చాలామందిలాగే తాను ఓ పెద్ద ఫుడీ. తనకు నచ్చిన ఆహారం మనసును సంతృప్తి పరిచేదాకా తినడం ఆమెకు అలవాటు. దీంతో చిన్నతనం నుంచే కాస్త ముద్దుగా బొద్దుగా ఉండే ఆమెతో పాటే ఆమె బరువూ పెరుగుతూ వచ్చింది. అయితే తన అధిక బరువుకు కారణం తన ఆహారపుటలవాట్లు, బిజీ లైఫ్‌స్టైలే అని గ్రహించిన ఆమె.. ఎలాగైనా బరువు తగ్గాలనుకుంది. ఆహారంలో మార్పులు చేసుకున్నా, కఠిన వ్యాయామాలు చేసినా అవి తాత్కాలికమే కావడంతో అసలు సమస్యేంటో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకుంది.. అప్పుడర్థమైందామెకు.. తన సమస్య పీసీఓఎస్ అని!
మరి, ఈ సమస్యను అదుపులోకి తెచ్చుకోవాలంటే మాట్లాడుకున్నంత సులభం కాదు.. మన జీవనశైలిలో చాలా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మనకు నచ్చిన కొన్ని ఆహార పదార్థాలను పక్కన పెట్టాలి. కానీ అందుకు ఆమె మనసు అంగీకరించలేదు. నచ్చినవి తీసుకుంటూనే ఈ సమస్యను అదుపులో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. ఈ క్రమంలో తాను సక్సెసవడమే కాదు.. ‘నచ్చినవి తింటూనే పీసీఓఎస్‌ను అదుపు చేసుకుందాం!’ అంటూ సాటి మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది. ఆమే పీసీఓఎస్ యాక్టివిస్ట్ నూతన సింగ్. ఉన్నట్లుండి చెఫ్ అవతారమెత్తి ‘ఈటింగ్ విత్ పీసీఓఎస్’ అనే బ్లాగ్ ని ప్రారంభించిందామె. దీని ద్వారా ఈ సమస్యతో బాధపడే మహిళలందరికీ సరికొత్త రుచుల్ని పరిచయం చేస్తూ స్ఫూర్తి నింపుతోన్న ఆమె తన పీసీఓఎస్ స్టోరీని ఇలా పంచుకుంది.
హాయ్.. నా పేరు నూతన సింగ్. అమెరికాలోని గయానాలో నివసిస్తున్నా. ‘ఈటింగ్ విత్ పీసీఓఎస్’ బ్లాగ్ ప్రారంభించడానికి ముందు నేనూ అందరిలాగే తెర వెనకే ఉండేదాన్ని. కానీ ఈ సమస్య నా ఒక్కదానిదే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు పీసీఓఎస్‌తో ఎన్నో ప్రత్యుత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయం నాకు ఈ పీసీఓఎస్ ఉందని తెలిశాక గానీ అర్థం కాలేదు. ఇక ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి నచ్చినా నచ్చకపోయినా తమ ఆహారపుటలవాట్లను మార్చుకోవాల్సి వస్తోంది. అదే నన్ను ఆలోచింపజేసింది.
******
నాకు చిన్నతనం నుంచీ ఆహారమంటే చాలా ఇష్టం. ఏ పదార్థమైనా నాకు నచ్చిందంటే దానిలోని రుచిని ఆస్వాదిస్తూ మరీ తినేదాన్ని. అందుకే చిన్నప్పటి నుంచే చాలా బొద్దుగా ఉండేదాన్ని. నాతో పాటే నా బరువూ పెరుగుతూ వచ్చింది. అయితే చిన్నతనంలో క్లాసికల్ డ్యాన్స్, యుక్తవయసులోకొచ్చాక యోగా సాధన చేశాను. అయినా ఏమాత్రం బరువు తగ్గలేదు. ఈ క్రమంలో నాకెంతో ఇష్టమైన జంక్‌ఫుడ్‌నీ మానేశా. మార్పు రాలేదు. ఇక చేసేది లేక ఓ జిమ్‌లో చేరాను. ఫిట్నెస్ ట్రైనర్ చెప్పిన మెలకువలు పాటిస్తూ, కఠిన వ్యాయామాలు చేయడంతో నా బరువులో కాస్త తగ్గుదల కనిపించింది. ఇదేదో వర్కవుటవుతోందని గ్రహించిన నేను.. వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ప్రారంభించా. అయితే ఈ సారి మార్పు నాకు ప్రతికూలంగా వచ్చింది. బరువు తగ్గడానికి బదులు క్రమంగా పెరగడం ప్రారంభమైంది.
ఇక యూనివర్సిటీ నుంచి ఇంటికొచ్చాక నా ఆరోగ్యం విషయంలో నాకే ఏదో తేడాగా అనిపించింది. ఎందుకైనా మంచిదని డాక్టర్ సలహా మేరకు కొన్ని పరీక్షలు చేయించుకున్నా. అప్పుడు తెలిసింది.. నా గర్భాశయంలో సిస్టులున్నాయని.. దానికి కారణం పీసీఓఎస్ అని! ఆ క్షణం ఒక్కసారిగా నేను ఒత్తిడిలోకి కూరుకుపోయా. ఆ సమయంలో నాకు డాక్టర్ గర్భనిరోధక మాత్రలు సూచించారు. అలాగే నా రిపోర్టులన్నీ నాకు తెలిసిన మరో డాక్టర్‌కి చూపించడంతో ఈ సమస్య గురించి నా మనసులోని సందేహాలన్నింటికీ సమాధానం దొరికినట్లయింది. నేను ఎంత ప్రయత్నించినా ఎందుకు బరువు పెరుగుతున్నానో అన్న విషయం అప్పుడు నాకు అర్థమైంది.
******
అధిక బరువు గురించి బాధపడకుండా నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటూ కసరత్తులు చేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే జిమ్ వ్యాయామాలతో పాటు పోషకాహారం గురించి నెట్లో బోలెడంత సమాచారం వెతికా.. దానిపై ఓ చిన్న పాటి అధ్యయనం చేసినంత పని చేశా! కొత్త కొత్త వంటకాల కోసం ఎక్కువ సమయం కిచెన్లోనే గడిపేదాన్ని. నిజానికి ఒక ఫుడీగా నచ్చిన ఆహార పదార్థాలను పక్కన పెట్టడమంటే చాలా కష్టమైన పని. నాలాగే ఆలోచించే మహిళలూ ఈ ప్రపంచంలో చాలామందే ఉంటారు. అందుకే ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి నచ్చిన ఆహారమే ఆరోగ్యకరంగా తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన నా మదిలో మెదిలింది. అదే ‘ఈటింగ్ విత్ పీసీఓఎస్’ బ్లాగ్‌కు నాంది పలికింది. ఇదే పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది. తక్కువ కార్బోహైడ్రేట్లుండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ పీసీఓఎస్‌ను అదుపు చేయాలన్నది నా బ్లాగ్ ముఖ్యోద్దేశం. ఈ క్రమంలోనే విభిన్న వంటకాలను, కొత్త కొత్త రెసిపీలను తయారుచేసి బ్లాగ్‌లో, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటా.
అంతేకాదు.. ఆహారం, జీవన శైలి విషయంలో నేను 80/20 రూల్ ఫాలో అవుతా.. అంటే 80 శాతం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే.. 20 శాతం మన మనసుకు నచ్చిన పదార్థాలకు ప్రాధాన్యమివ్వడం అన్నమాట! అది కూడా ఆరోగ్యకరంగా ఎలా తీసుకోవాలో వాటికి సంబంధించిన రెసిపీలు నా బ్లాగ్‌లో ఉంటాయి. ఇలా పీసీఓఎస్‌ను అదుపు చేసే వంటకాలను అందరితో పంచుకుంటూ నా వంతుగా ఈ సమస్యపై అవగాహన కల్పిస్తున్నాననుకుంటున్నా. నాలాగే చాలామంది పీసీఓఎస్‌ను త్వరగా గుర్తించలేకపోతున్నారు. వారి ఆరోగ్యాన్ని వారే నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు సమస్య ఉందని తెలిసినా భయం/బిడియంతో బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఏ సమస్యైనా ముందుగానే గుర్తిస్తే చికిత్స తీసుకొని దాన్ని నయం చేసుకోవడం, లేదంటే అదుపు చేసుకోవడం సులభమవుతుంది. పీసీఓఎస్కూ ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం మాని మీ సమస్య గురించి వైద్యులతో పంచుకోండి.. మీ అనుభవాలను నలుగురితో షేర్ చేసుకొని వారిలో స్ఫూర్తి కలిగించండి. అలాగే ఈ క్రమంలో మీ శరీరంలో కలిగే మార్పుల్ని అంగీకరించి.. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూనే పీసీఓఎస్‌ని అదుపు చేసుకోండి.. తప్పకుండా విజయం సాధిస్తారు.
మరి మీరూ మీ పీసీఓఎస్ అనుభవాలను వసుంధర.నెట్ వేదికగా మిగతా మహిళలతో పంచుకోండి. నూతన లాగా ఈ సమస్యను ఎలా అదుపు చేసుకుంటున్నారో వివరించండి. అలాగే ఈ సమస్యకు సంబంధించి మీకు తెలిసిన, మీరు పాటిస్తున్న సృజనాత్మక పరిష్కారాలు ఏవైనా ఉంటే ఈ వేదిక ద్వారా నలుగురితోనూ పంచుకోండి..