Photo: 3M Official Twitter
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఓవైపు కరోనా బాధితులకు ఉపశమనం కలిగించే మందుల్ని పలు ఫార్మసీ కంపెనీలు విడుదల చేస్తుండగా.. మరోవైపు ప్రయోగ దశలో ఉన్న కొన్ని టీకాలు ఒక్కో దశనూ విజయవంతంగా దాటుకుంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే తాను రూపొందించిన ఓ ప్రాజెక్ట్ కరోనా వైరస్‌కు రక్షణగా ఉండే ప్రొటీన్ పొరకు ముకుతాడు వేస్తుందని చెబుతోంది ఇండో-అమెరికన్ టీన్ అనికా చేబ్రోలు. అంతేకాదు.. ఈ ఆవిష్కరణ తనను ఈ ఏడాదికి గాను ‘3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్’లో గెలిచేలా చేసింది. ఇందుకు గాను సుమారు రూ. 18 లక్షలకు పైగానే నగదు బహుమతి అందుకున్న అనికా తన గురించి, తన ప్రయోగం గురించి ఇలా చెప్పుకొచ్చింది.
హాయ్.. నా పేరు అనికా చేబ్రోలు. యూఎస్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో మా కుటుంబంతో కలిసి నివసిస్తున్నా. గత రెండుమూడు రోజులుగా వార్తల్లో నా పేరు వినిపిస్తోంది. కొవిడ్-19కు వ్యతిరేకంగా నేను రూపొందించిన ప్రాజెక్ట్ వల్లే ఇదంతా! అయితే అందరిలాగే నేను కూడా ఈ కరోనా వైరస్ ఎప్పుడెప్పుడు అంతమవుతుందా? మళ్లీ మనమంతా ఎప్పుడెప్పుడు సాధారణ జీవితం ప్రారంభిస్తామా అని ఎదురుచూస్తున్నా.
ఆ వైరస్ బారిన పడ్డాకే..!
ప్రస్తుతం నేను 8వ తరగతి చదువుతోన్నా. నాకు సైన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇక మా తాతయ్య వల్ల ఆ మక్కువ మరింతగా పెరిగింది. ఆయన రసాయన శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. పిరియాడిక్ టేబుల్ గురించి, అందులోని మూలకాల గురించి ఆయన నాతో పదే పదే చెబుతుండేవారు. అలా ఒకానొక దశలో సైన్స్ అంటే విపరీతమైన ఇష్టం ఏర్పడింది. ఈ ప్రపంచం, ఇందులో మనం.. సైన్స్ లేకపోతే అంతా శూన్యం అనేది నా భావన. ఇలా నాకు ఇష్టమైన సబ్జెక్టును నేర్చుకోవడం వరకే పరిమితం కాకుండా.. దాన్ని నలుగురికీ ఉపయోగపడేలా చేయాలనుకున్నా. ఈ క్రమంలోనే 1918లో లక్షలాది మందిని బలి తీసుకున్న ఇన్ఫ్లుయెంజా వైరస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. ఇప్పటికీ ఈ వైరస్‌కు వ్యాక్సిన్, మందులు అందుబాటులో ఉన్నా ఇక్కడ ఏటా చాలామంది దీని బారిన పడి చనిపోతున్నారు. అంతెందుకు? నేను కూడా గతేడాది ఈ వైరస్ బారిన పడ్డా. ఇన్ఫ్లుయెంజా వైరస్‌కు సమర్థమైన చికిత్సను కనిపెట్టాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా.
కరోనా వైరస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా..!
అయితే ఇంతలోనే కరోనా వైరస్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపడంతో నా ప్రయోగాల్ని కొవిడ్-19కు చెక్ పెట్టే దిశగా కొనసాగించా. ఈ క్రమంలో ఇప్పటిదాకా మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిన మహమ్మారులు/వ్యాధులు, వైరస్లు, వాటిని అంతమొందించేందుకు రూపొందించిన మందుల గురించి బోలెడంత అధ్యయనం చేశా. ఈ నేపథ్యంలోనే ఇన్-సిలికో మెథడాలజీ అనే ప్రక్రియ ద్వారా ఒక అణువు (మాలిక్యూల్)ని కనుగొన్నా. దాని సహాయంతో కొవిడ్-19కు రక్షణ కవచంగా ఉండే ప్రొటీన్ పొరను కట్టడి చేయచ్చు. ఇలా నేను రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదికి గాను ‘3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్’లో (యూఎస్ ప్రిమియర్ మిడిల్ స్కూల్ కాంపిటీషన్‌గా దీన్ని పరిగణిస్తారు) గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు గాను రూ. 18 లక్షలకు పైగా నగదు బహుమతితో పాటు 3M మెంటార్షిప్ను కూడా గెలుచుకున్నా. అయితే ఇక్కడితో నా ప్రయత్నాన్ని ఆపను. నేను కనిపెట్టిన ఈ మాలిక్యూల్ కరోనా వైరస్‌ను చంపే మందుల తయారీలో ఎలా ఉపయోగపడుతుందన్న దానిపై నా పరిశోధనల్ని కొనసాగిస్తా. ఇందుకోసం శాస్త్రవేత్తలు, పరిశోధకులతో కలిసి పనిచేయడానికి ఉవ్విళ్లూరుతున్నా. ఇదొక్కటనే కాదు.. ఇలాంటి మహమ్మారుల వల్ల ఎదుర్కొనే అనారోగ్యాలు, మరణాలను నివారించడమే లక్ష్యంగా నా పరిశోధనల్ని, ప్రాజెక్టుల్ని కొనసాగిస్తా.
అంతర్జాలమే అతిపెద్ద ఆవిష్కరణ!
నేను పుట్టినప్పట్నుంచి పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎన్నో ఆవిష్కరణల గురించి తెలుసుకున్నా. వీటన్నింటిలోకెల్లా అతిపెద్ద ఆవిష్కరణ మాత్రం ‘అంతర్జాలమే’! ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతోందో క్షణాల్లో మనకు తెలియజేస్తుంది ఇంటర్నెట్. అలాగే మనం ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే దీని ద్వారానే లోతుగా తెలుసుకోవడం సాధ్యపడుతుంది. అలా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన ఈ అంతర్జాలం లేకపోతే మనందరం ఒక్క క్షణం కూడా ఉండలేమన్నది నిజం. అయితే దీన్ని అనవసర పనులకు కాకుండా మన నాలెడ్జ్‌ని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తే మనకు మరింత మేలు చేకూరుతుంది.