన్ని సాధించే దిశగా మనల్ని ప్రోత్సహించేవారు.. ఈ క్రమంలో ఎదురైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి సహకరించేవారు మన స్నేహితులుగా ఉండటం అవసరం. ఇలాంటి వారు మన స్నేహితులుగా ఉంటే లక్ష్యం చేరుకోవడం చాలా సులభమవుతుంది. అప్పుడే మరింత ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో పని పూర్తి చేసుకోగలుగుతాం.

బృందస్ఫూర్తి..
శాంటాక్లాజ్ దగ్గర మొత్తం ఆరుగురు ఎల్ఫ్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. వారిలో అలబాస్టర్ స్నోబాల్.. చిన్నారులు మంచి నడవడికతో ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు శాంటాకు తెలియజేస్తుంది. బుషీ ఎవర్గ్రీన్.. పిల్లలకు అందించాల్సిన బొమ్మల తయారీ విభాగానికి అధిపతి. పెప్పర్మిన్స్టిక్స్, షైనీ అప్ఏ ట్రీ.. ఇద్దరూ ఎప్పుడూ సీక్రెట్ విలేజ్‌లోని శాంటా వర్క్‌షాప్‌ని రక్షిస్తూ ఉంటారు. షుగర్ ప్లమ్.. స్వీట్స్ తయారుచేస్తుంది. వునోర్స్ ఓపెన్స్లే.. శాంటా స్లెడ్జ్‌ని తయారుచేస్తుంది.. అలాగే రెయిన్డీర్ని సంరక్షిస్తుంది. వీరంతా వేర్వేరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ అందరి అంతిమ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరినీ సంతోషంగా ఉంచడమే. ఇలా బృందస్ఫూర్తితో పనిచేసే లక్షణాన్ని మనందరం అలవాటు చేసుకొంటే మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.