సాధారణంగా మనం వెళ్లే దారిలో అడ్డుగా ఓ తాడు కట్టారనుకోండి.. అది మరీ ఎత్తుగా ఉంటే కింది నుంచి వంగి వెళ్లడమో లేదంటే దాన్నే పైకి లేపి వెళ్లడమో చేస్తాం. కానీ కెనడాలోని అల్బర్టాకు చెందిన 17 ఏళ్ల ఓ అమ్మాయి మాత్రం అలాంటి బారికేడ్స్ కానీ, కంచెలు కానీ కనిపిస్తే వాటిపై నుంచి గుర్రంలా దూకేస్తూ, చెంగుచెంగున గెంతుతూ వెళ్లిపోతుంది. ఎందుకంటారా? తనకు అది వెన్నతో పెట్టిన విద్య. గుర్రాల్లా దూకడం, ఎంత ఎత్తు నుంచైనా వాటిలా జంప్ చేయడం నేర్చుకున్న ఆమె.. కాళ్లతో పాటు చేతుల్నీ నేలకు ఆనిస్తూ గెంతుతూ వచ్చి ఆ బారికేడ్లపై నుంచి జంప్ చేస్తుంటుంది. ఇలా ఆమెకు మాత్రమే సొంతమైన ఈ కళను అందరికీ పరిచయం చేయడానికి ఏకంగా ఓ సోషల్ మీడియా పేజీనే క్రియేట్ చేసుకుందీ టీనేజర్. అంతేనా.. తన నైపుణ్యంతో ఎంతోమంది మనసులు దోచుకుంటోందీ యువతి. మరి, ఇంతకీ ఎవరా అమ్మాయి? ఎంత ఎత్తు నుంచైనా గుర్రంలా అలా ఎలా దూకగలుగుతోంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
సాధారణంగా గుర్రపు స్వారీ పోటీల్లో గుర్రాలపై కూర్చున్న జాకీలు వాటితో వివిధ రకాల విన్యాసాలు చేయించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ కెనడాలోని అల్బర్టాకు చెందిన 17 ఏళ్ల అవా వోగెల్ మాత్రం తానే గుర్రం, తానే జాకీలా మారిపోయింది. కాళ్లతో పాటు చేతుల్నీ నేలకు ఆనిస్తూ గుర్రంలా పరిగెడుతూ వచ్చి కంచెలపై నుంచి అలవోకగా దూకేస్తోంది. అది ఎంత ఎత్తులో ఉన్నా, వరుసగా మూడు నాలుగు కంచెలు పక్కపక్కన పెట్టి ఉంచినా సరే.. వాటిని తాకకుండా గాల్లోనే జంప్ చేస్తూ అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
ఆరేళ్ల నుంచే..!
నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే అది ఎంత కష్టమైనా ఇష్టంగా నేర్చేసుకోవచ్చు. వోగెల్ కూడా ఇదే సూత్రం పాటించినట్లుంది. ఆరేళ్ల వయసు నుంచే ఈ విద్యను నేర్చుకోవడం ప్రారంభించిన ఈ కెనడియన్.. నేటికీ దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. గుర్రాలు ఎలా పరిగెడుతున్నాయి..? అవి ఎంత ఎత్తు నుంచైనా ఎలా దూకగలుగుతున్నాయి? దూకిన తర్వాత తిరిగి తమ వేగాన్ని ఎలా పుంజుకుంటున్నాయి? ఇలా తన ఆరేళ్ల వయసు నుంచే గుర్రాలను అణువణువూ పరిశీలించడం అలవాటు చేసుకుంది వోగెన్. అప్పట్నుంచి ఇప్పటిదాకా రోజురోజుకీ తన నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూనే ఉందీ హార్స్ గర్ల్.
గుర్రాల వీడియోలు చూస్తూ..!
ఇలా తనకు మాత్రమే సొంతమైన ఈ ప్రత్యేకతతో తాను చాలా హ్యాపీగా ఉన్నానని, అయితే ఈ విద్య నేర్చుకోవడం చెప్పినంత సులభం కాదంటోందీ టీనేజర్. ‘నేను మొదట్నుంచీ గుర్రాలకు సంబంధించిన వీడియోలు తెగ చూసేదాన్ని. ఈ క్రమంలో అవి ఎలా నిలబడతాయో నేనూ నా శరీరాన్ని అలా వంచేదాన్ని.. ఇక వాటిలా నడవడం, పరిగెత్తడం, దూకడం.. ఇలా క్రమంగా ప్రతిదీ నేర్చుకున్నా. అయితే అది చెప్పినంత సులభం కాలేదు.. దీనికి ఎంతో కఠోర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శరీర కండరాలను, ఎక్కువగా ఒత్తిడి పడే చేతుల మణికట్టు భాగాలను దృఢంగా మార్చుకోవడానికి ఎంతో సాధన చేశాను. ఇలా మొత్తానికి గుర్రాన్ని అనుకరించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నా..’ అంటోందీ కెనడా అమ్మాయి.
వావ్.. అద్భుతంగా చేసేస్తోందే!
ఇలా తన ప్రత్యేకత గురించి చెప్పడమే కాదు.. తానే గుర్రంలా మారి చేస్తోన్న ప్రతి విన్యాసాన్నీ వీడియోగా బంధించి ‘జంపింగ్ లైక్ ఎ హార్స్’ అనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది వోగెన్. ఇలా ఆమె చేస్తోన్న విన్యాసాలకు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘ఇంత కఠినమైన ఫీట్స్ అంత సునాయాసంగా ఎలా చేసేస్తోందీమె’ అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. అద్భుతంగా చేస్తోందంటూ కొందరు ఆమెను ప్రోత్సహిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమె ఫీట్లు మరీ వింతగా, విచిత్రంగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, ఎవరేమనుకున్నా తాను చేసేది మాత్రం చేస్తానని, అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటానని నిండైన ఆత్మవిశ్వాసంతో చెబుతోందీ హార్స్ గర్ల్. మరి, ఈ కెనడా అమ్మాయి గుర్రంలా దూకుతూ, అబ్బురపరుస్తోన్న కొన్ని విన్యాసాలపై మీరూ ఓ లుక్కేయండి!