Image for Representation
స్నాతకోత్సవంలో ఒక్క బంగారు పతకం సాధిస్తేనే ప్రపంచాన్నే జయించినంత సంబరపడతాం. మరి అలాంటిది ఏకంగా ఒకేసారి 18 బంగారు పతకాలు సాధిస్తే... ఆ ఆనందానికి ఆకాశమే హద్దవుతుంది. ప్రస్తుతం అలాంటి ఆనందోత్సాహంలోనే మునిగి తేలుతోంది కేరళకు చెందిన యమునా మేనన్. ఇటీవల బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఐయూ(నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ) నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్న ఈ చదువుల తల్లిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వంటి ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మొత్తం 18 బంగారు పతకాలు!
స్నాతకోత్సవం... డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన తర్వాత దానికి గుర్తింపుగా కళాశాల యాజమాన్యం విద్యార్థి చేతికి పట్టా అందించే అపూర్వమైన వేడుక. ఇలాంటి సందర్భంలో కనీసం ఒక బంగారు పతకమైనా సొంతం చేసుకోవాలని చాలామంది విద్యార్థులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో బెంగళూరులోని ప్రఖ్యాత ఎన్ఎల్ఎస్ఐయూ స్నాతకోత్సవం ఇటీవల వేడుకగా జరిగింది. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించారు. అదేవిధంగా వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన పలువురు విద్యార్థులకు మొత్తం 48 బంగారు పతకాలు అందజేశారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ మొత్తం 48 బంగారు పతకాల్లో పద్దెనిమిది మెడల్స్‌ను యమునే సొంతం చేసుకోవడం విశేషం. తద్వారా ఈ యూనివర్సిటీ చరిత్రలో అత్యధిక బంగారు పతకాలు సాధించిన విద్యార్థినిగా రికార్డుల కెక్కిందీ చదువుల తల్లి.
అ‘లా’ ఆసక్తి పెంచుకుంది!
కేరళలోని ఎర్నాకుళంకు చెందిన యుమున స్కూల్ డేస్‌లోనే నల్లకోటు వేసుకోవాలనుకుంది. ఇదేక్రమంలో ఇంటి పక్కనే నివాసముంటున్న లాయర్ చెప్పే కోర్టు రూం స్టోరీస్ కూడా తనను న్యాయవాద వృత్తి వైపు అడుగులు వేసేలా చేశాయి. కలను సాకారం చేసుకోవడంలో భాగంగా తన ప్రతిభను, హార్డ్ వర్క్‌ను మాత్రమే నమ్ముకుందీ చదువుల తల్లి. అనుకున్నట్లే 2015 CLAT (కాంపిటీటివ్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్) జాతీయ స్థాయి పరీక్షలో 28వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఆమె ప్రఖ్యాత బెంగళూరులోని ఎన్ఎల్ఎస్ఐయూలో సీటు సొంతం చేసుకుంది. CLAT లాంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో టాప్ ర్యాంకు సొంతం చేసుకోవడంతో యూనివర్సిటీ మంజూరు చేసే ప్రత్యేక స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు కూడా ఎంపికైంది. యూనివర్సిటీ పరిధిలో యమునతో మరొకరు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హత సాధించడం విశేషం.
నేనే టాపర్ అని తెలుసు.. కానీ..!
ఈ క్రమంలో అందివచ్చిన అవకాశాలన్నింటినీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ముందుగు అడుగులేసింది యమున. ఐదేళ్ల కోర్సులో భాగంగా ఏటా జరిగే వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ టాపర్‌గా నిలుస్తూ వచ్చింది. ఇక తాజాగా జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో ఓవరాల్ టాపర్, ఫస్ట్ ర్యాంక్, బెస్ట్ అవుట్గోయింగ్ స్టూడెంట్, బెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, బెస్ట్ అవుట్గోయింగ్ ఫిమేల్ స్టూడెంట్, మెరిటోరియస్ స్టూడెంట్, అవుట్ స్టాండింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్...ఇలా మొత్తం 18 బంగారు పతకాలను సొంతం చేసుకుందీ లా స్టూడెంట్.
సరికొత్త అనుభూతినిచ్చింది!
‘టాపర్‌గా నిలుస్తానని నాకు ముందే తెలుసు. అయితే ఇన్ని బంగారు పతకాలు అందుకుంటానని మాత్రం అసలు అనుకోలేదు. యూనివర్సిటీ చరిత్రలోనే అత్యధిక బంగారు పతకాలు గెలుచుకున్న విద్యార్థినిగా గుర్తింపు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రుల సమక్షంలో ఈ బంగారు పతకాలు అందుకుని ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. కానీ కొవిడ్ కారణంగా వర్చువల్‌గా స్నాతకోత్సవ వేడుక నిర్వహించడంతో కొంచెం నిరుత్సాహానికి గురయ్యాను. అయితే ఇలా ఆఫ్‌లైన్‌లో గ్రాడ్యుయేషన్ పట్టాలు, పతకాలు అందుకోవడం నాకు సరికొత్త అనుభూతినిచ్చింది. ఈ ప్రోత్సాహంతో నా ఉన్నత చదువులపై మరింత దృష్టి సారిస్తాను. స్కాలర్ షిప్ సహాయంతో మాస్టర్స్ కోర్సు పూర్తి చేసేందుకు ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ లా యూనివర్సిటీ, కేంబ్రిడ్జి ట్రినిటీ కాలేజ్ నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే నేను కేంబ్రిడ్జి ట్రినిటీ కాలేజ్‌లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ చదువుల తల్లి.
నల్లకోటు ధరించాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు తన ప్రతిభనే గట్టిగా నమ్ముకుంది యమున. దీనికి కొంచెం హార్డ్‌వర్క్‌ను జతచేసి అందివచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే లా డిగ్రీ పట్టాతో పాటు ఏకంగా 18 బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితర ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యమున మరెంతోమందికి స్ఫూర్తిదాయకమని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తూ అభినందనలు చెబుతున్నారు. మరి ఈ చదువుల తల్లి మరెన్నో ఉన్నత చదువులు చదవాలని, జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటూ మనమూ ఆమెకు కంగ్రాట్స్ చెబుదాం!