ఏటా జనవరిలో వచ్చే సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఎంత సంబరంగా జరుపుకొంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ పండక్కి కొత్త అల్లుడు అత్తారింటికి వస్తే వారికి అతిథి మర్యాదలు ఆకాశాన్నంటుతాయి. కొత్త బట్టలు, కానుకలతో పాటు రకరకాల పిండి వంటలతో అల్లుడికి రాచ మర్యాదలు చేస్తుంటారు కొందరు అత్తామామలు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకు తమ ఇంటికొచ్చిన అల్లుడికి ఏకంగా 125 రకాల వంటకాలను వడ్డించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంపతులు. నోరూరించే ఆ వంటకాలను చూసి మొదట ఆశ్చర్యపోయిన అల్లుడు ఆ తర్వాత తేరుకుని తన భార్యతో కలిసి విందారగించాడు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా తెలిసిపోవడంతో ప్రస్తుతం ఈ ‘భీమవరం అల్లుడు’ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాడు.
అల్లుడికి అదిరిపోయే విందు!
సాధారణంగా సంక్రాంతి పండగకు అత్తారింటికి వచ్చిన అల్లుడి అభిరుచులకు తగ్గట్టుగా పంచభక్ష్య పరమాన్నాలో... రకరకాల పిండి వంటలో... మిఠాయిలో రుచి చూపిస్తారు అత్తింటి వారు. ఇక మాంసాహార ప్రియులైతే మసాలా ఘుమఘుమలతో ఆరేడు రకాల నాన్‌వెజ్ వంటకాలను సిద్ధం చేస్తారు. అందులోనూ మర్యాదలకు మారుపేరైన గోదావరి జిల్లాల్లో అయితే ఇంటికొచ్చిన అతిథులకు చేసే రాచ మర్యాదలకు ఏ లోటూ ఉండదు. ప్రేమ, అభిమానంతోనే సగం కడుపు నింపేస్తుంటారు అక్కడి ప్రజలు. ఈక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన కురిశేటి కాశీ విశ్వనాథం దంపతులు తమ అల్లుడు నారాయణ అఖిల్ కోసం ఏకంగా 125 రకాల పసందైన వంటకాలను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వెల్కమ్ డ్రింక్స్ దగ్గర్నుంచి స్టార్టర్స్, ఛాట్స్, స్వీట్స్, డెజర్ట్స్, బర్గర్లు, పండ్లు, పండ్ల రసాలు, రకరకాల కూరలు, రైస్ వెరైటీస్, ఐస్‌క్రీమ్స్, వెజ్, నాన్‌వెజ్ వంటకాలన్నీ సిద్ధం చేసి ఓ పెద్ద డైనింగ్ టేబుల్‌పై అమర్చారు. అనంతరం అరటి ఆకు, వెండి పళ్లెంలో వడ్డించి మరీ తమ అల్లుడికి ఈ వంటకాల రుచి చూపించారు అత్తమామలు.
భీమవరం మర్యాదలా... మజాకా!
ఇక అన్ని రకాల వంటకాలను వడ్డించిన అత్తింటివారి ప్రేమకు ఆ అల్లుడు కూడా ఫిదా అయ్యాడు. ఈక్రమంలో అత్తగారు తన అల్లుడు, కూతురికి వంటకాలు రుచి చూపిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లో ఈ వీడియోకు 75 వేలకు పైగా వ్యూస్ రావడం విశేషం. ‘భీమవరం మర్యాదలా..మజాకా’ అంటూ వందల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.
గతంలో 67 వంటకాలతో!
గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అత్తగారు కూడా కొత్తగా పెళ్లైన తన కూతురు, అల్లుడు కోసం ఏకంగా 67 రకాల వంటకాలను సిద్ధం చేశారు. ఛాట్స్, స్వీట్స్, వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్, డెజెర్ట్స్తో పాటు రకరకాల పిండి వంటలను అరిటాకు, వెండి పళ్లెంలో ఉంచి మరీ తన అల్లుడికి అతిథి సత్కారాలు చేశారు. ఇందులో భాగంగా తాను తయారుచేసిన ప్రతి వంటకాన్నీ ఆ అత్తగారు వీడియో ద్వారా షేర్ చేసుకోగా...ఇవన్నీ చూసిన నెటిజన్లందరికీ నోట్లో నీళ్లూరాయంటే అతిశయోక్తి కాదు.