మనమేదైనా కొత్తగా, కాస్త ప్రత్యేకంగా చేద్దామంటే ఎందుకో ఈ సమాజం అస్సలు ఒప్పుకోదు. ‘పైసాకి కొరగాని ఆ పని చేస్తే ఎంత, చేయకపోతే ఎంత..’ అంటూ పైగా కసుర్లు, విసుర్లు! అలాంటి మాటలు పట్టించుకొని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటే మన ప్రత్యేకత ఏముంటుంది? మనలో ఉన్న కళ ఏమైపోతుంది? అచ్చం ఇలాగే ఆలోచించిందా అమ్మాయి. ఎవరైతే తన కళను కొరగానిదన్నారో అదే కళ కాసులు కురిపిస్తుందని నిరూపించాలనుకుంది.. సూటిపోటి మాటలతో తన ఆసక్తిని అవమానించిన వారే ‘తనని చూసి నేర్చుకో’ అని ఉదహరించేంత స్థాయికి ఎదిగింది. ఆమే.. మినియేచర్ క్రాఫ్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యామిని. కస్టమర్ల కలలకు తన క్రాఫ్టింగ్ కళతో ప్రాణం పోస్తూ, ‘మీకు మీరే సాటి’ అని వారితో ప్రశంసలందుకుంటోన్న ఈ యువ కళాకారిణి తన క్రాఫ్టింగ్ స్టోరీని ‘వసుంధర.నెట్’ తో ఇలా పంచుకుంది.

‘నాన్నా.. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం.. కాస్త ప్రోత్సహిస్తే ఇందులో కాసులు పండిస్తా..’ అన్నాను. ‘ముందు చదువు మీద దృష్టి పెట్టు. అదే మనకు తిండి పెడుతుంది.. ఆర్ట్స్, క్రాఫ్ట్స్‌కి బోలెడంత పెట్టుబడి పెట్టాలి.. అంత డబ్బు నా దగ్గర లేదు’ అన్నారు నాన్న. దీనికి తోడు ‘పైసాకి కొరగాని ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వెంట పడతావేంటి.. అయినా పేపర్లతో బొమ్మలు తయారుచేసి అమ్మితే ఎంత పరువు తక్కువ’ అంటూ బంధువుల సూటిపోటి మాటలు! ఇలా చిన్నతనం నుంచి క్రాఫ్టర్ కావాలనుకున్న నా కల కలగానే ఉండిపోయింది.
ఈ మాటల్లో పడిపోయి నా గురించి పరిచయం చేసుకోలేదు కదూ.. నా పేరు యామిని. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగా. చదువంతా ఇక్కడే సాగింది. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. అమ్మ గృహిణి. నాకో తమ్ముడున్నాడు. మధ్య తరగతి కుటుంబాల్లో చదువు, ఉద్యోగం అంటారే తప్ప పిల్లల్లో ఉన్న ఆసక్తిని అస్సలు గుర్తించరు. నా పరిస్థితీ అదే!

అది నా ఆశకు ఆయువుపట్టు!
అందుకే ఇక లాభం లేదనుకొని కనీసం ఫ్యాషన్ డిజైనింగ్ వైపైనా వెళ్దామనుకున్నా. కానీ ఆర్థిక పరిస్థితులు అందుకు అడ్డుపడ్డాయి. ఇక చేసేది లేక ఇంజినీరింగ్‌లో జాయినయ్యా. అసలు నేను అనుకున్నదేంటి.. చేసేదేంటి.. ఇంజినీరింగ్‌లో చేరా కదా.. ఇక నా కల కనుమరుగైనట్లే! అని బాధపడ్డా. కానీ ఆ కాలేజ్‌లోని ‘నేషనల్ ఎంట్రప్రెన్యూర్ నెట్వర్క్’ నా ఆశకు ఆయువు పోసింది. అదో స్టూడెంట్స్ కమ్యూనిటీ. విద్యార్థుల్లో ఉన్న సరికొత్త ఆలోచనల్ని ప్రోత్సహించడం ఆ కమ్యూనిటీ ముఖ్యోద్దేశం. అందులో నేను సభ్యురాలిగా చేరా. ఆ క్లబ్ వేదికగా ఓసారి నిర్వహించిన ఆర్ట్ ప్లాట్ఫామ్లో నా కళను నలుగురికీ పరిచయం చేశా. అందులో భాగంగా క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ తయారుచేసి అమ్మాను. అప్పుడు నా క్రాఫ్ట్స్‌కి వచ్చిన ఆదరణ చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నా కళను పరోక్షంగా ప్రోత్సహించేవారు ఇంతమంది ఉన్నారా అనిపించింది. నిజానికి చెప్పాలంటే ఆ ఇయర్ రింగ్స్ తయారుచేయడానికి నేను చేసిన ఖర్చు కేవలం రూ.300. కానీ వాటిని అమ్మగా నాకొచ్చిన మొత్తం రూ. 5000. ‘నీలో ఉన్న కళ వృథా’ అని అందరూ అంటుంటే.. నిజమేనేమో అనుకునేదాన్ని..! కానీ కాదని నిరూపించేసరికి నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. కాస్త సాన పెడితే నాలో దాగున్న కళతోనే కాసులు పండించచ్చని నిర్ణయించుకున్నా.

ఆ సలహా వర్కవుట్ అయింది!
ఈ క్రమంలోనే పెయింటింగ్స్‌పై దృష్టి పెట్టాను. నా ఫ్రెండ్స్ సలహా మేరకు Creart@Studios అనే ఇన్‌స్టా పేజీ క్రియేట్ చేసి నేను వేసిన చిత్రాలను అందులో అమ్మకానికి ఉంచాను. కానీ అనుకున్నంత స్పందన రాకపోవడంతో దాన్ని అలాగే వదిలేశా. ఈలోగా ఇంజినీరింగ్ పూర్తయింది. ఆ తర్వాత ఎంబీఏ అయినా చేద్దామనుకున్నా. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరోసారి నన్ను వెనక్కి లాగాయి. దాంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో వచ్చిన ఐటీ ఉద్యోగంలోనే చేరాల్సి వచ్చింది. ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లాను. ఉదయం నుంచి రాత్రి వరకు పనిలోనే సమయం గడిచిపోయేది. అయినా ఆర్ట్స్-క్రాఫ్ట్స్ పైన ఉన్న మమకారం అప్పుడప్పుడూ నన్ను పలకరిస్తూ ఉండేది. అలా ఓవైపు జాబ్ చేస్తూనే.. మరోవైపు వారాంతాల్లో పెయింటింగ్స్ వేసేదాన్ని. అయితే ఓసారి నా కొలీగ్ ఒకరు వాళ్ల ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి నా సలహా అడిగారు. క్రాఫ్ట్ బుక్ తయారుచేసి ఇవ్వచ్చుగా అని చెప్పా. ‘అదేదో నువ్వే చేసివ్వు’ అనడంతో సరేనన్నా. అది అందుకున్న వాళ్ల దగ్గర్నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ నాకు మరింత ప్రోత్సాహకరంగా అనిపించింది. ఆ తర్వాత ఇతర కొలీగ్స్‌కి కూడా కొన్ని క్రాఫ్ట్స్ చేసిచ్చాను. అయితే నాకు తెలిసిన వాళ్లకే కాదు.. తెలియని వాళ్లకూ నాలోని కళను పరియం చేయాలనే ఆలోచన అప్పుడొచ్చింది. అదే WE_CRAFT16 కి ప్రాణం పోసింది.

బాలేదంటూ వంకలు పెట్టేవారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పేజైతే స్టార్ట్ చేశా.. కానీ ఒక ఉత్పత్తిని ఎలా మార్కెటింగ్ చేయాలో కూడా నాకు అప్పటికి సరైన అవగాహన లేదు. అయినా నేను చేసే క్రాఫ్ట్స్ ఫొటోలన్నీ ఆ పేజీలో పెట్టేదాన్ని. ప్రైవేట్ అకౌంట్‌గా ఉన్న పేజీని బిజినెస్ అకౌంట్‌గా మార్చితే మరింతమంది కస్టమర్లను ఆకర్షించచ్చనుకొని ముందడుగేశా. అలా నెమ్మదిగా నా క్రాఫ్ట్స్‌కి స్పందన రావడం మొదలైంది. అయితే ప్రారంభంలో నెలకు రెండు మూడు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. అందులోనూ నేను చెప్పే ధర వారికి నచ్చేది కాదు.. నా కష్టం వారికి అర్థమయ్యేది కాదు.. ‘ఇంత చిన్నదానికే అంత డబ్బు పెట్టి కొనాలా?’ అనేవారు. చేసిన క్రాఫ్ట్స్‌కి ఏవేవో వంకలు పెట్టేవారు. అయినా మారు మాట్లాడకుండా ఒక్కోసారి నేను పెట్టిన మొత్తం కంటే తక్కువ ధరకే అమ్మేదాన్ని. కానీ ఆ తర్వాత మార్కెటింగ్ నైపుణ్యాల్ని ఒక్కొక్కటిగా నేర్చుకోవడం మొదలుపెట్టా. కస్టమర్లతో ఎలా మాట్లాడాలి? ఒక ఉత్పత్తి గురించి వారికి ఎలా వివరించాలి? ఉత్పత్తి విలువ ఎలా పెంచుకోవాలి? అన్న అంశాలపై చాలా విశ్లేషణ చేశాను. ఇందుకోసం ఆన్లైన్లో బ్లాగ్స్ చదివేదాన్ని. యూట్యూబ్‌లో మెలకువలు తెలుసుకునేదాన్ని. అలా ఓవైపు నా క్రాఫ్ట్స్ నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంటూనే.. మరోవైపు నా కష్టం కస్టమర్లకు అర్థం చేయించడానికి దాదాపు ఆరు నెలలు పట్టింది.

నా క్రాఫ్ట్స్ ప్రత్యేకత అదే!
క్రాఫ్ట్స్ తయారుచేయడానికి మొదట్లో పేపర్స్, కార్డ్బోర్డ్స్ వాడేదాన్ని. ఇప్పుడు ఫోమ్ బోర్డ్‌ని వాడుతున్నా. అయితే ఇప్పటికీ వీటి తయారీ కోసం నా వద్ద ప్రత్యేకమైన మెషినరీ అంటూ ఏమీ లేదు. కస్టమర్ల ఆలోచనల మేరకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పర్సనల్ మీట్స్, ప్రపోజల్, ఇతర ప్రత్యేక సందర్భాలు.. ఇలా వారు చెప్పిన థీమ్‌ని బట్టి క్రాఫ్ట్స్ తయారుచేస్తుంటా. ఈ క్రమంలోనే కస్టమర్ల దగ్గర్నుంచి థీమ్ స్టోరీ కలెక్ట్ చేసుకొని.. ఆ కథలోని పాత్రలను మట్టితో చిన్న చిన్న మినియేచర్స్లా తయారుచేసి ఒక బాక్స్‌లో పొందుపరుస్తా. ఆ బాక్స్‌కి హంగులద్దడానికి నేనే ప్రత్యేకంగా ప్రింట్స్ తయారుచేసుకుంటా. అయితే నా చేతిలో రూపుదిద్దుకునే ప్రతి క్రాఫ్ట్‌కి నా మార్క్ ఉండాలనేది నా తాపత్రయం. అందుకే స్క్రాప్ బుక్ అయినా, మినియేచర్ క్రాఫ్ట్ అయినా దానికి ఒక ఆకట్టుకునే పేరు పెడతాను. దాని కింద ఒక చిన్న స్టోరీ రాస్తా. ఇలా నా క్రాఫ్ట్స్ ప్రత్యేకత చూసి చాలామంది కస్టమర్లు నన్ను ప్రశంసిస్తుంటే నాలో కలిగే ఆనందం, ఉత్సాహం వర్ణనాతీతం. అయితే వారిచ్చే ఫీడ్‌బ్యాక్ విషయంలో మాత్రం నేను అస్సలు రాజీ పడను. ఎందుకంటే అదే కదా నన్ను నేను ఇంకా ఏయే అంశాల్లో మెరుగుపరచుకోవాలో తెలిపేది!

లాక్డౌన్ నాకు ప్లస్!
నా క్రాఫ్టింగ్ పేజీ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర దాటింది. ఈ క్రమంలో పనిలో నా వేగాన్ని, ఉత్పత్తి నాణ్యతను పెంచుకున్నా. దాంతో ఒకప్పుడు నెలకు రెండు మూడు ఆర్డర్లు రావడమే గొప్ప అనుకున్న నాకు.. ఇప్పుడు నెలకు నలభైకి మించి ఆర్డర్లొస్తున్నాయి. అందులో విదేశీయులూ ఉన్నారు. ప్రస్తుతం నాకు ఒక్కో క్రాఫ్ట్ తయారుచేయడానికి రెండు రోజుల సమయం పడుతుంది. అయితే అది కూడా ఒకేసారి రెండు మూడు క్రాఫ్ట్స్‌పై దృష్టి పెట్టి వాటిని పూర్తి చేస్తున్నా. ఈ క్రమంలో నాన్న, తమ్ముడు నాకు చాలా సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా మొదట్లో ‘నువ్వు ఇది చేయడానికి వీల్లేదు’ అన్న నాన్నే ఇప్పుడిలా నన్ను ప్రోత్సహిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక ప్రస్తుతం ఇంటి నుంచే ఉద్యోగం చేస్తోన్న నాకు లాక్డౌన్ మరింత ప్లస్ అయింది. ఈ సమయంలో చాలామంది బోరింగ్‌గా ఫీలయ్యారు. కానీ నాకు మాత్రం ఆర్డర్ల మీద ఆర్డర్లొస్తున్నాయి. నా ఫాలోవర్ల సంఖ్య కూడా అమాంతం రెట్టింపైంది.

ఇది నాతోనే ఆగిపోకూడదు!
ఇలా ఓవైపు ఉద్యోగం, మరోవైపు క్రాఫ్ట్స్ తయారుచేస్తూనే ‘డ్రస్ మై క్రాఫ్ట్’ (క్రాఫ్ట్స్ మెటీరియల్స్ అమ్మే సంస్థ) అనే ఇంటర్నేషనల్ బ్రాండ్‌కి ఇన్ఫ్లుయెన్సర్గా కూడా వ్యవహరిస్తున్నా. ప్రస్తుతానికైతే ఇలా నా బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇలా ఇన్ని పనులు ఒక్కరే ఎలా బ్యాలన్స్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఏదైనా ఇష్టంగా చేస్తే అందులో కష్టమేముంది చెప్పండి! ఇన్‌స్టా పేజీకే నా క్రాఫ్ట్స్‌ని పరిమితం చేయాలని నేను అనుకోవట్లేదు. త్వరలోనే నాకంటూ సొంత వెబ్సైట్ ప్రారంభించే పనిలో ఉన్నా. క్రాఫ్టింగ్ ద్వారా మరింతమందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నా. క్రాఫ్ట్స్ తయారుచేయడమే కాదు.. అందుకు ఉపయోగపడే వస్తువుల్నీ అమ్మాలనే ఆలోచన ఉంది. క్రాఫ్ట్స్ తయారీ గురించి ఆన్లైన్ ట్యుటోరియల్స్ చెప్పమని చాలామంది నన్ను అడుగుతున్నారు. త్వరలోనే వారి కలను కూడా నెరవేర్చబోతున్నా. ఇలా భవిష్యత్తులో పూర్తిగా క్రాఫ్టింగ్ పైనే దృష్టి పెట్టేందుకు సమాయత్తమవుతున్నా.
భవిష్యత్తు మనదే!
ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అంటే చాలామందిలో చులకన భావం ఉంది. దాని వల్ల సమయం వృథా, పెట్టిన పెట్టుబడి వ్యర్థం తప్ప మరే ప్రయోజనం ఉండదనుకుంటారు. కానీ ఈ కళతో కాసుల వర్షం కురిపించచ్చు. అందుకు నేనే ఉదాహరణ. కరోనా ప్రభావంతో చాలామంది ఉద్యోగం పోయింది. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. అలాంటి వారు ‘నాకు ఉన్న ఉపాధి కూడా పోయిందే’ అని బాధపడకుండా.. మీలో ఉన్న కళను నిద్రలేపండి.. దానికి మీ ప్రత్యేకతల్ని అద్దండి.. చక్కటి ఉపాధి మార్గంగా మలచుకోండి. నలుగురికీ స్ఫూర్తిగా నిలవండి. మన దేశంలో కళలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోన్న ఈ తరుణంలో ధైర్యంగా అడుగు ముందుకేయండి. ముందున్న భవిష్యత్తంతా మనదే! ఇష్టపడితే ఏదీ కష్టమనిపించదు! దేన్నైనా విశ్లేషించి నేర్చుకుంటే విజయం తప్పక వరిస్తుంది. నా సక్సెస్ సీక్రెట్ కూడా అదే!
- కె. గౌతమి