ఈషా అంబానీ... ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ముద్దుల కుమార్తె. వ్యాపార రంగంలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందామె. తండ్రి ఆలోచనలకు అనుగుణంగా సంస్థకు సంబంధించిన వ్యవహారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటోన్న ఈషా.. ప్రస్తుతం రిలయెన్స్ రిటైల్స్, జియో బోర్డుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. తన వ్యాపార దక్షతతో సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆమె తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫార్చ్యూన్ సంస్థ ‘40 అండర్ 40’ పేరిట విడుదల చేసిన అత్యంత ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో చోటు సంపాదించుకుందీ అంబానీ వారి ఆడపడుచు. ఆమెతో పాటు ఆకాశ్ అంబానీ ఈ జాబితాలో స్థానం దక్కించుకోవడం విశేషం.
వ్యాపార రంగంలో రాణిస్తూ ఆయా సంస్థల అభివృద్ధికి పాటుపడడమే కాకుండా తోటివారిని తమ విజయాలతో ప్రభావితం చేసే వ్యాపారవేత్తల జాబితాను ఫార్చ్యూన్ సంస్థ ఏటా విడుదల చేస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది కూడా 40 ఏళ్ల వయసు లోపు ఉన్న 40 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యాపారవేత్తల జాబితాను విడుదల చేసింది. ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్, ప్రభుత్వం-రాజకీయాలు, మీడియా-ఎంటర్టైన్మెంట్ విభాగాల నుంచి ఈ లిస్ట్‌ను తయారుచేసింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీకి సంబంధించి అత్యంత ప్రభావం చూపుతున్న ప్రముఖుల జాబితాలో ఈషా అంబానీ, ఆకాష్ అంబానీ చోటు దక్కించుకున్నారు. రిలయన్స్ జియో బోర్డులో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ కవల పిల్లల వయసు కేవలం 28 ఏళ్లే కావడం విశేషం.
రిలయన్స్ జియో ఏర్పాటులో కీలక పాత్ర!
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల గారాల పట్టి అయిన ఈషా అంబానీ 1991, అక్టోబర్ 23న జన్మించింది. ముంబయిలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె ఉన్నత చదువులన్నీ అమెరికాలోనే సాగాయి. అక్కడి యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె కొద్ది రోజుల పాటు న్యూయార్క్‌లోని ఓ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పని చేసింది. అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన ఈషా తండ్రికి సంబంధించిన సంస్థ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంది. ఇక నాలుగేళ్ల క్రితం టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్ జియో సంస్థ ఏర్పాటులో ఈ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ కీలకపాత్ర పోషించింది. దేశీయులకు అందుబాటు ధరల్లో, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించాలన్న ఆమె సంకల్పంతోనే రిలయన్స్ జియోని ప్రారంభించినట్లు ముఖేష్ అంబానీ ఒకానొక సందర్భంలో ప్రకటించారు.
తండ్రి ఆలోచనలకు అనుగుణంగా!
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పట్టా అందుకున్న ఈషా 2008లో ఫోర్బ్స్ యంగెస్ట్ బిలియనీర్ వారసుల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. అదేవిధంగా 2015లో ఆసియాలో శక్తిమంతమైన భవిష్యత్ వ్యాపారవేత్తల జాబితాలోనూ మెరిసింది. ప్రస్తుతం రిలయన్స్ జియో బోర్డులో కీలక పాత్ర పోషిస్తోన్న ఆమె 2018 డిసెంబర్లో ఆనంద్ పిరమల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇక బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్ర్తంలో పట్టా పుచ్చుకున్న ఆకాశ్ అంబానీ 2014లో కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇలా తండ్రి ఆలోచనలకు అనుగుణంగా అడుగులేస్తున్న ఈషా-ఆకాశ్... ఫార్చ్యూన్ సంస్థ ‘40 అండర్ 40’ పేరిట విడుదల చేసిన అత్యంత ప్రభావశీలురైన ప్రముఖుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా కరోనా విసిరిన సవాళ్లలోనూ తమ వ్యాపారాలను సమర్థంగా నిర్వహించారని ఫార్చ్యూన్ సంస్థ ఈ ట్విన్స్పై ప్రశంసల వర్షం కురిపించింది.
కరోనా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారు!
ప్రస్తుతం వ్యాపారాభివృద్ధి, అవకాశాల పరంగా డేటాను చమురుతో పోల్చాలేమో. భారత్‌లో అతిపెద్ద సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేసరికి అది వాస్తవంగా మారింది. జియో రాకముందు వరకు ఈ సంస్థకు పెట్రోరసాయనాల వ్యాపారమే కాసులు కురిపించింది. అయితే 2016లో జియో రావడంతో దేశీయ మొబైల్ మార్కెట్ రూపురేఖలే మారిపోయాయి. ఇక ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు పనిచేసే విధానం, జీవన విధానం పూర్తిగా మారిపోయింది. అయితే ఈ సవాళ్లనూ ఈషా-అంబానీలు సమర్థంగా అధిగమించారు. జియో బోర్డు సభ్యుల పాత్రలో ఇటీవల ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న 5.7 బిలియన్ అమెరికన్ డాలర్ల ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా గూగుల్, క్వాల్కం, ఇంటెల్ లాంటి ప్రముఖ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టాయంటే వీరి వ్యాపార దక్షతే కారణం. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ గ్రాసరీ సంస్థలకు పోటీగా ప్రారంభమైన జియోమార్ట్ ఏర్పాటులో వీరిద్దరిదే కీలకపాత్ర’ అని ఫార్చ్యూన్ సంస్థ ఈషా-ఆకాశ్‌లపై ప్రశంసల వర్షం కురిపించింది.