మలాలా యూసఫ్‌జాయ్... బాలికల విద్య, హక్కుల కోసం తనదైన శైలిలో పోరాడుతున్న ఈ ధీరవనిత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 13 ఏళ్ల ప్రాయంలోనే తాలిబన్ల తూటాలకు గురై, మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆమె...తన పరిస్థితి మరే అమ్మాయికి తతెత్తకూడదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే ఉగ్రవాద దేశాల్లో ఉన్న శరణార్థుల పిల్లలకు విద్యనందించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచ వేదికలపై తన గళాన్ని వినిపించే ఈ టీనేజ్ సెన్సేషన్... ఇటీవల లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకుంది. ఈ నేపథ్యంలో వర్చువల్‌గా ఏర్పాటుచేసిన ‘ట్వీక్ ఇండియా సమిట్’లో ట్వింకిల్ ఖన్నాతో కలిసి పాల్గొన్న ఆమె... తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
లేకపోతే వారి బంగారు కలలను నాశనం చేసినట్లే!
అతిచిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి అందుకుని చరిత్ర సృష్టించింది మలాలా. తాలిబన్ల కాల్పుల తర్వాత బర్మింగ్‌హామ్‌లోనే నివాసముంటూ ఉన్నత చదువులు కొనసాగించిన ఆమె తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకుంది. ఈ సందర్భంగా ‘ట్వీక్ ఇండియా సమిట్’లో పాల్గొన్న ఆమె.. బాలికలకు విద్యను అందిస్తేనే సమాజం అన్ని రకాలుగా పురోగతి సాధిస్తుందని చెప్పుకొచ్చింది. ‘సరైన విద్య అందకపోతే సమాజంలో మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో నేను చాలా దేశాల్లో ప్రత్యక్షంగా చూశాను. బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, గృహహింస తదితర వాటిపై అవగాహన పెరగాలంటే అందరూ బాలికల విద్యను ప్రోత్సహించాలి. అలా చేయకపోతే వారి కలలను మనం నాశనం చేసినట్లే.’
నాన్నే నాకు స్ఫూర్తి!
‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం మా నాన్నే.. ఆయనకు మొత్తం ఐదుగురు సోదరీమణులు. వారిలో ఎవరూ స్కూల్కెళ్లి చదువుకోలేదు. కానీ అమ్మాయిలకు చదువు ప్రాధాన్యాన్ని ఆయన బాగా గ్రహించారు. సాధారణంగా ఇంట్లో మాలాంటి పిల్లల మాట ఎవరూ వినరు. కానీ ఆయన మాత్రం ఎంతో ఓపికగా మా మాటలు, సమస్యలు వినేవారు. అంతేకాదు.. ఎవరైనా మా మాటల మధ్యలోకి వస్తే డిస్టర్బ్ చేయద్దని వారిని వారించేవాడు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చే క్రమంలో మతపరమైన కట్టుబాట్లు, ఉగ్రవాదుల ఆంక్షలను ఆయన పట్టించుకోలేదు. నా ద్వారానే బాలికల పరిస్థితుల్లో మార్పులను తీసుకు రావాలనుకున్నాడు. నా తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే నేను తాలిబన్లకు వ్యతిరేకంగా గళం విప్పాను. అందుకే ఎప్పటికైనా నాన్నే నాకు స్ఫూర్తి’ అని చెప్పుకొచ్చిందీ టీనేజ్ సెన్సేషన్.
ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు!
బాలికల విద్య కోసం పాటు పడుతూ చిన్న వయసులోనే తాలిబన్ల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలిచింది మలాలా. 2012లో ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడి కోలుకుంది. ఈ సందర్భంగా అప్పటి క్షణాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయింది మలాలా.
‘అది 2009 సంవత్సరం. అప్పుడు నాకు 11 ఏళ్లుంటాయి. ఆ ఏడాది జనవరి 15న తాలిబన్ల అధికార ప్రతినిధి ఒకరు ఎఫ్ఎం రేడియో ద్వారా ఒక సందేశం వినిపించారు. బాలికల విద్యపై నిషేధం విధిస్తూ ఎవరూ స్కూళ్లకు వెళ్లకూడదన్నది ఆ సందేశ సారాంశం. అప్పటికి దేశంలో బాలికల విద్య, హక్కులపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. ఉగ్రవాదులు ఏ అర్ధరాత్రో వచ్చి ఎక్కడ దాడి చేస్తారన్న భయంతో ఎవరూ సరిగ్గా నిద్రపోయే వారు కూడా కాదు. అయితే మేం గట్టిగా మాట్లాడేంతవరకు ఈ పరిస్థితుల్లో మార్పు రాదని నేను గ్రహించాను. అందుకే ధైర్యంగా ముందుకు అడుగేశాను. తోటి బాలికలను చదువుకోమని ప్రోత్సహించాను. నాన్న నడుపుతోన్న పాఠశాలలోనే వారికి చదువుకొనే అవకాశం కలిగించాం. ఈ క్రమంలో పలుసార్లు ఉగ్రవాదుల నుంచి చంపుతామనే బెదిరింపులు వచ్చాయి. అయితే ఒకరోజు మాత్రం నాపై ప్రత్యక్షంగా తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఆ దాడి జరిగిన రోజు నాకేమీ గుర్తు లేదు (కన్నీరు పెట్టుకుంటూ). అందుకే దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయింది మలాలా.
రెస్టరంట్‌కు వెళతాను... సినిమాలు చూస్తాను!
ఓపక్క చదువుకుంటూనే... మరోవైపు సామాజికవేత్తగా ఉగ్రవాద దేశాల్లో ఉన్న శరణార్థుల పిల్లలకు విద్యనందించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది మలాలా. అదేవిధంగా ‘మలాలా ఫండ్’ ద్వారా విరాళాలు సేకరిస్తూ శరణార్థ అమ్మాయిల పురోగతికి పాటుపడుతోంది. ‘సమయం ఎంత విలువైనదో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అన్ని విషయాలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. ఈ క్రమంలో జీ-7, జీ-20 సదస్సులకు హాజరయ్యాను. ఇథియోపియా, నైజీరియా, లెబనాన్, కెన్యా వంటి దేశాల్లో పర్యటించాను. అక్కడ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాను. ఇక ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో గడపడానికే ఇష్టపడతాను. వారితో కలిసి రెస్టరంట్‌కు వెళ్లడమో, సినిమాలకు వెళ్లడమో చేస్తాను. ఇక నాకు క్రికెట్ చూడడమంటే ఆసక్తి. కాలేజీ రోజుల్లో కొన్ని క్లబ్‌ల తరఫున మ్యాచ్‌లు కూడా ఆడాను’ అని గుదిగుచ్చిందీ యువకెరటం.