ఫొటోగ్రఫీ.. అమ్మాయిలు చాలా అరుదుగా కనిపించే రంగం. సరదాగానో లేదంటే హాబీ అనో కొందరు కెమెరాలు క్లిక్‌మనిపించినా.. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీనే పూర్తిస్థాయి కెరీర్‌గా మలచుకున్న అమ్మాయిలు మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన అమ్మాయిల జాబితాలోకి వస్తుంది 23 ఏళ్ల ఐశ్వర్యా శ్రీధర్. చిన్నప్పుడు తండ్రితో కలిసి అడవికి వెళ్లి సరదాగా ఫొటోలు తీసిన ఆమె.. తన ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడించింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీనే కెరీర్‌గా మలచుకుని 12 ఏళ్ల నుంచే ప్రకృతి అందాలను ఫొటో ఫ్రేముల్లో బంధించడం మొదలుపెట్టింది. తన ఫొటోగ్రఫీ ప్రతిభకు తార్కాణంగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఈ టీనేజ్ సెన్సేషన్ తాజాగా ప్రతిష్ఠాత్మక ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. తద్వారా ఈ పురస్కారాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో ప్రతిభావంతులను, వారు ప్రదర్శించే సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేసేందుకు లండన్‌లోని ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ ఏటా ఓ పోటీ నిర్వహిస్తుంది. ఫొటోగ్రఫీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారంగా భావించే ఈ పోటీల్లో ఎలాగైనా విజేతగా నిలవాలని చాలామంది ఫొటోగ్రాఫర్లు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మేరకు ఈ ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుంచి సుమారు 50వేల మంది ఫొటోగ్రాఫర్లు తాము తీసిన ఫొటోలను ఈ పోటీలకు పంపించారు. చివరికి 100 ఫొటోలు ఎంపిక కాగా అందులో ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ పేరుతో ఐశ్వర్య తీసిన ఒక ఫొటో కూడా ఉంది. చెట్టు చుట్టూ తిరుగుతున్న మిణుగురులు, ఆకాశంలోని నక్షత్రాలను కలుపుతూ ఓ పాలపుంత(గెలాక్సీ) ఆకారమొచ్చేలా తీసిన ఈ ఫొటో న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ఈ క్రమంలో ఈ అందమైన ఫొటోను క్లిక్‌మనిపించిన ఐశ్వర్యను ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేశారు జ్యూరీ సభ్యులు. ఈ పురస్కారం కింద పదివేల పౌండ్ల (సుమారు రూ. పది లక్షలు) ప్రైజ్ మనీ, ట్రోఫీ, ప్రశంసా పత్రం అందుకుందీ యంగ్ సెన్సేషన్.
అలా ఈ ఫొటోను క్లిక్‌మనిపించాను!
ఐశ్వర్య తీసిన ఈ ఫొటో వచ్చే ఏడాది జూన్ 6 వరకు నేచురల్ హిస్టరీ మ్యూజియం అధికారిక వెబ్సైట్లో ప్రదర్శితం కానుంది. అంతేకాదు మ్యూజియం ప్రచారం, పర్యటనల కోసం కూడా ఏడాది పాటు ఈ ఫొటోనే వినియోగించనున్నారు. మరి ఇంత అద్భుతమైన ఫొటోను తను ఎలా క్యాప్చర్ చేసిందో ఈ సందర్భంగా షేర్ చేసుకుంది ఐశ్వర్య. ‘నేను గతేడాది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని భందర్దరా అడవుల్లోకి ట్రెక్కింగ్‌కి వెళ్లాను. రాత్రి సమయం కావడంతో అక్కడ ఓ చెట్టు చుట్టూ మిలమిలా మెరుస్తున్న మిణుగురులు నా కంట పడ్డాయి. మొదట ఫొటో ఫ్రేమ్‌లోకి చెట్టు, మిణుగురులను మాత్రమే తీసుకున్నాను. అయితే ఫ్రేమ్‌ని కొంచెం పెద్దగా చేసి చూస్తే నక్షత్రాలు, ఆకాశం కూడా కనిపించాయి. చెట్టు, మిణుగురులు, ఆకాశం, నక్షత్రాలను ఒకే ఫ్రేములో చూస్తే అదొక పాలపుంతలా కనిపించింది. దీంతో వెంటనే కెమెరా క్లిక్‌మనిపించాను. ఆ ఫొటోకి ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ అనే పేరు పెట్టి పోటీలకు పంపించాను’ అని చెప్పుకొచ్చింది.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా సత్తా చాటుతూ!
మహారాష్ట్రలోని పన్వేల్ నగరానికి చెందిన ఐశ్వర్య బాల్యంలో తండ్రి శ్రీధర్ రంగనాథన్‌తో కలిసి అడవుల పర్యటనకు వెళ్లేది. ఆ సమయంలో సరదాగా ఫొటోలు తీసిన ఆమె దానినే కెరీర్‌గా మార్చుకుంది. తల్లి రాణి సహకారంతో 12 ఏళ్లకే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారింది. మాస్ మీడియాలో డిగ్రీ పట్టా పొందిన ఆమె రైటర్, ఫిల్మ్ మేకర్‌గా కూడా సత్తా చాటుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వైల్డ్ లైఫ్, బెంగాల్ టైగర్స్‌పై కొన్ని డాక్యుమెంటరీలు తెరకెక్కించింది. అలాగే చిత్తడి నేలల పరిరక్షణకు కృషి చేస్తూ గతేడాది ప్రిన్సెస్ డయానా ఫౌండేషన్ పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇక లాక్డౌన్లో డిస్కవరీ ఛానల్లో ప్రసారమైన ‘నేచర్ ఫర్ ఫ్యూచర్’ సిరీస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఐశ్వర్య.. పేరు పొందిన సైంటిస్టులు, పర్యావరణ వేత్తలు, ఫొటోగ్రాఫర్లు, ఫిల్మ్మేకర్లను ఇంటర్వ్యూ చేసింది.
నాకు దక్కిన గొప్ప గౌరవమిది!
ఇలా తన ఫొటోగ్రఫీ ప్రతిభతో ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్న ఐశ్వర్య తాజాగా ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కూడా అందుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు ప్రపంచంలో అతి పిన్న వయసులో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అందరితో తన సంతోషాన్ని షేర్ చేసుకుంది ఐశ్వర్య.
‘యువ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా నాకు, దేశానికి ఈ పురస్కారం ఎంతో గర్వకారణం. పెద్దల విభాగంలో ఇండియా నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి, యువ ఫొటోగ్రాఫర్‌ను నేనే అని చెప్పుకోవడం పట్టరానంత సంతోషాన్నిస్తోంది. ఈ అవార్డు నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ సందర్భంగా జ్యూరీ, నా బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చిందీ యంగ్ ఫొటోగ్రాఫర్.
Photo: Twitter