అమానవీయం... అకృత్యం.. దారుణం.. బహుశా ఇలాంటి పదాలేవీ ‘నిర్భయ’ ఘటనను ఉదహరించడానికి సరిపోకపోవచ్చు. దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ క్రూర ఘటన ఓ కన్నతల్లికి తీరని గర్భశోకాన్ని మిగల్చగా, యావత్ భారతావని చేత కన్నీళ్లు పెట్టించింది. అసహాయురాలైన ఆడపిల్లను బలిగొన్న దుర్మార్గులకు ఉరేసరి అంటూ అందరూ రోడ్ల మీదకు వచ్చేలా చేసింది. ఈమేరకు మానవత్వానికే మచ్చగా మిగిలిపోయిన ‘నిర్భయ’ ఘటనకు నేటితో (డిసెంబర్ 16) ఎనిమిదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా నిర్భయకు నివాళి అర్పించిన ఆమె తల్లి ఆశాదేవి... అత్యాచార బాధితులందరికీ న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని మరోసారి నినదించారు.
అయినా నా పోరాటం ఆగదు!
ఎనిమిదేళ్ల క్రితం దిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆరుగురు కీచకులు కదులుతున్న బస్సులోనే ఓ ఆడపిల్ల జీవితాన్ని కడతేర్చారు. ఈక్రమంలో తన కూతురిలా మరొకరు బలికాకూడదంటూ ఏడేళ్లు సుదీర్ఘ పోరాటం చేసి మరీ కీచకులను ఉరికంబం ఎక్కించారు నిర్భయ తల్లి ఆశా దేవి. ఈ ఏడాది మార్చి 20న ఉదయం 5.30గంటలకు దిల్లీలోని తిహాడ్ జైలులో నిర్భయ దోషులను చనిపోయే వరకు ఉరి తీశారు. ఈ నేపథ్యంలో మరణ దండన పూర్తయిన 9 నెలల తర్వాత మీడియా ముందుకొచ్చారు ఆశా దేవి. ఈ సందర్భంగా తన కుమార్తెకు నివాళిగా అత్యాచార బాధితులందరికీ న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తానంటూ మరోసారి శపథం చేశారు.
ప్రతి ఆడబిడ్డలో నా కూతురిని చూసుకుంటున్నా!
‘ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు నా కుమార్తెకు న్యాయం జరిగింది. దేశ చరిత్రలో తొలిసారిగా నలుగురు రేపిస్ట్‌లకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ మరణదండన దేశ ప్రజలందరికీ న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా చేసింది. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవనే సందేశం సమాజానికి పంపించింది. అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా పోరాడాలని ఎనిమిదేళ్ల క్రితమే నేను నిర్ణయించుకున్నాను. అప్పుడు ఆస్పత్రిలో నా కుమార్తె ఎంతో నరకయాతన అనుభవించింది. ఆ సమయంలో నేను ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు. నా కూతురితో పాటు అత్యాచార బాధితులందరికీ న్యాయం జరిగేలా నా గళం వినిపించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డ, అత్యాచారానికి గురైన బాధితురాలి ముఖంలో నా కన్న కూతురును చూసుకుంటున్నాను.’
అలాగని మౌనంగా కూర్చోలేను!
‘నా కుమార్తెకు జరిగిన అన్యాయానికి దోషుల మరణశిక్షతో న్యాయం జరిగింది. కానీ అత్యాచారానికి గురైన ఎంతోమంది కూతుళ్లకు సరైన న్యాయం జరగడం లేదు. నా కూతురికి న్యాయం జరిగింది కదా అని.. నేను మౌనంగా కూర్చోను. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాను. ఇలాగే నేను నా కుమార్తెకు నివాళి అర్పిస్తాను. దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలందరూ కలిసి రావాలి. ఇక అత్యాచార బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉంది. కానీ కొంతమంది న్యాయవాదులు బాధితులకు ద్రోహం చేస్తూ నేరం చేసిన వారి తరఫున వాదిస్తున్నారు. నిర్భయ కేసులో కూడా దోషుల శిక్షను వాయిదా వేయడానికి డిఫెన్స్ న్యాయవాదులు ఎంతగానో ప్రయత్నించారు. ఇది సరైంది కాదు.’

పురుషుల ఆలోచనా విధానం మారాలి!
‘ఇటీవల యూపీలోని హథ్రాస్‌లో ఓ ఆడపిల్లను దారుణంగా హత్యాచారం చేశారు. పైగా కుటుంబ సభ్యులు కూడా ఆమెను చూడనివ్వకుండా అక్కడి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది నన్నెంతో కలచివేసింది. అయితే ఇప్పటికీ మనం ఆడపిల్లల భద్రతపైనే మాట్లాడుకుంటున్నాం. వారు ఇంట్లోనే ఉండాలని, స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోవాలని సలహాలు ఇస్తున్నాం. అంతేకానీ... పురుషులు తమ ఆలోచనా విధానం మార్చుకోవాలని ఎవరూ చెప్పడం లేదు. మగవారి మైండ్‌సెట్‌లో మార్పులొస్తేనే ఇలాంటి అఘాయిత్యాలు ఆగుతాయి. సమాజంలోని ఇతర అంశాల కంటే మహిళల రక్షణకు ప్రభుత్వాలు తొలి ప్రాధాన్యమివ్వాలి..’ అంటూ తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు ఆశా దేవి.