కులం, మతం, ప్రాంతం.. ఇలాంటి భేదాలు లేకుండా జరుపుకొనే వేడుక ఏదైనా ఉందంటే అది ఒక్క ‘వేలంటైన్స్ డే’నే అని చెప్పాలి. ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ప్రేమ ధనిక, పేద తేడాను చూడదు. అందుకే ఈ పదానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ ఓ పండగే అయినా ఏటా ఫిబ్రవరి 14న మాత్రం ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. తమ మనసులోని ప్రేమను చాక్లెట్లు, బొమ్మలు, ఖరీదైన బహుమతులు.. చివరికి ఒక రోజా పువ్వుతోనైనా తెలియజేస్తుంటారు. ఇలా వేలంటైన్స్ డే రోజున ప్రేమను చాటిచెప్పడం కామన్ అయినా.. వేడుకలను జరుపుకొనే విధానం మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఇంతకీ ఈ వేలంటైన్స్ డేను ఎందుకు జరుపుకొంటారు.? ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో విభిన్న పద్ధతుల్లో జరుపుకొనే వేలంటైన్స్ డే వేడుకల గురించి తెలుసుకుందామా..?

వేలంటైన్స్ డే కథేంటీ..?
వేలంటైన్స్ డే ఎందుకు జరుపుకొంటారన్న దానిపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నా ఎక్కువ మంది విశ్వసించేది మాత్రం ‘సెయింట్ వేలంటైన్ మరణించిన రోజునే ప్రేమికుల దినోత్సవంగా జరుపుకొంటున్నారని’. దీని ప్రకారం.. 226 సంవత్సరంలో ఇటలీలోని టురిన్ అనే ప్రాంతాన్ని రెండవ క్లాడియస్ అనే రాజు పాలించాడు. క్లాడియస్ తన సైనిక బలంతో ఎన్నో యుద్ధాలను గెలిచాడు. సైనిక బలమే క్లాడియస్‌కు ఉన్న ప్రధాన ధైర్యం. అయితే కాలక్రమేణా క్లాడియస్ సైన్యంలో ప్రజలు చేరడం తగ్గుతూ వచ్చింది. దీనికి కారణం ఒక్కసారి సైన్యంలో చేరితే తిరిగి ఇంటికి వెళ్లడానికి చాలా రోజులు పట్టేది. వివాహం, భార్య, ప్రేమ కారణంగానే ప్రజలు సైన్యంలో చేరడం లేదని గ్రహించిన క్లాడియస్ తన రాజ్యంలో ఇకపై ఎవరూ పెళ్లిళ్లు చేసుకోకూడదని తీర్మానించాడు. ఈ సమయంలోనే అక్కడే ఉన్న సెయింట్ వేలంటైన్ అనే క్రైస్తవ ప్రవక్త క్లాడియస్ నిర్ణయం తప్పని భావించి రహస్యంగా జంటలకు పెళ్లిళ్లు చేయించడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్ వేలంటైన్‌ను జైలులో బంధించి ఫిబ్రవరి 14న చంపాలని మరణశిక్ష విధించాడు.

వేలంటైన్‌ను ఉంచిన జైలుకు ఆస్టీరియస్ అనే వ్యక్తి ప్రధాన అధికారిగా ఉండేవాడు. ఆస్టీరియస్ని కలవడానికి ఆయన కూతురు జూలియా జైలుకు వస్తుండేది. ఈక్రమంలోనే వేలంటైన్‌కు జూలియాకు పరిచయం ఏర్పడుతుంది. కాలంతో పాటు వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉండగానే ఫిబ్రవరి 14 రానే వచ్చింది. వేలంటైన్‌కు మరణ శిక్ష విధించడానికి సిద్ధం చేస్తున్నారు. ఆరోజు జూలియా జైలుకు ఎంతకీ రాకపోయే సరికి అక్కడే ఉన్న ఓ జైలర్ దగ్గర పెన్ను, పేపర్ అడిగిన వేలంటైన్ తన ప్రేయసికి లేఖ రాస్తూ.. పేపర్ చివరన ‘ఫ్రం యువర్ వేలంటైన్’ అని రాసి జూలియాకు ఆ లేఖను ఇవ్వమని జైలు సిబ్బందికి ఇస్తాడు. ఆరోజే వేలంటైన్‌ను తల నరికేసి చంపేస్తారు. ఇక వేలంటైన్ ధైర్యంగా చేసిన పనిని గుర్తించిన పోప్ గెలాసియస్ క్రీస్తుశకం 496లో ఫిబ్రవరి 14ను ‘సెయింట్ వేలంటైన్స్ డే’గా ప్రకటించాడు. అయితే సెయింట్ వేలంటైన్స్ డేకి, ప్రేమకి అప్పటి వరకు ఎలాంటి సంబంధం లేదు. దాదాపు వెయ్యేళ్ల తర్వాత 13వ శతాబ్దంలో ఓ రచయిత తన కవిత్వంలో ‘సెయింట్ వేలంటైన్స్ డే’ రోజున పక్షులు తమ తోడును కలుసుకుంటాయని రాశాడు. ఇది చదివిన చాలామంది రచయితలు వేలంటైన్స్ డేను ప్రేమతో ముడివేస్తూ తమ రచనలు చేశారు. అలా 15వ శతాబ్దం నుంచి ఫిబ్రవరి14 ‘ప్రేమికుల దినోత్సవం’గా మారింది. అనంతరం 18వ శతాబ్దం నాటికి అమెరికాలో ‘వేలంటైన్స్’ డే జరుపుకోవడం ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ వేడుకలు ప్రపంచం మొత్తం వ్యాపించాయి.
వివిధ దేశాల్లో విభిన్నంగా..
* బల్గేరియాలో వేలంటైన్స్ డేను ‘వైన్ డే’ పేరుతో జరుపుకొంటారు. ఈరోజు జంటలు వైన్‌ను ఒకరికి ఒకరు ఇచ్చుపుచ్చుకుంటూ తమ ప్రేమను తెలియజేస్తుంటారు.

* ఫిలిప్పీన్స్‌లో వేలంటైన్స్ డే రోజు సామూహిక వివాహాలు చేసుకుంటారు. వందల, వేల సంఖ్యలో జంటలు ఈరోజు వివాహ బంధంతో ఒక్కటవుతాయి. ఈ వివాహాలకు ఏకంగా అక్కడి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయడం మరో విశేషం.

* 2007 నుంచి ‘ఘనా’ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 14ను ‘జాతీయ చాక్లెట్’ దినోత్సవంగా జరుపుతోంది. చాక్లెట్ తయారీకి ఉపయోగించే కోకో బీన్స్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన ఘనా తమ దేశంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ఈక్రమంలో ఫిబ్రవరి 14న ఆ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా చాక్లెట్ థీమ్ మెనూలు, ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తారు.

* దక్షిణకొరియాలో ప్రేమికుల దినోత్సవ వేడుకలు భిన్నంగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి నెల 14న ‘ప్రేమికుల దినోత్సవం’గా జరుపుకొంటారు. అయితే ఫిబ్రవరి14, మార్చి 14లకు మరింత ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 14న మగవాళ్లకు ఆడవాళ్లు చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు. అయితే పురుషులు ఆ వెంటనే కాకుండా మార్చి 14న తమ ఇష్టసఖులకు చాక్లెట్లను తిరిగి బహుమతిగా ఇస్తారు. దీన్ని ‘వైట్ డే’గా పిలుచుకుంటారు. ఇక ఏప్రిల్ 14న ‘బ్లాక్ డే’ను నిర్వహిస్తారు. ఈరోజున గడిచిన రెండు నెలల్లో ఎలాంటి బహుమతులు అందుకోని వారందరూ (సింగిల్స్) ఒక చోట చేరి బ్లాక్ బీన్ సాస్ నూడుల్స్ తింటారు. భలే వింతగా ఉంది కదూ కొరియన్ వేలంటైన్స్ డే!

* ఫిబ్రవరి 14న ప్రపంమంతా ‘వేలంటైన్స్ డే’ సంబరాల్లో మునిగిపోతే.. ఉత్తర ఐరోపాలోని ఈస్టోనియా దేశంలో మాత్రం ఈరోజును ‘ఫ్రెండ్షిప్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు స్నేహితులు ఒకరికొకరు గ్రీటింగ్ కార్డులు, బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. కేవలం స్నేహితులే కాకుండా బంధువులు కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

* ఇంగ్లండ్‌తో సరిహద్దును పంచుకునే ‘వేల్స్’ దేశంలో వేలంటైన్స్ డేను పూర్తి విభిన్నంగా జరుపుకొంటారు. ఇక్కడ ప్రేమికుల దినోత్సవాన్ని జనవరి 25న ‘డే ఆఫ్ సాన్ డ్వైన్‌వెన్’ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు చెక్కతో తయారు చేసిన విభిన్న ఆకారాల్లో ఉండే స్పూన్స్‌ను ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రత్యేకించి హృదయాకృతిలో ఉండే స్పూన్స్‌ను తమ మనసులోని ప్రేమను తెలియజేయడానికి ఇస్తుంటారు. ఇక్కడ ఈ ఆచారాన్ని 16వ శతాబ్దం నుంచి కొనసాగిస్తున్నారు.

* మధ్య యూరప్‌లో ఉండే చెక్ రిపబ్లిక్ దేశంలో ప్రేమికుల దినోత్సవాన్ని మే1న జరుపుకొంటారు. ఈరోజు ప్రేమికులంతా ఆ దేశానికి చెందిన ప్రముఖ కవి కరోల్ హైనెక్ట్ మచా విగ్రహం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఉండే చెర్రీ చెట్ల కింద తమ ప్రేయసిని/ప్రియుడిని ప్రేమతో ముద్దాడతారు. ఇలా చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని వారి నమ్మకం.

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ప్రేమికులు ‘లవర్స్ డే’ను ఎలా జరుపుకొంటున్నారో చూశారుగా.! మరి ఈ ‘ప్రేమికుల దినోత్సవా’న్ని మీరెంత ప్రత్యేకంగా, విభిన్నంగా జరుపుకొన్నారో ‘వసుంధర.నెట్’ సాక్షిగా ప్రపంచంతో పంచుకోండి.