పార్టీ అయినా, ఫ్రెండ్స్/కుటుంబ సభ్యులతో అలా బయటికి వెళ్లినా, ఆఫీస్‌లో ఎవరైనా ట్రీట్ ఇవ్వాలనుకున్నా.. మన మెనూలో ముందుండే ఫుడ్ ఐటమ్ బిర్యానీ కాక ఇంకేముంటుంది చెప్పండి! అందులోనూ మొదటి ప్రాధాన్యం చికెన్ బిర్యానీదే! అంతలా మన ఆహారపుటలవాట్లలో భాగమైందీ వంటకం. అయితే ఈ ఏడాది కరోనా రాకతో చాలామంది తమ ఆహారపుటలవాట్లను మార్చుకున్నారు.. ఆరోగ్యం పేరుతో ఇంటి ఆహారానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. అయినా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బిర్యానీ ప్రియులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదనడానికి ‘స్విగ్గీ’ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికే ప్రత్యక్ష నిదర్శనం!
లాక్‌డౌన్‌కు ముందు, తర్వాత, ఇంటి నుంచి పనిచేసే క్రమంలో ఇంటి ఆహారానికే ప్రాధాన్యమిచ్చినా.. బిర్యానీ ఆర్డర్లు ఏమాత్రం తగ్గలేదంటోందీ ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ. ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చాయంటే దీనిపై భారతీయులకున్న మోజు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇదొక్కటే కాదు.. కరోనా మహమ్మారి ముంచెత్తిన ఈ ఏడాదిలో తమ ఆన్లైన్ ఫుడ్ ప్లాట్‌ఫామ్ వేదికగా మరికొన్ని ఆహార పదార్థాల్ని సైతం తెగ ఆర్డర్ చేశారట ఫుడ్ లవర్స్. మరి, స్విగ్గీ వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది హవా కొనసాగించిన ఆ పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
ఎన్నో ప్రతికూలతల నడుమ మొదలైన ఈ ఏడాది ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాదైనా సంతోషంగా సాగాలని ఎంతో ఉత్సాహంగా నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారంతా! అయితే ఈ సందర్భంగా గడిచిన ఏడాది జరిగిన పలు విషయాల గురించి నెమరువేసుకోవడం మనకు అలవాటే! ఇందులో భాగంగానే ఈ ఏడాది తమ హవా కొనసాగించిన పలు ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటుంటాం. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ కూడా అదే చేసింది. ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్ వేదికగా ఎక్కువమంది ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలేంటో గాలించి వార్షిక విశ్లేషణను విడుదల చేసింది. ఏటా ఈ జాబితాలో ముందుండే చికెన్ బిర్యానీ ఈసారీ తన హవాను కొనసాగించి టాప్ ఫుడ్ ట్రెండ్‌గా నిలిచింది.

ఒక వెజ్ బిర్యానీకి ఆరు చికెన్ బిర్యానీలు!
వెజ్, పనీర్, ఆలూ, చికెన్, మటన్, ఎగ్.. ఇలా ఎన్ని బిర్యానీలున్నా మనందరం మోజు పడేది మాత్రం చికెన్ బిర్యానీ పైనే! అంతటి అమోఘమైన రుచి, సువాసన దీని సొంతం. అందుకే విదేశీయులు సైతం మన దేశంలో అడుగుపెట్టారంటే చికెన్ బిర్యానీ రుచి చూడందే ఇక్కడి నుంచి తిరిగి వెళ్లరు. అంతేకాదు.. ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్నా తమ ముంగిటకే బిర్యానీని ఆర్డర్ చేసుకుంటుంటారు కూడా! అలా తమ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ వేదికగా చికెన్ బిర్యానీకే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటోంది స్విగ్గీ. అదెంతలా అంటే ఒక సెకనుకు ఒకటి కంటే ఎక్కువ చికెన్ బిర్యానీ ఆర్డర్స్ వచ్చాయంటే దీనిపై భారతీయులకున్న క్రేజు, మోజు ఏంటో అర్థమవుతుంది! అంతేకాదు.. ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ వస్తే, అదే సమయంలో ఆరు చికెన్ బిర్యానీ ఆర్డర్స్ వచ్చాయని చెబుతోందీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్. అయితే ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ చికెన్ బిర్యానీపై ఆహార ప్రియులకున్న మోజు ఏమాత్రం తగ్గలేదని ఈ రిపోర్ట్ ద్వారా రుజువవుతుంది.

ఆర్డర్స్ ఫ్రమ్ హోమ్!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకొచ్చాక మనం ఎక్కడున్నా, ఏ ఆహారం కావాలన్నా.. నిమిషాల్లో మన ముందు వాలిపోతోంది. అయితే సాధారణంగా ఉద్యోగం చేసే వారికి ఇంట్లో వంట చేసే సమయం లేకపోవడంతో ఆఫీస్ నుంచే తమకు నచ్చిన ఆహారం ఆర్డర్ చేస్తుంటారు. కానీ ఈ ఏడాదంతా కరోనా కారణంగా చాలామంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. అందుకే ఈ ఏడాది తమకు అందిన ఆర్డర్స్‌లో ఇంటి నుంచే ఎక్కువ శాతం ఉన్నాయంటోంది స్విగ్గీ. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి-మార్చి) ఆఫీస్ అడ్రస్‌తో పోల్చితే ఇంటి అడ్రస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఐదు రెట్లు అధికంగా ఉన్నాయంటోంది. ఇక లాక్డౌన్ మొదలయ్యాక అంటే ఏప్రిల్-మే మధ్య కాలంలో ఆర్డర్స్ ఫ్రమ్ హోమ్ తొమ్మిది రెట్లు పెరిగాయట! ఇందులోనూ మసాలా దోసె, పనీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ.. వంటి ఫుడ్ ఐటమ్స్‌ని ఎక్కువ మంది ఆర్డర్ చేశారంటోంది స్విగ్గీ.
వాటిని మిస్సవలేదు!
* ఆఫీస్ బ్రేక్స్‌లో కొలీగ్స్‌తో కలిసి ఛాయ్/కాఫీ తాగుతూ పిచ్చాపాటీ మాట్లాడుకోవడం చాలామందికి అలవాటే! అయితే ఈ ఏడాదంతా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్‌కి పరిమితమవడంతో మాటలైతే మిస్సయ్యారేమో గానీ.. టీ/కాఫీలు మాత్రం చాలామంది మిస్సవలేదంటోంది స్విగ్గీ. ఎందుకంటే ఇంటి నుంచి పనిచేసినా కూడా ఎక్కువమంది టీ/కాఫీ ప్రియులు విభిన్న రకాల టీ/కాఫీలను తమ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ వేదికగా ఆర్డర్ చేశారంటోందీ సంస్థ.

* ఇక పానీ పూరీ లవర్స్ అయితే లాక్డౌన్లో ఈ ఛాట్‌ని మిస్సయినా.. లాక్డౌన్ తర్వాత మాత్రం తమ పానీ పూరీ మోజు తీర్చుకున్నారంటోంది స్విగ్గీ. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత సుమారు రెండు లక్షలకు పైగానే పానీ పూరీ ఆర్డర్స్ వచ్చాయంటోందీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్.
* ఇక ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన వంటకాలను (గ్లూటెన్-ఫ్రీ, తక్కువ కార్బోహైడ్రేట్లున్నవి, కీటో డైట్.. మొదలైనవి) అందరికీ చేరువ చేయడానికి ‘స్విగ్గీ హెల్త్ హబ్’ పేరిట ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది స్విగ్గీ. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి.. వంటి మహా నగరాల నుంచి చాలామంది ఈ వేదికగా తమకు నచ్చిన హెల్దీ వంటకాల్ని ఆర్డర్ చేసుకున్నారట!
* ఇక ఇందులోనూ తృణధాన్యాలు, చిరుధాన్యాలతో చేసిన వంటకాలు; వీగన్ వంటలు; ప్రొటీన్లు ఎక్కువగా ఉండే రెసిపీలు; కీటోజెనిక్ పదార్థాలు.. వంటివి ఎక్కువమంది ఆర్డర్ చేసుకున్న వంటల జాబితాలో ఉన్నాయి.

* ఇక ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ పేరుతో నిర్వహిస్తోన్న తమ ఆన్లైన్ గ్రాసరీ షాపింగ్ వెబ్సైట్ వేదికగా సుమారు 75 వేల కిలోల ఉల్లిపాయలను ఇంటి వద్దకే డెలివరీ చేసిందట స్విగ్గీ. అంతేకాదు.. బంగాళాదుంపలు, అరటిపండ్లు, కొత్తిమీర, పాలు.. వంటి ఐటమ్స్‌ను కూడా చాలామంది ఆర్డర్ చేశారని చెబుతోందీ సంస్థ.
* ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్‌ని ఇంటి ముంగిట్లోకి పంపడమే కాదు.. ఇంట్లో వంట చేసుకునే వారి కోసం 1,60,000 మీల్ కిట్స్‌ని కూడా ‘ఇన్‌స్టామార్ట్’ వేదికగా డెలివరీ చేసిందట స్విగ్గీ.
మొత్తానికి కరోనా ప్రతికూల పరిస్థితులను ఎదిరించి మరీ చికెన్ బిర్యానీ రుచిని ఆస్వాదించారు ఆహార ప్రియులు. మరి, ఈ ఏడాది మీరు బాగా ఎంజాయ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏమిటి? కింద కామెంట్ బాక్స్ ద్వారా మీ ఫుడ్ ఎక్స్‌పీరియన్స్‌ని మాతో పంచుకోండి.