Photo: Twitter
క్రీడల్లో రాణించాలంటే మానసిక బలంతో పాటు శారీరక బలమూ ముఖ్యమే. అందుకు చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన పౌష్టికాహారం తప్పనిసరి. అలాంటిది దశాబ్ద కాలం పాటు ఒక్కపూట మాత్రమే తిండి తిన్నానంటోంది మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్ సారికా కాలె. కటిక పేదరికం, కుటుంబ సమస్యలను కసితో అధిగమించి ఖోఖో జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన ఆమె 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత జట్టును బంగారు పతకం దిశగా నడిపించింది. తన అసమాన ఆటతీరుతో పలువురి మన్ననలు అందుకున్న ఈ మాజీ క్రీడాకారిణి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా సారిక తన గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
ఖోఖో నా జీవితాన్నే మార్చేసింది!
అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దేశ క్రీడా ప్రతిష్ఠను ఇనుమడింపచేసిన క్రీడాకారులకు ఏటా క్రీడా పురస్కారాలు అందజేస్తుంది భారత ప్రభుత్వం. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జన్మదినమైన ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేసే ఈ అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈక్రమంలో 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖోఖో నుంచి పురస్కారం అందుకోనుంది సారిక. ప్రస్తుతం మహారాష్ట్రలోని తుల్జాపూర్లో క్రీడాధికారిణిగా విధులు నిర్వర్తిస్తున్న ఈ మాజీ ప్లేయర్ తనకు అర్జున అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఖోఖో తన జీవితాన్నెలా మార్చేసిందో అందరితో పంచుకుంది.
పదేళ్లపాటు ఒంటి పూటే భోజనం!
‘పురస్కారాల జాబితాలో నా పేరు చూడగానే నేను ఖోఖో ఆడిన రోజులు గుర్తుకొచ్చాయి. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన నేను కుటుంబ పరిస్థితులు, కటిక పేదరికం కారణంగా కనీసం ఓ పదేళ్ల పాటు ఒంటి పూటే భోజనం చేశాను. అమ్మ దుస్తులు కుట్టేది. నాన్న దివ్యాంగుడు కావడంతో మా కుటుంబ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. దీంతో నానమ్మ, తాతయ్య సంపాదన మీదే మేమంతా ఆధారపడే వాళ్లం. క్రీడల్లో భాగంగా శిక్షణ శిబిరంలో ఉన్నప్పుడు లేదా ఏదైనా టోర్నీకి వెళ్లినప్పుడు మాత్రమే పౌష్టికాహారం లభించేది. లేకుంటే ఎప్పటిలాగానే ఇంట్లో ఒంటి పూట భోజనమే మాకు దిక్కు.’
అందుకే ఆటను ఆయుధంగా ఎంచుకున్నా!
‘కుటుంబ పరిస్థితులను కళ్లారా చూసిన నేను వాటి నుంచి బయటపడేందుకే ఖోఖోను ఆయుధంగా ఎంచుకున్నా. 13 ఏళ్ల వయసులో మొదటిసారిగా నేను ఖోఖో గ్రౌండ్లోకి అడుగుపెట్టాను. అయితే క్రీడలకు సంబంధించి పట్టణ వాతావరణానికి, పల్లెలకు చాలా వ్యత్యాసముంది. రూరల్ ఆటగాళ్లలో ప్రతిభను గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో- ఆర్థిక సమస్యల కారణంగా చాలాసార్లు ఆటకు స్వస్తి చెబుదామనుకున్నాను. అయితే ఎన్ని కష్టాలున్నా నా కుటుంబం నాకు ఎంతో మద్దతునిచ్చింది. కోచ్‌లు అండగా నిలిచారు. ఖోఖో కారణంగా నా జీవితమే మారిపోయింది. ఈ ఆట కారణంగానే గతేడాది తుల్జాపూర్లో క్రీడాధికారిణిగా ప్రభుత్వోద్యోగం లభించింది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ మాజీ ప్లేయర్.
ఆడలేనంటూ ఇంటికి తాళం వేసుకుంది!
తన అసమాన ఆటతీరుతో గత పదేళ్లలో ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది సారిక. ఇక 2016లో భారత జట్టుకు స్వర్ణం అందించిన ఆమె ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ నిలిచింది. ఈక్రమంలో సారికకు అర్జున అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఆమె కోచ్ చంద్రజిత్ జయదేవ్.
పేదరికం, కుటుంబ పరిస్థితుల కారణంగా ఒకానొక దశలో ఆటకు స్వస్తి చెప్పాలనుకుంది సారిక. ప్రత్యేకించి 2016లో ఆర్థిక ఇబ్బందులు ఆమెను తీవ్రంగా వేధించాయి. ఇక గ్రౌండ్లోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకుని ఒంటరిగా ఇంట్లోనే తాళం వేసుకుని కూర్చుంది. అదే సమయంలో వాళ్ల నానమ్మ ఈ విషయాన్ని మాకు చేరవేసింది. దీంతో ఆమెకు సరైన కౌన్సెలింగ్ ఇచ్చి ఖోఖోలో కొనసాగేలా చేశాం. ఇక అప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా సారిక ఆటను వదల్లేదు. ఆమె కారణంగానే అదే ఏడాది జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత జట్టు బంగారు పతకం గెలుచుకుంది’ అని అప్పటి పరిస్థితులను గుర్తు చేశారు కోచ్.
ఖోఖోకు మళ్లీ మంచి రోజులు!
సుమారు 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఖోఖో విభాగంలో అర్జున పురస్కారం అందుకోనుంది సారిక. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాన్షు మిట్టల్ సోషల్ మీడియా వేదికగా సారికను అభినందించారు. ‘22 ఏళ్ల తర్వాత ఖోఖో ప్లేయర్‌కు అర్జున పురస్కారం దక్కింది. మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్ సారికకు ఈ అవార్డు దక్కింది. ఖోఖో క్రీడాకారిణి ప్రతిభను గుర్తించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు ధన్యవాదాలు. ఖోఖో ఆటకు మళ్లీ మంచి రోజులొచ్చాయి’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు సుధాన్షు మిట్టల్.