Photo: Screengrab
ఆ అమ్మాయి కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఆటలో అద్భుతమైన ప్రతిభ చాటి జాతీయ పతకం కూడా గెలుచుకుంది. దీంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో డజనుకు పైగా పతకాలు అందుకుంది. తన మరపురాని విజయాలతో దేశానికి, సొంత రాష్ట్రానికి మంచి పేరును తీసుకొచ్చిన ఈ క్రీడాకారిణి ప్రస్తుతం కడు దీన స్థితిలో ఉంది. ఉపాధి లేక, ఉద్యోగం దొరక్క, ఆపన్నహస్తం అందించే వారు లేక రైస్ బీర్ అమ్ముతోంది. మరి, ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏంటామె కథ? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి...
బిమ్లా ముండా... ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ ప్రాంతానికి చెందిన ఈ 26 ఏళ్ల కుస్తీ క్రీడాకారిణి గతంలో ఎన్నో మరపురాని విజయాలు సాధించింది. లెక్కలేనన్ని ప్రశంసా పత్రాలతో పాటు పతకాలు గెలుచుకుంది. జాతీయ వ్యాప్తంగా ఝార్ఖండ్ రాష్ఱ్రానికి ఎంతో మంచి పేరును తీసుకొచ్చింది. ఐదేళ్ల వయసులోనే కరాటే కోర్టులోకి అడుగుపెట్టింది బిమ్లా. చిన్నప్పటి నుంచి తాత, నాయనమ్మల దగ్గర ఉంటూనే కరాటే నేర్చుకుంది. అందులో బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది. 2008లో మొదటిసారిగా కరాటే టోర్నమెంట్లో పాల్గొన్న ఆమె... అదే ఏడాది జిల్లా స్థాయి పోటీల్లో మొదటి పతకం గెలుచుకుంది. 2009లో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో వెండి పతకంతో మెరిసింది. 2011 జాతీయ క్రీడల్లో సిల్వర్ మెడల్‌ను సాధించి దేశ వ్యాప్తంగా ఝార్ఖండ్ పేరు మారుమోగేలా చేసింది. 2014లో అక్షయ్‌కుమార్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు కూడా సొంతం చేసుకుంది. వీటితో పాటు ఎన్నో మరపురాని విజయాలు సాధించి పలువురి ప్రశంసలు అందుకున్న ఈ కరాటే ఫైటర్ నేడు ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. కుటుంబ సభ్యులందరూ అనారోగ్యం బారిన పడడం, జీవనాధారంగా ఉన్న కరాటే కోచింగ్ సెంటర్ కరోనా కారణంగా మూతపడడంతో ‘హండియా’ గా పిలిచే రైస్ బీర్‌ను అమ్ముతోంది.
పతకాలు కూడా రంగు మారిపోయాయి!
బాల్యం నుంచి కరాటేపై ఆసక్తి పెంచుకున్నప్పటికీ చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు బిమ్లా. ఆటలో అద్భుతమైన ప్రతిభ చూపుతూనే అకౌంట్స్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. అయితే ఈ పతకాలు, ప్రశంసాపత్రాలు, డిగ్రీ సర్టిఫికెట్లు ఆమెకు ఎలాంటి ఆసరానివ్వలేదు. తన ప్రతిభకు తార్కాణాలుగా నిలిచిన ఈ పతకాలను దాచుకోవడానికి సరైన సౌకర్యం కూడా లేదు. దీంతో కొన్ని పతకాలు దెబ్బతినగా, మరికొన్ని రంగు మారిపోయాయి. ప్రస్తుతం రాంచీలోని ఓ ఇంట్లో తల్లిదండ్రులు, తాతతో కలిసి ఉంటోంది బిమ్లా.
అందుకే రైస్ బీర్‌ను అమ్ముతున్నాను!
‘కరాటే లాంటి ఆటల్లో ముందుకెళ్లాలంటే ఆర్థిక ప్రోత్సాహం, చేయూత అవసరం. కానీ నాకు అలాంటి చేయూతను అందించేవారే కరువయ్యారు. నాన్న అనారోగ్యం బారిన పడి ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. ఇక దినసరి కూలీగా పని చేసి కుటుంబాన్ని పోషిస్తోన్న అమ్మ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇక 2000కు ముందే రిటైరైన తాతకు వచ్చే పెన్షన్ డబ్బులు ఆయన మందులకే సరిపోతున్నాయి. ఇక జీవనాధారం కోసం నేను ప్రారంభించిన కరాటే శిక్షణ కేంద్రం కూడా కరోనా కారణంగా మూతపడింది. ఇల్లు గడవడం కూడా గగనమై పోతుండడంతో ఇలా అమ్మతో కలిసి హండియా అమ్ముతున్నాను. గ్లాసు 4 రూపాయల చొప్పున రోజుకు సుమారు 70-80 గ్లాసుల రైస్ బీర్‌ను విక్రయిస్తున్నాను. ప్రస్తుతం ఈ ఆదాయంతోనే నా కుటుంబ సభ్యులను పోషిస్తున్నాను’ అని తన దీన స్థితి గురించి చెబుతోంది బిమ్లా.
మార్చిలో ఉద్యోగం వస్తుందన్నారు.. కానీ!
ఈ క్రమంలో స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది ఝార్ఖండ్ ప్రభుత్వం. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 33 మంది క్రీడాకారులు డైరెక్టుగా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించగా, అందులో బిమ్లా కూడా ఉంది. అయితే అంతలోనే ప్రభుత్వం మారిపోవడం, కరోనా వైరస్ విజృంభణతో ఈ నియామక ప్రక్రియ కూడా ఆగిపోయింది. ‘అన్ని అర్హతలు ఉండడంతో 2019లో విడుదల చేసిన ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్‌కు నేను కూడా దరఖాస్తు చేశాను. ఫిబ్రవరిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తియింది. మార్చి కల్లా తప్పకుండా నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్నారు. కానీ ఇంతవరకు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి నేను ఎలాంటి ఆర్థిక సహాయం ఆశించడం లేదు. కానీ ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి. కనీసం ఈ ఉద్యోగంతోనైనా నా కుటుంబాన్ని పోషించుకుంటాను’ అని దీనంగా వేడుకుంటోందీ కరాటే ఫైటర్.
ముఖ్యమంత్రి దృష్టికి!
ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ రిపోర్టర్ బిమ్లా దీనస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాకా ఈ విషయం వెళ్లింది. దీంతో ఆయన వెంటనే స్పందించి రాంచీ డిప్యూటీ కమిషనర్‌కు సమాచారం అందించారు. అదేవిధంగా బిమ్లా లాంటి క్రీడాకారులకు ఉపయోగపడేలా స్పోర్ట్స్ పాలసీని వెంటనే అమలులోకి తీసుకురావాలని స్పోర్ట్స్ సెక్రటరీని ఆదేశించారు. దీంతోపాటు మరి కొంతమంది దాతలు ఆమెను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చొరవతోనైనా బిమ్లా జీవితంలో వెలుగులు నిండుతాయని ఆశిద్దాం!