ఇటీవల కాలంలో అమ్మాయిలు, మహిళలపై బయటే కాదు...ఆన్‌లైన్‌లోనూ వేధింపులు ఎక్కువవుతున్నాయి. సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకుని చాలామంది నెటిజన్లు, యువకులు సైబర్ బుల్లీయింగ్‌కి పాల్పడుతున్నారు. అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ అమ్మాయిలను వేధిస్తున్నారు. అయితే వేధింపులకు గురై, దాని గురించి బాధపడుతూ లేదా ఎవరికీ చెప్పకుండా తమలోనే దాచుకుని కుమిలిపోతూ ఉండేవారు కొందరైతే... దాన్ని ధైర్యంగా ఎదుర్కొని, ముందుకొచ్చి ఆ వేధింపుల గురించి అందరికీ తెలిసేలా చేసేవారు మరికొందరుంటారు. ఈ రెండో కోవకు చెందుతుంది బెంగళూరుకు చెందిన ఈ యువతి. ‘Moose Jattana’ అనే పేరుగల ఈ ఇన్స్టాగ్రామ్ యూజర్ తన శరీరం గురించి అసభ్యకర కామెంట్లు చేసిన ఓ అబ్బాయికి తనదైన శైలిలో బుద్ధి చెప్పింది. అతడు భవిష్యత్‌లో మరోసారి అలాంటి తప్పులు చేయకుండా ఆ యువతి చేసిన పని ప్రస్తుతం అందరి మన్ననలు అందుకుంటోంది.

అసభ్యకర కామెంట్లు పెట్టడంతో..
లాక్డౌన్లో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయింది. ‘వర్క్ ఫ్రం హోం’ అంటూ చాలామంది మహిళలు ఇంటి దగ్గరే పని చేస్తున్నారు. స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకోకపోవడంతో చాలామంది అమ్మాయిలు ఇంటి దగ్గరే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో కొందరు యువకులు సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. అసభ్యకరమైన కామెంట్లు పెట్టి దుర్భాషలాడుతున్నారు. అయితే వీటిని పట్టించుకోకుండా తమలోనే దాచుకునే వారు కొందరైతే...మరికొందరు అసభ్యకర కామెంట్లు పెట్టిన వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తున్నారు. కానీ ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న ‘Moose Jattana’ అనే ఓ సోషల్ మీడియా యూజర్ మాత్రం చాలా తెలివిగా ఆలోచించింది. తన శరీరం గురించి ఆ అబ్బాయి పెట్టిన అసభ్యకర కామెంట్లను స్క్రీన్‌షాట్ తీసిన ఆ అమ్మాయి... వాటిని ౩౦ సెకండ్ల రీల్ వీడియోగా ప్రిపేర్ చేసి అతడి స్నేహితుడు, అతడు చదువుతున్న స్కూల్ యాజమాన్యానికి పంపింది.
అలా బుద్ధి చెప్పింది!
ఈ సందర్భంగా తనను వేధించిన అబ్బాయికి బుద్ధి చెబుతూ ఆమె ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ముందుగా తాను ఎదుర్కొన్న అసభ్యకర కామెంట్లను స్క్రీన్‌షాట్ తీసి ఓ డాక్యుమెంట్ లా తయారుచేసింది. అనంతరం అతడి సోషల్ మీడియా ప్రొఫైల్‌ను సెర్చ్ చేస్తూ ఫ్రెండ్స్‌ను ట్యాగ్ చేస్తూ అతడు షేర్ చేసిన కొన్ని ఫొటోలను ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ఓ ఫొటోలో అతడు ట్యాగ్ చేసిన ఓ స్నేహితుడికి ఆ స్క్రీన్షాట్లను పంపుతూ ‘యువర్ ఫ్రెండ్’ అనే మెసేజ్ చేసింది. ఆ తర్వాత మరొక ఫొటోలో అతడు చదువుతున్న స్కూల్‌కు సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. దీంతో గూగుల్ సహాయంతో ఆ పాఠశాల చిరునామా, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీలను తెలుసుకుంది. మొదట ఆ స్కూల్ కాంటాక్ట్ నంబర్‌కు కాల్ చేసిన ఆమె ఆ తర్వాత స్క్రీన్‌షాట్ డాక్యుమెంట్‌ను అటాచ్ చేస్తూ పాఠశాలకు ఓ మెయిల్ పంపింది. అంతేకాదు అతడిపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టనున్నట్లు ఆ మెయిల్లో చెప్పింది.

తనను వేధించిన అబ్బాయికి బుద్ధి చెబుతూ బెంగళూరు యువతి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ యువకుడి ఖాతాను ఇన్స్టాగ్రామ్ నిలిపివేయడంతో అందరూ ఆమె చేసిన ధైర్యాన్ని మెచ్చుకొంటున్నారు. మహిళలు, అమ్మాయిలందరూ తనను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు.