ఎన్నో నిగూఢ రహస్యాలను తనలో నింపుకున్న విశ్వం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ క్రమంలోనే కొంతమంది చిన్నతనం నుంచే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేస్తుంటారు. అందుకు తాజా ఉదాహరణే పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన 16 ఏళ్ల హిస్సా. అంతరిక్ష శాస్త్రం, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా నిర్వహించే ఇంటర్నేషనల్ స్పేస్ ఒలింపియాడ్ (ఐఎస్ఓ) క్విజ్ పోటీల్లో భాగంగా ఈ ఏడాదిగానూ సీనియర్ కేటగిరీలో టాపర్‌గా నిలిచిందీ అమ్మాయి. దీంతో అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నెడీ స్పేస్ సెంటర్‌ను ఉచితంగా సందర్శించే అద్భుత అవకాశాన్ని సైతం చేజిక్కించుకుందీ బ్రిలియంట్ గర్ల్. నాసా పిలుపు మేరకు త్వరలోనే అమెరికా పయనమవనున్న హిస్సా.. ఈ పిలుపు కోసమే ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నానని.. మొత్తానికి తన కల నిజమవబోతోందని సంబరపడిపోతోంది.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన 16 ఏళ్ల హిస్సా.. ప్రస్తుతం అక్కడి డీఏవీ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచే చదువులో మెరుగ్గా రాణించే హిస్సాకు.. అంతరిక్షం గురించి తెలుసుకోవాలన్న మక్కువ ఎక్కువ. ఈ క్రమంలోనే భవిష్యత్తులో అంతరిక్ష రంగంవైపు అడుగులు వేయాలనుకుంటోందీ పంజాబీ అమ్మాయి. ఇలా అంతరిక్ష శాస్త్రం, టెక్నాలజీ రంగాల్లో ఆసక్తి కనబరిచే విద్యార్థుల్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా నాసా ఏటా ‘ఇంటర్నేషనల్ స్పేస్ ఒలింపియాడ్ (ఐఎస్ఓ)’ పేరుతో ఓ క్విజ్ పోటీని నిర్వహిస్తోంది. అలా ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలో సీనియర్ విభాగంలో టాపర్‌గా నిలిచింది హిస్సా. దీంతో నాసాకు చెందిన జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్‌ను ఉచితంగా సందర్శించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది హిస్సా.
భారత్ నుంచి తొలిసారి..!
ఇంటర్నేషనల్ స్పేస్ ఒలింపియాడ్ క్విజ్ పోటీల్లో ప్రిలిమినరీ, ఇంటర్మీడియట్, ఫైనల్ టెస్ట్.. ఈ మూడు విభాగాల్లో కలిపి మొత్తంగా 78.75 మార్కులు సంపాదించింది హిస్సా. దీంతో ఈ పరీక్షల్లో సీనియర్ కేటగిరీలో టాప్ మార్కులు సంపాదించింది. అంతేకాదు.. సీనియర్ కేటగిరీలో నాసాకు వెళ్లే అవకాశం చేజిక్కించుకున్న తొలి భారతీయ విద్యార్థిగా నిలిచిందీ యువకెరటం. ఇలా తాను నాసాకు వెళ్లాలని ఎప్పట్నుంచో కన్న కల నేడు నిజమైందంటోందీ పంజాబీ టీన్. ‘నాసాకు వెళ్లాలనేది నా చిన్ననాటి కల. అది ఇప్పుడు నెరవేరబోతోంది. భవిష్యత్తులో ఆస్ట్రోఫిజిస్ట్ కావాలనేదే నా ఆశయం. నేను ఈ పరీక్షల కోసం గతేడాది సెప్టెంబర్‌లో దరఖాస్తు చేసుకున్నా. కరోనా కారణంగా తొలి దశ పరీక్షలు జనవరిలో, రెండో దశ జూన్‌లో, ఆఖరు దశ పరీక్షలు ఆగస్టులో నిర్వహించారు. ఈ క్విజ్ పోటీల్లో మన దేశంలోని విద్యార్థులతో పాటు సింగపూర్, స్విట్జర్లాండ్‌కు చెందిన స్టూడెంట్స్‌తోనూ పోటీ పడ్డా. పరీక్షా ఫలితాల్లో టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది..’ అంటోంది హిస్సా.
అమ్మానాన్నలదే క్రెడిటంతా!
తాను ఈ పరీక్షల్లో టాపర్‌గా నిలవడానికి అమ్మానాన్న ఎంతో ప్రోత్సహించారని అంటోంది హిస్సా. ‘మా నాన్న ఇంజినీర్.. అమ్మ ప్రభుత్వ పాఠశాలలో టీచర్. ఇక ఈ పోటీలో నేను రాణించేలా వీరిద్దరూ అనుక్షణం నా వెన్నంటే ఉన్నారు. నాన్న నాకు సైన్స్ గురించి బోలెడన్ని విషయాలు చెప్పారు. అలాగే అమ్మ అంతరిక్షం గురించి చాలా విషయాల్లో నాకు అవగాహన కల్పించింది. ఇలా నా మక్కువకు వీరి ప్రోత్సాహం కూడా తోడైంది.. ఫలితంగా గెలుపు నా సొంతమైంది’ అంటూ సంబరపడిపోతోంది హిస్సా. ఇలా ఆడపిల్లల ఇష్టాయిష్టాలు, అభిరుచుల్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తే ఆకాశానికి సైతం నిచ్చెన వేయగలరని తన విజయంతోనే నిరూపించిందీ బ్రిలియంట్ స్టూడెంట్.