Photo: Twitter
జో బైడెన్ - కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం.. అక్కడెక్కడో అమెరికాలో జరగనున్న ఈ వేడుక కోసం ఇండియాలో పండగ వాతావరణం నెలకొంది. అందుకు కారణం భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనుండడమే! అందుకే ఇటు భారతీయులు, అటు ఇండో-అమెరికన్లు వీరిద్దరికీ తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ట్రెండ్ అవుతున్నవే రంగురంగుల రంగవల్లికలు. ఆరోగ్యాన్ని, సిరిసంపదల్ని తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ భారతీయ అతివలు తమ ఇంటి ముందు తీర్చిదిద్దే ఈ ముగ్గులతోనే అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులకు స్వాగతం పలికేందుకు తమ సృజననంతా రంగరిస్తున్నారు మహిళలు, చిన్నారులు. ఈ క్రమంలో- అటు అమెరికా, ఇటు ఇండియా నుంచి వేలాది మంది పాల్గొంటోన్న ఈ ఆన్లైన్ రంగవల్లికల కార్యక్రమం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
ఆరోగ్యాన్ని, సిరిసంపదల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ భారతీయ వనితలు ఇళ్ల ముందు ఎలా ముగ్గులు తీర్చిదిద్దుతారో.. అమెరికా పాలన కూడా అదే విధంగా సాగాలని, ఎలాంటి వర్ణ వివక్ష, జాతి భేదాల్లేకుండా అందరి అధ్యక్షుడిగా బైడెన్ తన పాలనను నడిపించాలని కోరుకుంటూ ఈ ఆన్లైన్ ముగ్గుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ‘అమెరికా ముగ్గుల బృందం 2021’ సభ్యురాలు సౌమ్యా సోమనాథ్ తెలిపారు.
సహజ రంగులతోనే!
అటు యూఎస్‌లోని పలు రాష్ట్రాలతో పాటు ఇటు భారత్‌లో కూడా రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దుతున్నారు అతివలు. వయోభేదం లేకుండా కొందరు చిన్నారులు, వృద్ధులు కూడా ఈ ఆన్లైన్ ఈవెంట్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలో సహజరంగుల్ని ఉపయోగించి టైల్స్‌పై విభిన్న రంగవల్లికల్ని తీర్చిదిద్దుతున్నారు. ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ బైడెన్-హ్యారిస్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వేలాది ముగ్గుల్ని వర్చువల్‌గా ప్రదర్శించారు. అయితే నిజానికి ఇలా ముగ్గులు వేసిన టైల్స్‌ని శ్వేతసౌధం ముందు ప్రదర్శించి వీరికి స్వాగతం చెప్పాలని ముందుగా నిర్ణయించినప్పటికీ.. భద్రతా కారణాల దృష్ట్యా వర్చువల్‌గానే వీటిని ప్రదర్శిస్తున్నట్లు సౌమ్య తెలిపారు. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత తమ కార్యక్రమానికి కచ్చితంగా అనుమతి లభిస్తుందన్నారు.
ఏదేమైనా భారతీయ సంప్రదాయం ప్రకారం రంగవల్లికలతో ఈ కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులకు స్వాగతం పలుకుతూ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు భారతీయ వనితలు.
ఇక మరోవైపు ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయనున్న కమల ఈ కార్యక్రమానికి చీరకట్టులో హాజరవుతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి, ఇది నిజమో, కాదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే!