పెళ్లంటే ప్రతి అమ్మాయి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా మలచుకోవాలనుకుంటుంది.. తన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా తను కోరుకున్న వాడి చేయి పట్టుకొని ఏడడుగులు నడవాలనుకుంటుంది. ఫొటోషూట్స్‌తో సందడి చేయాలనుకుంటుంది. మరి, మనమే మన పెళ్లి గురించి ఇన్ని కలలు కంటే సెలబ్రిటీలైతే ఈ విషయంలో ఆకాశానికి నిచ్చెనలేస్తుంటారు. అయితే ఈ ఏడాది అంత ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రముఖులకు కాస్త నిరాశే ఎదురైందని చెప్పాలి. అందుకు కర్త, కర్మ, క్రియ అన్నీ కరోనానే! ఓ వైపు తక్కువ మంది అతిథులు, మరో వైపు కొవిడ్ నిబంధనలతోనే సోలో లైఫ్‌కి గుడ్‌బై చెప్పి వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు కొంతమంది ముద్దుగుమ్మలు/సెలబ్రిటీలు. అలాగని తమ ఫ్యాన్స్‌ని నిరాశపరచకుండా తమ పెళ్లి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వారి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. మరి, ఈ ‘కరోనా నామ సంవత్సరం’లో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ ప్రముఖులెవరో, వారి పెళ్లి ముచ్చట్లేంటో ఓసారి నెమరువేసుకుందాం..!
పెళ్లంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరగాలనుకుంటారు.. ఈ క్రమంలో ఈ ఏడాది జరిగిన పెళ్లిళ్లు కూడా చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ కరోనా కాలంలో జరగడమే! సామాన్యులే కాదు.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్ని ఎదిరించి ఎన్నో సెలబ్రిటీ జంటలు కూడా పెళ్లితో ఒక్కటయ్యాయి. వారంతా ఇటు కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూనే, అటు తమ పెళ్లి, ఇతర వేడుకల్లో సందడి చేశారు. మరి, అలాంటి కొందరు సెలబ్రిటీ కపుల్ పెళ్లి ముచ్చట్లే ఇవి!
అదరగొట్టిన ‘నిశ్చయ్’ !
డెస్టినేషన్ వెడ్డింగ్.. ఈ తరంలో ప్రతి అమ్మాయి కనే కల ఇది. అయితే ఈ కరోనా పరిస్థితుల్లో ఈ తరహా పెళ్లంటే సాహసమే అని చెప్పాలి. అలాంటి సాహసమే చేసింది మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ హోటల్ వేదికగా తన ఇష్టసఖుడు చైతన్య జొన్నలగడ్డతో ఇటీవలే (డిసెంబర్ 10న) ఏడడుగులు నడిచిందీ బ్యూటీ. పెళ్లి కూతురిని చేయడం దగ్గర్నుంచి సంగీత్, మెహెందీ, పసుపు ఫంక్షన్, పెళ్లి, రిసెప్షన్.. ఇలా ఐదు రోజుల పాటు జరిగిన వేడుకల్లో అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారీ లవ్లీ కపుల్. ప్రతి వేడుకలోనూ ఆయా సందర్భానికి తగినట్లుగా ట్రెడిషనల్‌గా ముస్తాబై దిగిన ఈ ముద్దుల జంట పెళ్లి ఫొటోలు ‘నిశ్చయ్’ హ్యాష్‌ట్యాగ్ వేదికగా ఓ ట్రెండ్‌ని క్రియేట్ చేశాయంటే అతిశయోక్తి కాదు.
ఇక అంతకుముందు జూన్‌లో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలను నిహా ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అవి కాస్తా వైరలయ్యాయి. ఆ తర్వాత తన ముద్దుల కూతురి పెళ్లి గురించి నటుడు నాగబాబు అధికారికంగా తెలియజేశాక ఆగస్టులో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఇక ఇటీవలే పెళ్లి హడావిడి నుంచి తేరుకొని క్రిస్మస్ని తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసిన ఈ క్యూట్ కపుల్ ప్రస్తుతం మాల్దీవుల్లో హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. న్యూఇయర్‌ని అక్కడే సెలబ్రేట్ చేసుకొని స్వదేశానికి రానుందట నిశ్చయ్ జంట.
మనసు దోచుకున్న అందాల జంట!
‘చలిచలిగా అల్లింది.. గిలిగిలిగా గిల్లింది..’ అంటూ కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేసింది అందాల చందమామ కాజల్ అగర్వాల్. ఈ ఏడాది అక్టోబర్ మొదట్లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో తన ప్రేమ విషయం బయటపెట్టిన ఈ చిన్నది.. అక్టోబర్ 31న అతనితో ఏడడుగులు వేసింది. కరోనా కారణంగా ఈ జంట కూడా అత్యంత సన్నిహితుల సమక్షంలో తమ ప్రేమను శాశ్వతం చేసుకున్నారు. పెళ్లి, ఇతర ప్రి-వెడ్డింగ్ వేడుకల్లో సంప్రదాయబద్ధమైన దుస్తులతో మెరుపులు మెరిపించిన ఈ అందాల జంట.. ఆయా ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అందరి ఆశీర్వాదాలూ తీసుకున్నారు. అంతేకాదు.. తన పెళ్లిలో ఎరుపు రంగు భారీ బ్రైడల్ లెహెంగాలో ముస్తాబైన ఈ చక్కనమ్మ వెడ్డింగ్ అవుట్‌ఫిట్‌కు అమ్మాయిలు ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఇలా పెళ్లి ఆద్యంతం సందడి చేసిన ఈ లవ్లీ కపుల్.. హనీమూన్ కోసం మాల్దీవుల్ని ఎంచుకున్నారు. కొన్ని రోజుల పాటు అక్కడే సేదదీరిన వీరు.. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉన్నారు. అక్కడి అందమైన లొకేషన్లలో దిగిన ఫొటోలు, వీడియోలు అందరితో పంచుకుంటూ తెగ మురిసిపోయారు.. కొత్త జంటలకు రిలేషన్షిప్ పాఠాలు నేర్పారు. ఇక ఇప్పుడు కాజల్ ‘ఆచార్య’ షూటింగ్లో బిజీగా ఉంటే.. గౌతమ్ అటు వ్యాపారాన్ని చూసుకుంటూనే, ఇటు వీలు చిక్కినప్పుడల్లా తన ముద్దుల భార్యకు సమయం కేటాయిస్తున్నాడు.
భల్లాల వెడ్స్ మిహీక!
ఇంటీరియర్ డిజైనర్‌గా, ఈవెంట్ కంపెనీ మేనేజర్‌గా, ఫ్యాషనర్గా.. ఇలా తనకంటూ ఇమేజ్‌ని సంపాదించుకున్న మిహీక.. మన భల్లాలదేవుడు రానాను వివాహమాడి తన ఫ్యాన్ సర్కిల్‌ను మరింతగా పెంచుకుంది. అందరూ లాక్డౌన్ హడావిడిలో ఉండగా మిహీకతో తన ప్రేమాయాణాన్ని బయటపెట్టిన ఈ హ్యాండ్సమ్ హంక్.. ఆ తర్వాత తన ఇష్టసఖితో రోకా వేడుక చేసుకున్నాడు. ఇక అప్పట్నుంచి ఈ లవ్లీ కపుల్‌కి సంబంధించిన ఫొటోలు, వార్తలు ఇంటర్నెట్‌ని ఓ ఊపు ఊపేశాయి. ఆపై కరోనా నిబంధనల్ని పాటిస్తూ అతి తక్కువమంది అతిథులు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో ఆగస్టు 8న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారీ క్యూట్ కపుల్. తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి సందడి చేశారు. ఇక మిహీక తన ప్రి-వెడ్డింగ్ వేడుకలో తన తల్లి పెళ్లి నాటి లెహెంగాను ధరించడంతో దానికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఇక వీరి పెళ్లిలో సామ్-చై చేసిన హడావిడి కూడా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పచ్చు.
తొలిచూపు ప్రేమ పెళ్లి పీటలెక్కింది!
తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ - పంజాబీ స్టార్ రోహన్‌ప్రీత్ సింగ్. ‘నేహూ దా వ్యాహ్’ అనే మ్యూజిక్ వీడియోలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట తమ ప్రేమను ఇటీవలే పెళ్లిపీటలెక్కించింది. ఈ ఏడాదిలోనే తమ ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకున్న ఈ ముద్దుల జంట అక్టోబర్ 24న పెళ్లితో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. కరోనా నిబంధనల దృష్ట్యా అతి తక్కువమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానించారు నేహ-రోహన్.
ఈ క్రమంలో తమ పెళ్లి వేడుకల్లో సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసిపోయారీ క్యూట్ కపుల్. ఇక పెళ్లి తర్వాత రిసెప్షన్, కర్వా చౌత్ వేడుకల్ని కలిపి జరుపుకొన్న ఈ కొత్త జంట.. హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం ఓవైపు తమ అన్యోన్యతను సోషల్ మీడియాలో ఫొటోల రూపంలో పంచుకుంటూనే.. మరోవైపు ఎవరి వృత్తిలో వారు బిజీగా మారిపోయారు.
నితిన్-శాలిని.. మేడ్ ఫర్ ఈచ్ అదర్!
ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల నడుమే లవర్ బాయ్ నితిన్ కూడా తన ఇష్టసఖి శాలిని మెడలో మూడుముళ్లు వేశాడు. నిజానికి తన వివాహం దుబాయ్‌లో జరుపుకోవాలని ఉవ్విళ్లూరిన ఈ టాలీవుడ్ హీరో.. కరోనా నిబంధనల దృష్ట్యా తన ఫార్మ్‌హౌస్‌లోనే అతి తక్కువ మంది బంధువులు, కుటుంబ సభ్యుల నడుమ శాలినితో కలిసి ఏడడుగులు నడిచాడు. పసుపు, సంగీత్, మెహెందీ.. వంటి ప్రి-వెడ్డింగ్ వేడుకల్లోనూ ఎంతో లవ్లీగా మెరిసిపోయారీ క్యూట్ కపుల్. అంతేకాదు.. వివాహం సందర్భంగా వివాహ వేదికను రాజా రవి వర్మ పెయింటింగ్స్ థీమ్‌తో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొవిడ్ కారణంగా తమ వివాహం నిరాడంబరంగా జరిగినా ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించారు నితిన్-శాలిని. ఎప్పటికప్పుడు వారు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయని చెప్పచ్చు.
యాక్టర్ మనసు దోచిన డాక్టర్!
‘సరిపోవు కోటి కనులైన.. సరిపోవు లక్ష ఎదలైనా’ అంటూ అమ్మాయిల మనసుల్ని గిలిగింతలు పెట్టిన లవర్ బాయ్ నిఖిల్ కూడా ఈ ఏడాది తన బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పాడు. రెండేళ్ల పాటు తాను ప్రేమించిన డాక్టర్ పల్లవీ వర్మ మెడలో మూడుముళ్లు వేశాడీ హ్యాండ్సమ్. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు ఈ లవ్లీ కపుల్. అయితే కరోనా కారణంగా పలుమార్లు తమ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చిన వీరు.. మే 14న అతి తక్కువమంది బంధువుల ఆశీర్వచనాల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో పెళ్లి, ఇతర వేడుకల్లో సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి తెగ సందడి చేసిందీ జంట. అంతేనా.. తమ పెళ్లి ముచ్చట్లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోల రూపంలో పంచుకుంటూ మురిసిపోయింది.
ఇక వీరితో పాటు యంగ్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ, నటి సనాఖాన్-మౌలానా అనాస్ సయ్యద్, టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు-తేజస్విని, బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారాయణ్ -నటి శ్వేతా అగర్వాల్.. తదితర సెలబ్రిటీ వెడ్డింగ్స్ కూడా ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచాయి.