సరిగ్గా ఏడాది క్రితం ఫుల్ జోష్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యాం. కొత్త సంవత్సరం అది చేయాలి, ఇది చేయాలి అని ఎన్నో ప్రణాళికలేసుకున్నాం.. ఇవేవీ వర్కవుట్ కాకుండా మన సంతోషాన్ని పూర్తిగా లాగేసుకుంది కరోనా మహమ్మారి. అనుకున్న పనులన్నింటికీ ఆటంకం కలిగించింది. ఇలా పనులు పూర్తికాక కొందరు, ఉద్యోగాలు పోయి మరికొందరు, తినడానికి తిండి లేక ఇంకొందరు.. ఈ ఏడాది ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. ఇలా ఈ కారణాలన్నీ అంతిమంగా మన మానసిక ఆరోగ్యం పైనే దెబ్బ కొట్టాయి. కొంతమందైతే ఈ పరిస్థితుల్ని భరించలేక ఆత్మహత్యల దాకా కూడా వెళ్లారు.
ఇన్ని జరిగినా ఇంకా కరోనా మన మధ్యే ఉంది. కొత్త రూపు దాల్చి మనపై విరుచుకుపడడానికి రడీగా ఉంది. మరి, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా ఉండడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అప్పుడే కొత్త ఏడాదంతా హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చంటున్నారు. అయితే అందుకోసం కొన్ని అలవాట్లను మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..
ఈ ఏడాదంతా అందరికీ చాలా ఎమోషనల్‌గా గడిచిందని చెప్పాలి. కరోనా కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాల్సి రావడంతో చాలామంది ఒంటరితనాన్ని అనుభవించారు. మన చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా ఒత్తిడి, ఆందోళనలు, కోపతాపాలకు లోనైన వారు ఎందరో! ఇలా ఇవన్నీ మన మానసిక ఆరోగ్యంపై ఎంతగానో ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే జరిగిందేదో జరిగిపోయింది.. కాబట్టి రాబోయే కొత్త ఏడాదిలోనైనా మానసికంగా ప్రశాంతంగా ఉండాలని తీర్మానించుకుందాం.. అయితే అందుకోసం కొన్ని అలవాట్లను మన జీవన విధానంలో భాగం చేసుకోవాలి.

భావోద్వేగాలు హద్దు దాటకుండా..!
‘కరోనా కారణంగా రాజేశ్ ఉద్యోగం పోయింది.. పోనీ వేరే జాబ్ చూసుకుందామంటే చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగుల్నే తీసేస్తున్నాయి తప్ప కొత్తగా రిక్రూట్ చేసుకునే స్థితిలో లేవు. దీంతో ఏం చేయాలో పాలు పోని రాజేశ్ ఆ కోపాన్ని తన భార్య గీత మీద చూపడం మొదలుపెట్టాడు. రోజూ తాగడం, పిల్లల ముందే భార్యను హింసించడం చేసే సరికి ఆమె భరించలేక గృహ హింస చట్టం కింద అతడిని అరెస్ట్ చేయించింది..’
ఇదొక్కటే కాదు.. ఈ కరోనా కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అంతేకాదు.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఒత్తిడి, కరోనా తమకెక్కడ సోకుతుందోనన్న భయం, కరోనాకు సంబంధించిన వార్తలు, చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి.. ఇలా ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యారు. తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోయారు.

నిజానికి ఈ పరిస్థితి మనం కోరి తెచ్చుకున్నది కాదు.. అనుకోకుండా వచ్చింది. కాబట్టి ఇలాంటి సమయంలోనే మానసికంగా దృఢంగా ఉండాలంటున్నారు నిపుణులు. ప్రస్తుత పరిస్థితులు కొత్త ఏడాదిలోనూ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడూ ఇలా కోపతాపాల్ని ప్రదర్శించి మానసిక ప్రశాంతత కోల్పోకుండా మనలోని భావోద్వేగాల్ని అదుపు చేసుకోవాలంటున్నారు. ఇందుకోసం మన సుఖదుఃఖాల్ని మనకు బాగా దగ్గరైన వ్యక్తులతో పంచుకోవడం, పాజిటివిటీని నింపే పుస్తకాలు చదవడం, ధ్యానం, మీకంటూ కాస్త సమయం కేటాయించుకోవడం.. వంటివి అలవాటు చేసుకుంటే మానసిక ప్రశాంతత సొంతమవడం ఖాయం!
అందుకే వ్యాయామం చేయాలట!
‘కొత్త ఏడాది క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని తీర్మానించుకుంది సుష్మ. ఇందుకోసం జిమ్‌లో కూడా చేరింది. మొదటి మూడు నెలలు బాగానే చేసింది.. ఆ తర్వాతే కరోనా రావడం, లాక్డౌన్, జిమ్‌లు మూతపడడం.. వీటి కారణంగా తనలో బద్ధకం ఆవహించింది. నిజానికి ఇంట్లో ఉన్నా ఆన్లైన్లో నేర్చుకుంటూ వ్యాయామం ప్రాక్టీస్ చేయచ్చు. కానీ తను దానికి ప్రాధాన్యమివ్వలేదు.. రోజూ రేపు చేద్దాంలే అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చింది.. ఇక ఇంటి దగ్గర్నుంచి పని అయ్యే సరికి సమయమే సరిపోయేది కాదామెకు. దీంతో వ్యాయామాన్ని పక్కన పెట్టేసింది.. ఈ తీరిక లేని లైఫ్‌స్టైల్ ఆమెలో ఒత్తిడి, ఆందోళనలకు కారణమైంది..’

ఇలా నెలలకు నెలలు ఇంట్లో ఉండడం వల్ల చాలామంది తమ వర్కవుట్కు ఫుల్స్టాప్ పెట్టే ఉంటారు. ఈ క్రమంలో వ్యాయామాన్ని అలవాటు చేసుకున్న వారూ లేకపోలేదు. సరే.. ఈ ఏడాది ఇలా గడిచిపోయినా వచ్చే ఏడాదన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకుందాం. ఎందుకంటే మనం రోజూ చేసే వర్కవుట్ వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్స్) విడుదలవుతాయి. ఇవి మనలో కలిగే ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. అందుకే సమయం కుదుర్చుకొని మరీ వ్యాయామం చేయమంటున్నారు నిపుణులు.
అలా నిద్రను వృథా చేసుకోవద్దు!
‘శిరీష గృహిణి. గత తొమ్మిది నెలలుగా ఆమె భర్త ఇంటి నుంచే పని చేస్తున్నారు.. పిల్లలూ ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో అందరూ కలిసి రాత్రుళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండడం అలవాటైంది వారికి. ఈ క్రమంలో సెల్ఫోన్లో గేమ్స్, టీవీలో సినిమాలు.. ఇలా వీటితో గడుపుతూ ఏ అర్ధరాత్రికో గానీ నిద్రలోకి జారుకునే వారు కాదు. ఎవరెప్పుడు లేచినా శిరీష మాత్రం ఉదయాన్నే లేవాల్సి వచ్చేది. పోనీ మధ్యాహ్నం పడుకుందామన్నా సమయం దొరికేది కాదు. దీంతో ఆమెకు క్రమంగా నిద్ర కరవవడం మొదలైంది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైందామె..’

ఈ కరోనా కాలంలో మనలోనూ చాలామంది ఇలాగే రాత్రుళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే లేవడం.. వంటివి చేసుంటారు కదూ! తద్వారా ఒత్తిడి, ఆందోళనలు, కోపం, చికాకు.. ఓ రకంగా చెప్పాలంటే ఇవీ మానసిక సమస్యలే! కాబట్టి ఇకముందైనా వీటిని పక్కన పెట్టి ఏడెనిమిది గంటలు సుఖ నిద్రకు ఉపక్రమించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. కొత్త ఏడాదిలో మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి నిద్రలేమిని త్యజించమని సూచిస్తున్నారు.
అంగీకరిస్తే పోయేదేముంది!
‘ధరణి చర్మ రంగు కాస్త నలుపు. కానీ ముఖంలో కళ కొట్టొచ్చినట్లుంటుంది. అయితే ఈ మధ్యే ఇన్‌స్టాలో ఖాతా తెరిచిన ఆమె.. తన ఫొటోల్ని ఎప్పటికప్పుడు అందులో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆమె రంగు తక్కువగా ఉందంటూ అందరూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. వీటిని తన మనసు మీదకు తీసుకున్న ఆమె.. చాలా ఒత్తిడికి గురైంది.’

ఇలా ఇతరులు సృష్టించుకున్న బ్యూటీ ప్రమాణాల్ని అందుకోలేక చాలామంది తమను తాము ద్వేషించుకుంటారు. ఒక రకంగా ఇలాంటి పరిస్థితులు కూడా మనలోని ప్రశాంతతను దూరం చేస్తాయి. అదే ‘ఎవరేమనుకుంటే నాకేం.. నా శరీరం నా ఇష్టం.. నేనిలాగే ఉంటా..’ అనే పాజిటివిటీని మీలో పెంచుకొని చూడండి.. మీ మీద మీకే ఏదో తెలియని ఇష్టం కలుగుతుంది. కొత్త ఏడాదిలోనూ ఇలాంటి ధోరణినే కొనసాగించాలి. అప్పుడే మీపై మీకు ఇష్టం పెరగడమే కాదు.. మానసిక ప్రశాంతతా చేకూరుతుంది.
కాస్త ‘సోషల్’గా ఉపయోగించండి!
‘భువన సోషల్ మీడియాను తెగ ఉపయోగిస్తుంటుంది.. అందులో ఏ వార్త కనిపించినా.. వెనకా ముందూ ఆలోచించకుండా అందరితో పంచుకోవడం ఆమెకు అలవాటు. ఒకసారి కరోనాకు సంబంధించిన ఓ అవాస్తవ వార్తను అందరితో పంచుకుంది. తీరా నిజం తెలిశాక తప్పుడు వార్త ప్రచారం చేసిందంటూ అందరూ ఆమెను తిట్టిపోశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైందామె..’

నిజానికి ఈ ఏడాది ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. కొంతమంది అవాస్తవ వార్తల్ని చూసి అదే నిజమనుకొని భయపడిపోయుంటారు కూడా! ఇలా కూడా ఒకరకంగా మానసిక ప్రశాంతతను దూరం చేసుకున్నట్లే లెక్క! అలాగని సామాజిక మాధ్యమాల్ని ఉపయోగించకూడదని కాదు.. వాటిని నలుగురికీ ఉపయోగపడే పనులు చేయడం కోసం కూడా వాడచ్చు.. ఈ క్రమంలో అవసరార్థులకు నిధులు కేటాయించడం కోసం, నలుగురికీ ఉపయోగపడే విషయాల్ని పంచుకోవడానికి, విజ్ఞానాన్ని అందించడానికి.. ఆలోచిస్తే ఇలాంటి ఐడియాలు బోలెడొస్తాయి. కాబట్టి రాబోయే కొత్త ఏడాదిలోనైనా మంచి పనుల కోసం సోషల్ మీడియాను వాడేలా అలవాటు చేసుకోండి. ఇలా ఇతరులకు సహాయపడ్డామన్న సంతృప్తి ముందు అన్నీ దిగదుడుపే!
ఇవండీ.. కొత్త ఏడాదంతా సరికొత్త జోష్‌ను నింపుకోవాలంటే అలవర్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు!
మరి- కొత్త సంవత్సరంలో మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉండడం కోసం మీరు తీసుకున్న నిర్ణయాలేమిటి? మీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకుంటున్నారు..? కరోనా సృష్టించిన కల్లోలాన్ని అధిగమించి ఆనందంగా జీవించడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి..!
Also Read: న్యూ ఇయర్ లో హ్యాపీగా ఉండడానికి మీరేం చేయాలనుకుంటున్నారు?