పెళ్లిలో ఫొటోలకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కొత్తగా వివాహ బంధంలోకి అడుగిడబోతున్న దంపతులు తమ పెళ్లి జ్ఞాపకాలు పదికాలాల పాటు పదిలంగా ఉండాలని ప్రి వెడ్డింగ్ ఫొటోషూట్ తీయించుకోవడం పరిపాటిగా మారిపోయింది. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడాల్లేకుండా అందరూ ఈ నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. కొన్ని పెళ్లి జంటలు వినూత్న ఫోటోషూట్లతో వార్తల్లో నిలిస్తే, మరికొందరు సాహసోపేతంగా ఫొటోలు తీయించుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈక్రమంలో ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా తనకు ఇష్టమైన క్రికెట్ బ్యాట్ పట్టుకుని వెడ్డింగ్ ఫొటోషూట్‌లో పాల్గొంది బంగ్లాదేశ్ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్. పెళ్లి దుస్తులు, ఒంటి నిండా ఆభరణాలు ధరించి క్రికెట్ గ్రౌండ్‌లోనే బ్యాటింగ్ చేసింది. ఆటమీద ఆమెకున్న అభిమానానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా ఫిదా అయ్యింది. అందుకే తమ అధికారిక ట్విట్టర్లో సంజిదా ఫొటోలను షేర్ చేస్తూ అభినందనలు తెలిపింది.
భారతీయుల్లాగే బంగ్లాదేశీయులు కూడా క్రికెట్‌ను బాగా అభిమానిస్తారు. అందులో 24 ఏళ్ల సంజిదా ఇస్లాం కూడా ఒకరు. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే ఆమె దానినే కెరీర్‌గా మలచుకుంది. ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది.
2012 ఆగస్టులో బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు తరఫున ఐర్లాండ్‌పై తొలి మ్యాచ్ ఆడింది. తన 8 ఏళ్ల కెరీర్లో మొత్తం 16 వన్డేలు ఆడిన ఆమె 174 పరుగులు చేసింది. 54 టీ20 మ్యాచ్‌ల్లో 520 రన్స్ చేసింది. 2018లో ఆసియా కప్ గెలిచిన బంగ్లా జట్టులో సంజిదా కూడా సభ్యురాలు. ఫైనల్ పోరులో భాగంగా అప్పటికే ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ను ఓడించి ఈ ప్రతిష్ఠాత్మక కప్ అందుకుంది బంగ్లా మహిళల టీం.
క్రికెట్ థీమ్‌తో ప్రి వెడ్డింగ్ ఫొటోషూట్!
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ఉమెన్గా రాణిస్తోన్న సంజిదా.. రంగాపూర్‌కు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాద్ డీక్ను ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఈసందర్భంగా క్రికెట్ అంటే ప్రాణమిచ్చే సంజిదా అదే థీమ్‌తో ప్రి వెడ్డింగ్ ఫొటోషూట్ తీయించుకుంది. ఈ సందర్భంగా నారింజ రంగు పట్టు చీర, ఒంటి నిండా ఆభరణాలతో పెళ్లి కూతురిగా ముస్తాబై క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టింది. బ్యాట్ పట్టుకుని కవర్ డ్రైవ్, పుల్‌షాట్స్ ఆడుతున్నట్లుగా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆట మీద అభిమానంతో ఆమె తీయించుకున్న ఈ ప్రి వెడ్డింగ్ ఫొటోషూట్ ఐసీసీ దృష్టిని కూడా ఆకర్షించింది. ఈక్రమంలో ‘డ్రస్, ఆభరణాలు, క్రికెట్ బ్యాట్... క్రికెటర్ల వెడ్డింగ్ ఫొటోషూట్స్ ఇలాగే ఉంటాయి’ అన్న క్యాప్షన్‌తో తమ అధికారిక ట్విట్టర్లో సంజిదా ఫొటోలను షేర్ చేసింది.
చీరకట్టులో బ్యాటింగ్ స్టైల్ సూపర్బ్!
సంజిదా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలా ఆట మీద ఈ క్రికెటర్ చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘సంజిదా ఆలోచన అద్భుతం’, ‘క్రికెట్‌పై ఆమెకున్న ప్రేమకు హ్యాట్సాఫ్’, ‘చీరకట్టులో బ్యాటింగ్ స్టైల్ సూపర్బ్’, ‘లేడీ సచిన్’.. అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో ‘ఆమె వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలి’ అంటూ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
Photo: www.instagram.com/mistycricketer_10/