‘మీరు N-95 మాస్క్ కొన్నారా?’, ‘ఈ సబ్బు వాడితే కచ్చితంగా కరోనా ఖతం అవుతుంది’, ‘ఈ కషాయం తాగితే వైరస్‌ను కట్టడి చేయచ్చు’.. ఇలా కరోనా వైరస్‌కు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్‌లో వేలకొద్దీ మెసేజ్‌లు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లోనూ ఈ మహమ్మారికి సంబంధించిన పోస్టులు, మీమ్సే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి కల్లోల పరిస్థితుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. పైగా సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యే వార్తలు, సందేశాల్లో చాలా వాటికి ఎలాంటి శాస్ర్తీయ ఆధారాలు ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఇలా కరోనా గురించి అంతులేకుండా పుట్టుకొస్తున్న అపోహలు, అశాస్ర్తీయ వార్తలను తన ఇలస్ర్టేషన్ కళతో కట్టడి చేస్తోంది సింగపూర్‌కు చెందిన వీమన్ కౌ అనే యువతి. అంతేకాదు ఈ వ్యాధి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామిక్స్ రూపంలో అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తోందీ యంగ్ ఆర్టిస్ట్.
అందరికీ అర్థమయ్యేలా!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎంత వేగంగా విస్తరిస్తుందో.. ఈ మహమ్మారి గురించి వదంతులు, నిరాధార వార్తలు కూడా అంతే వేగంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కంటే దీని గురించి పుట్టుకొస్తున్న వదంతులు, అపోహలే సామాన్యులను తీవ్రంగా భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేందుకు తన ఇలస్ర్టేషన్ కళనే ఆయుధంగా మార్చుకుంది సింగపూర్‌కు చెందిన వీమన్. తన కామిక్స్‌తో ఓవైపు కరోనా గురించి సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్న వార్తలను కట్టడి చేస్తున్న ఆమె.. మరోవైపు దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తోంది. ఈక్రమంలో ఆరోగ్య నిపుణులు, ప్రముఖుల సలహాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన జాగ్రత్తలను కామిక్స్ రూపంలో గీస్తూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోందీ సింగపూర్ ఆర్టిస్ట్.
అలా మొదలైంది!
సింగపూర్‌లో మొట్టమొదటి కరోనా కేసు జనవరి 31న నమోదైంది. అప్పుడే ‘కరోనా వ్యాప్తి చెందే తీరును ఇలా అర్థం చేసుకోండి’ అంటూ మొదటిసారిగా ఓ కామిక్‌ను గీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది వీమన్. ఆకట్టుకునే బొమ్మలతో చిన్న పిల్లలకు సైతం సులువుగా అర్థమయ్యేలా ఆమె గీసిన ఆ కామిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కొన్ని రోజులకు ప్రపంచ దేశాలను సైతం ఆకర్షించింది. దీని గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ప్రారంభంలో నేను శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడే ‘ఊహాన్ వైరస్’ పేరుతో పలు వార్తలు వెలువడ్డాయి. దీని గురించి మరింత లోతుగా శోధించే క్రమంలో ఇంటర్నెట్ను ఆశ్రయించాను. అందులో ఈ వైరస్‌కు సంబంధించి బోలెడంత సమాచారం, వివిధ రకాల ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే ఆ సమాచారాన్ని అర్థం చేసుకోవాలంటే సామాన్యులకు అంత సులభమేమీ కాదని నాకర్థమైంది. అందుకే ఒక ఇలస్ర్టేటర్గా ఆ సంక్లిష్ట సమాచారాన్నంతా సరళీకరించి కామిక్స్ రూపంలోకి మారిస్తే చాలామందికి ప్రయోజనం ఉంటుందనిపించింది. అనుకున్నట్టే సమాచారమంతా కాకుండా శాస్ర్తీయ, నమ్మదగిన విషయాలను మాత్రమే క్రోడీకరించి చిన్నారులకు సైతం సులభంగా అర్థమయ్యేలా కామిక్ ఫార్మాట్లోకి మార్చాను’ అని చెప్పుకొచ్చింది వీమన్.
ఆ దేశాల్లోనూ ఆమె కామిక్లే..!
ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఈ మహమ్మారి గురించి అవగాహన కల్పించడానికి వీమన్ గీసిన కామిక్లనే ఆయుధాలుగా వినియోగిస్తున్నాయి. ఆమె గీసిన ఇలస్ట్రేషన్స్ని ప్రకటనలు, పోస్టర్ల రూపంలో ప్రచురిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాల భాషలకు తగ్గట్టుగా వలంటీర్ల సహాయంతో తన కామిక్‌లను అనువదిస్తోందీ ట్యాలెంటెడ్ గర్ల్. భారతదేశానికి సంబంధించి చెన్నై ఎయిర్‌పోర్ట్‌తో పాటు చాలా చోట్ల వీమన్ తయారుచేసిన కామిక్లనే పోస్టర్ల రూపంలో అతికించారు.
తప్పుడు సమాచారానికి చెక్!
ఇక కరోనా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వీమన్ ఇలా స్పందించింది. ‘సామాజిక మాధ్యమాల్లో కొన్ని అంశాలపై అసత్య ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. కరోనా విషయంలో కూడా అంతే. ఇలాంటి నిరాధార సమాచారం, అశాస్ర్తీయ వార్తలతో సామాన్యులు మరింత ఆందోళనకు గురయ్యే ప్రమాదముంది. ఒక్కోసారి నేను కూడా ఈ సమాచారమెంత శాస్ర్తీయమో నిర్ధరించుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తుంటాను.
కరోనాపై చిన్నారులకు మరింత అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఇప్పటికే ‘ఇంటర్నేషనల్ కిడ్స్ డ్రా కొవిడ్-19 ఫ్యాక్ట్స్ ఛాలెంజ్’ పేరుతో చిత్రలేఖన పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఇక నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియాలో ఉన్న తప్పుడు సమాచారంపై మరింత అవగాహన కల్పించేందుకు ‘కామిక్స్ ఫర్ గుడ్’ పేరుతో త్వరలో ఓ స్పెషల్ క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించనున్నాం’ అని చెప్పుకొచ్చింది వీమన్.
అందుకే ఇంత స్పందన!
తన కామిక్స్‌పై వస్తున్న స్పందననుద్దేశించి వీమన్ మాట్లాడుతూ.. ‘కరోనా నుంచి దూరంగా ఉండడానికి అందరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తారు.. కానీ ఎందుకు కడుక్కోవాలో, ఎలా శుభ్రం చేసుకోవాలో ఎవరూ చెప్పరు. ఇంకా మాస్కులు ధరించాలని చెబుతారు.. కానీ ఎలా వేసుకోవాలో, ఎలాంటివి వేసుకోవాలో ఎక్కడా సమాచారం ఉండదు. ఉన్నా అంత సైంటిఫిక్‌గా ఉండదు. కానీ నేను ఒక విషయంపై కామిక్ గీస్తున్నానంటే అందులో దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. అందుకే నా కామిక్స్‌కు ఇంత స్పందన వస్తోందనుకుంటున్నా.
View this post on Instagram
Everyone is buying hand sanitiser these days, but most people aren’t using them correctly, and are not aware of some of its dangers. With this comic, I hope more people will know what to watch out for when using hand sanitiser, so they can effectively keep themselves safe from coronaviruses!- Free pdf, A4 size printout, and coloring sheet in link in bio @weimankow - This is the second of a series on the importance of personal hygiene in combating the COVID-19 – done in partnership with @Temasek. [Sharing Guidelines] This comic is free for the general public to share online and through Whatsapp and Telegram. You can regram or repost the images as long as you follow the guidelines. Downloads are free for printing out as posters for personal and educational use in homes, schools, and workplaces. When sharing, please remember these 3 points: 1) No edits to the comics is allowed in any way when sharing 2) Comics cannot be used for any commercial project 3) If sharing online, tag and credit @weimankow and @temasekseen (IG) or @weimankowart and @temasekholdings (FB), as well as provide a link to instagram.com/weimankow . . . #graphicmedicine #health #education #children #teaching #covid19 #coronavirus #ipad #procreate #psa #drawing #illustration #cartoon #doodle #infographic #digitalart #sketchnote #design #instaart #comic #sequentialart #webcomic #medtwitter #scicomm #sanitize #clean #handsanitizer #disinfect #byobclean6
A post shared by Wei Man Kow (@weimankow) on
నేను గీసిన మొదటి కామిక్నే తీసుకుంటే.. దానికి వారంలోనే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనిని చూసిన చైనీయులు తమకు చైనీస్ వెర్షన్లో కామిక్స్ కావాలని విజ్ఞప్తి చేశారు. చైనాతో పాటు ఇండోనేషియా, దక్షిణ కొరియా, వియత్నాం, మెక్సికో, పోర్చుగల్, భారతదేశం నుంచి కూడా ఇలాంటి అభ్యర్థనలు వచ్చాయి. అందుకే కొద్దిమంది వలంటీర్లను నియమించుకున్నా. వారి సహాయంతో వివిధ భాషల్లోనూ నా కామిక్స్లను రూపొందిస్తున్నా. ఇక భారతదేశంలో కూడా చాలా భాషలున్నాయి. అందుకే ఆయా భాషలకు తగ్గట్టుగా ఉచితంగా పీడీఎఫ్ ఫార్మాట్లో నా కామిక్స్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నా. ఇందులో నాకు అనువాదకులుగా సహాయపడాలంటే https://gumroad.com వెబ్సైట్లోకి లాగిన్ కావాలి..’ అని చెప్పుకొచ్చిందీ సింగపూర్ ఆర్టిస్ట్.
కరోనాపై అవగాహన కల్పించే నేపథ్యంలో తన ఇలస్ట్రేషన్ కళనే ఆయుధంగా మార్చుకొని ముందుకు సాగిపోతున్న వీమన్ నేటి యువతరానికి ఆదర్శం అని చెప్పడంలో సందేహం లేదు.