Photo: Screengrab
ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అగ్రరాజ్యంలో ఓ సరికొత్త అధ్యాయం మొదలైంది. మహిళల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతూ అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా దేవి హ్యారిస్ అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించక ముందే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు కమల. ఈ సందర్భంగా జో బైడెన్-కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర ఘట్టాలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి...
అందుకే పర్పుల్ కలర్ డ్రస్‌లో!
భారతీయ మూలాలున్న కమల ప్రమాణ స్వీకారం రోజున భారతీయుల సంప్రదాయానికి సూచికగా చీర ధరిస్తారని చాలామంది భావించారు. సోషల్ మీడియాలో దీనిపై చాలా పెద్ద చర్చే జరిగింది. కానీ ఆమె పర్పుల్ కలర్ సూట్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ డ్రస్ ధరించడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉంది. కొన్ని దశాబ్దాల కిందట షిర్లే కిషోల్మ్ అనే నల్ల జాతీయురాలు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారట. అంతేకాదు మహిళల ఓటు హక్కు కోసం పోరాడి యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో షిర్లేనే తన రాజకీయ జీవితానికి స్ఫూర్తి అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన హ్యారిస్... ఆమె బాగా ఇష్టపడే పర్పుల్ కలర్ దుస్తులను ధరించి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. డెమొక్రటిక్ పార్టీ రంగు నీలం, రిపబ్లికన్ పార్టీ ఎరుపు రంగుల కలయికైన ఈ పర్పుల్ కలర్‌ను అమెరికాలో ద్వైపాక్షికతకు చిహ్నంగా భావిస్తారు. అందుకే కమలతో పాటు మాజీ ప్రథమ మహిళలు మిచెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్లు కూడా పర్పుల్ కలర్ దుస్తుల్లోనే ఈ కార్యక్రమానికి హాజరవ్వడం విశేషం. ఇక కమల ధరించిన దుస్తులను నల్లజాతికి చెందిన డిజైనర్లు క్రిస్ట్ఫర్ జాన్ రోగర్స్, సెర్గియో హడ్సన్‌లు రూపొందించారు.
రెండు బైబిళ్లపై ప్రమాణం!
సుమారు రెండు వారాల క్రితం హింసాత్మక ఘటనలతో అట్టుడికిన క్యాపిటల్ హిల్ భవనమే బైడెన్-హ్యారిస్‌ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేదికగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం బుధవారం (జనవరి 20) రాత్రి 10.30 గంటలకు అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో తన కుటుంబం వద్ద 127 ఏళ్లుగా ఉన్న బైబిల్‌ను భార్య జిల్ బైడెన్ పట్టుకుని ఉండగా, దానిపై చేయి ఉంచి బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బైడెన్ కంటే 20 నిమిషాల ముందు... దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సోటోమేయర్ ఆమెతో ప్రమాణం చేయించారు. కమల రెండు బైబిళ్లపై ప్రమాణం చేయడం విశేషం. అందులో ఒకటి ఆమె కుటుంబ స్నేహితురాలైన రెజీనా షెల్టన్‌ది కాగా, మరొకటి సుప్రీంకోర్టు తొలి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ థర్గుడ్ మార్షల్‌ది. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా-మిచెల్, బిల్ క్లింటన్-హిల్లరీ, జార్జ్ బుష్-లారా దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను అధిరోహించిన బైడెన్, కమలకు వారు అభినందనలు తెలిపారు.
కమలా దేవి హ్యారిస్ అను నేను!
తన భర్త డోగ్లాస్ ఎమ్హోప్ పట్టుకున్న బైబిల్‌పై చేయి ఉంచి ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన కమల ప్రజా సేవకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘కమలా దేవి హ్యారిస్ అను నేను దేశాన్ని, రాజ్యాంగాన్ని విదేశీ, స్వదేశీ శత్రువులందరి నుంచి కాపాడతానని, రాజ్యాంగంపై నిజమైన నమ్మకం, విధేయత కలిగి ఉంటానని, ఈ విధిని స్వేచ్ఛగా స్వీకరిస్తానని, ఎలాంటి మానసిక అనుమానాలు, ఎగవేత ధోరణులు లేవని, నేను చేపట్టబోయే పదవిని చక్కగా, బాధ్యతతో నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను. దేవుడా! ఇందుకు నాకు సహకరించు’ అని ఆ ప్రమాణంలో చెప్పుకొచ్చారు కమల. అనంతరం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ‘ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనిప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు ఇంతవరకు ముందడుగు వేసిన మహిళలే కారణం’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తన తల్లి శ్యామల సహా, పలువురు నల్లజాతి మహిళల ఫొటోలను షేర్ చేశారామె.
అతిథుల కంటే వారే అధికం!
సాధారణంగా అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవమంటే ఎన్నో హంగు, ఆర్భాటాలు ఉంటాయి. లక్షల మంది అభిమానులు, సాధారణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీ. అయితే కరోనా తీవ్రత, గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న వరుస అల్లర్లను దృష్టిలో ఉంచుకుని ఈసారి కేవలం 1000 మంది అతిథులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రమాణ స్వీకారం జరిగే క్యాపిటల్ హిల్ పరిసరాల్లో సుమారు 25 వేలకు పైగా మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో ప్రమాణస్వీకార మహోత్సవంలో అతిథుల కంటే భద్రతా సిబ్బందే అధిక సంఖ్యలో కనిపించడం గమనార్హం. ఇక కొవిడ్ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి కమల కుటుంబీకులెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కమల సోదరి మాయ, మేనకోడలు మీనా, భర్త డోగ్లాస్ ఎమ్హోప్, కుమారుడు డోల్, ఎల్గా తదితరులు మాత్రమే హాజరయ్యారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. వేడుకల్లో భాగంగా ముందుగా ప్రముఖ పాప్ సింగర్ లేడీగాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రముఖ యువ కవయిత్రి అమండా గార్మన్... తాను రాసిన ఒక అందమైన కవితను చదివి వినిపించింది. ఆపై ప్రముఖ గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్....‘దిస్ ల్యాండ్ ఈజ్ యువర్ ల్యాండ్’, ‘అమెరికా ద బ్యూటిఫుల్’ పాటలతో హుషారెత్తించారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ నటుడు టామ్ హ్యాంక్స్ నేతృత్వంలో 90 నిమిషాల పాటు ‘సెలబ్రేటింగ్ అమెరికా’ పేరుతో ప్రముఖ కళాకారులు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు.
కంగ్రాట్స్ కమలా!
ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన బైడెన్-కమలలకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఇక బాలీవుడ్ నటులు ప్రియాంకా చోప్రా, సుస్మితా సేన్, స్వరా భాస్కర్, దియా మీర్జా తదితరులు కూడా బైడెన్-కమల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.