Image for Representation
కరోనా సంక్షోభం కారణంగా కొన్ని నెలల పాటు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్లో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, కార్యాలయాలన్నీ మూతపడడంతో అందరూ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొందరు తమకు అభిరుచి ఉన్న రంగాలపై దృష్టి పెడితే.. మరికొందరు తమకు తెలిసిన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. అయితే కేరళకు చెందిన ఓ యువతి మాత్రం ఆన్లైన్ కోర్సులపై దృష్టి సారించింది. తన సృజనాత్మకత, అభిరుచులకు మరింత పదును పెడుతూ మూడు నెలల్లో ఏకంగా 350 ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసింది. తద్వారా యూనివర్సల్ రికార్డ్స్ ఫోరంలో స్థానం సంపాదించి ప్రపంచ రికార్డు సృష్టించింది.
లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ!
కేవలం అకడమిక్ చదువులతో ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేమన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో నలుగురిలో భిన్నంగా కనపడాలంటే కొన్ని సృజనాత్మక నైపుణ్యాలు తప్పనిసరి. ప్రత్యేకించి విద్యార్థుల భవిష్యత్‌కు ఇవే మార్గనిర్దేశనం చేస్తాయి. ఈ విషయాన్ని బాగా గ్రహించింది కేరళలోని ఎలమక్కరకు చెందిన 22 ఏళ్ల ఆరతి రఘునాథ్. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న రఘునాథ్, కళాదేవి దంపతుల కూతురైన ఆమె ప్రస్తుతం ఓ కళాశాలలో ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కొవిడ్ సంక్షోభం కారణంగా ప్రస్తుతం విద్యాసంస్థలన్నీ మూతపడడంతో ఇంటి దగ్గరే ఉండిపోయింది ఆరతి. అయితే లాక్డౌన్ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకున్న ఆమె.. తన అభిరుచి, నైపుణ్యాలకు మరింత పదును పెట్టాలనుకుంది.
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో!
ఆన్లైన్ కోర్సులనేవి ఎప్పటి నుంచో ఉన్నా లాక్డౌన్ కాలంలో వీటికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే క్రమంలో పలు యూనివర్సిటీలు విద్యార్థుల నైపుణ్యాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరతి తన కళాశాల ఫ్యాకల్టీ సహాయంతో అకడమిక్ పుస్తకాలు చదువుతూనే ఆన్లైన్ కోర్సులను నేర్చుకుంది. ఏవో ఆషామాషీ కోర్సులు కాకుండా... జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హెగెన్, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా… వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విదేశీ యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులను పూర్తి చేసింది. కంప్యూటర్ సైన్స్, మెడిసిన్, ఇంజినీరింగ్, లైఫ్‌స్కిల్స్... ఇలా అన్ని విభాగాల్లో అందుబాటులో ఉన్న ఈ కోర్సుల వ్యవధి సుమారు మూడు వారాల నుంచి ఆరునెలలు. ఈ మేరకు బయోకెమిస్ట్రీ స్టూడెంట్ అయిన ఆరతి బయాలజీ సబ్జెక్టుకు సంబంధించిన కోర్సులనే ఎక్కువగా ఎంచుకుంది. లాక్డౌన్లో కూడా కుదిరినప్పుడల్లా కళాశాలకెళ్లి చదువు కొనసాగించిన ఆమె మొత్తం 350 ఆన్లైన్ కోర్సులను పూర్తి చేయడం విశేషం.
అదే నా లక్ష్యం!
ఈ క్రమంలో అనతి కాలంలో అత్యధిక ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసి అందరినీ అబ్బురపరచిన ఆరతి యూనివర్సల్ రికార్డ్స్ ఫోరంలో స్థానం సంపాదించుకుంది. ‘ ప్రస్తుతం ఆన్లైన్లో బోలెడు కోర్సులున్నాయి. నా అకడమిక్ చదువులకు ఉపయోగపడే కోర్సుల వివరాలను మా కళాశాల ఫ్యాకల్టీని అడిగి తెలుసుకున్నాను. కళాశాల ప్రిన్సిపాల్ కోర్సెరా కో-ఆర్డినేటర్, క్లాస్ ట్యూటర్... తదితరుల సహాయంతో ఈ కోర్సులను పూర్తి చేయగలిగాను. నా రికార్డును చూసి అమ్మానాన్నలు కూడా చాలా సంతోషిస్తున్నారు. కళాశాల టీచర్ కావాలన్నదే నా లక్ష్యం’ అని అంటోందీ ట్యాలెంటెడ్ గర్ల్.
నేర్చుకోవాలన్న తపన, చేయాలన్న ఆసక్తి ఉండాలే గానీ లెక్కలేనన్ని ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని మనకున్న పరిధిలో మనకనువైన సమయాల్లో నేర్పుకోవచ్చు. ఇదే విషయాన్ని గ్రహించిన ఆరతి 350 ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసింది. తద్వారా అందరినీ ఆశ్చర్యపరిచి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. మరి ఆమె స్ఫూర్తితో మీరూ ఆన్లైన్ కోర్సులపై దృష్టి సారించండి. మీ నైపుణ్యాలను పెంచుకోండి.