సాధారణంగా తమ అభిమాన హీరోయిన్లకు సంబంధించిన అప్డేట్స్ కావాలంటే చాలామంది వారి సోషల్ మీడియా ఖాతాలనే ఆశ్రయిస్తారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లను శోధించి వారి వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలు, ఫొటోలు, వీడియోలు... తదితర సమాచారం తెలుసుకుంటుంటారు. ఈక్రమంలో 2020 సంవత్సరానికి సంబంధించి తమ ప్లాట్‌ఫాం వేదికగా నెటిజన్లు అత్యధికంగా మాట్లాడుకున్న హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది ట్విట్టర్ ఇండియా. ‘మోస్ట్ ట్వీటెడ్ స్టార్స్-2020’ పేరుతో విడుదల చేసిన ఈ లిస్టులో ‘మహానటి’ కీర్తి సురేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ ఏడాది ఆమె గురించే నెటిజన్లు ఎక్కువగా ట్వీట్లు, రీట్వీట్లు చేశారని ట్విట్టర్ ఇండియా తెలిపింది. కీర్తితో పాటు పలువురు కథానాయికలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
మరి, ఈ జాబితాలో టాప్-10లో నిలిచిన నటీమణులెవరో, నెటిజన్లు వారి గురించే ఎందుకు ఎక్కువగా మాట్లాడుకున్నారో తెలుసుకుందాం రండి.
కీర్తి సురేశ్
‘మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న కీర్తి.. మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిందీ స్టార్ హీరోయిన్. మరోపక్క ఆమె నటిస్తోన్న ‘గుడ్ లక్ సఖి’, ‘రంగ్‌దే’, ‘మరక్కర్’, ‘అన్నాత్తే’, ‘సర్కారు వారి పాట’... తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో అభిమానులు ఆమె కోసం భారీగానే ట్వీట్లు చేశారు. ‘మహానటి’ తర్వాత కీర్తి సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ట్విట్టర్లో ఈ ముద్దుగుమ్మను 3.4 మిలియన్ల మంది అనుసరిస్తుంటే, ఆమె 260 మందిని ఫాలో అవుతోంది.
కాజల్ అగర్వాల్
తన ప్రియుడు గౌతమ్ కిచ్లును మనువాడి 2020 సంవత్సరాన్ని మధుర జ్ఞాపకంగా మార్చుకుంది కాజల్ అగర్వాల్. ఈ నేపథ్యంలో నెట్ప్రియులు ఆమె గురించి ఎక్కువగానే ట్వీట్లు, రీట్వీట్లు చేశారు. ఈ ‘చందమామ’ను ట్విట్టర్లో 4.5 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా, ఆమె 266 మందిని అనుసరిస్తోంది. పెళ్లయ్యాక కూడా సినిమాలు చేస్తానని ప్రకటించిన ఆమె ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోంది.
సమంత
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైనప్పటికీ సోషల్ మీడియాలో చాలా బిజీగా గడిపింది అక్కినేని సమంత. ఈ ఖాళీ సమయంలో టెర్రస్‌పై రకరకాల కూరగాయలు పండించిన ఆమె కొత్త రకం వంటకాలను కూడా నేర్చుకుంది. ‘సాకీ’ పేరుతో ఓ కొత్త ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది. అంతేనా.. తెలుగు బిగ్‌బాస్ షోలో గెస్ట్ హోస్ట్‌గా కూడా వ్యవహరించిందీ ముద్దుగుమ్మ. ఇక వీటితో పాటు తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది సామ్. ఇవే తనను ట్విట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచేలా చేశాయి. సామ్‌ను ట్విట్టర్లో 8.5 మిలియన్ల మంది అనుసరిస్తుండగా, ఆమె 199 మందిని ఫాలో అవుతోంది.
రష్మిక మందన
ఈ ఏడాది ప్రారంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో వరుస హిట్లు అందుకుంది రష్మిక మందన. అంతేకాదు ‘పుష్ప’, ‘సుల్తాన్’, ‘పొగరు’, ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ లాంటి సినిమాలకు సైన్ చేసింది. లాక్డౌన్లో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఆమె తన ఊరి ముచ్చట్లతో పాటు కొత్త వంటకాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఆమె పేరు ట్విట్టర్లో మార్మోగిపోయింది. రష్మికను ట్టిట్టర్లో 2.3 మిలియన్ల మంది అనుసరిస్తుంటే, ఆమె 207 మందిని ఫాలో అవుతోంది.
పూజా హెగ్డే
ఈ ఏడాది ప్రారంభంలో ‘అల... వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకుంది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాధేశ్యామ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు బాలీవుడ్లో సల్మాన్‌ఖాన్ వంటి స్టార్ హీరోలతో జతకడుతోందీ ముద్దుగుమ్మ. దీంతో నెటిజన్లందరూ ఈ భామ గురించి బాగానే మాట్లాడుకున్నారట! అందుకే ఈ ఏడాది మోస్ట్ ట్వీటెడ్ స్టార్స్‌లో ఒకరిగా నిలిచిందీ బుట్టబొమ్మ. పూజను ట్విట్టర్లో 2.9 మిలియన్ల మంది అనుసరిస్తుండగా... ఆమె 86 మందిని ఫాలో అవుతోంది.
తాప్సీ
బాలీవుడ్లో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది తాప్సీ. ఈ ఏడాది ‘థప్పడ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో.. ప్రస్తుతం ‘హసీన్ దిల్రుబా’, ‘రష్మీ రాకెట్’ వంటి హిందీ చిత్రాలతో పాటు ‘జనగణమన’ అనే తమిళ చిత్రాలున్నాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఆమె సామాజిక అంశాలు, మహిళా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఇక మాల్దీవుల్లో తన బికినీ ఫొటోషూట్ తాప్సీని ట్వి్ట్టర్లో ట్రెండింగ్‌లో నిలిచేలా చేసింది. ట్విట్టర్లో ఈ ముద్దుగుమ్మను 4.3 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆమె 164 మందిని ఫాలో అవుతోంది.
తమన్నా
ఈ ఏడాది ప్రారంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్‌బాబుతో కలిసి ఆడిపాడింది తమన్నా. లాక్డౌన్ కాలంలో ఆమె నటించిన ‘నవంబర్ స్టోరీ’, ‘లెవెంత్ అవర్’ వెబ్‌సిరీస్‌లు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు ‘సిటీమార్’, ‘దటీజ్ మహాలక్ష్మి’, ‘బోలె ఛూడియాన్’, ‘గుర్తుందా శీతాకాలం’... తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న ఈ మిల్కీ బ్యూటీ.. కొవిడ్ జాగ్రత్తల్ని సూచిస్తూ తన అభిమానులను పదే పదే అలర్ట్ చేస్తూ వచ్చింది. తమ్మూని ట్వి్ట్టర్లో 4.8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆమె 180 మందిని ఫాలో అవుతోంది. వరుస సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తున్నందున ఆమె గురించి ఎక్కువగా ట్వీట్లు, రీట్వీట్లు పోస్ట్ అయ్యాయి.
రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. ట్విట్టర్లో ఆమెను 4.4 మిలియన్ల మంది అనుసరిస్తుండగా, ఆమె 302 మందిని ఫాలో అవుతోంది. గతేడాది ‘దేవ్’, ‘దే దే ప్యార్ డే’, ‘ఎన్జీకే’, ‘మన్మథుడు’ తదితర చిత్రాల్లో కనిపించి సందడి చేసిన ఈ పంజాబీ బ్యూటీ చేతిలో మరో ఏడు సినిమాలున్నాయి. ‘ఇండియన్-2’, ‘మే డే’, ‘అటాక్’, ‘చెక్’, ‘థ్యాంక్‌గాడ్’ చిత్రాలతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో తొలిసారిగా డీగ్లామర్ రోల్లో కనిపించనుందీ ముద్దుగుమ్మ. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే రకుల్ లాక్డౌన్లో తన జిమ్, వర్కవుట్స్‌కు సంబంధించిన విషయాలన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్ ఆరోపణల్ని కూడా ఎదుర్కొందీ బ్యూటీ. ఇలా పలు అంశాల ఆధారంగా ఆమె ఈ ఏడాది ‘మోస్ట్ ట్వీటెడ్ స్టార్స్-2020’ జాబితాలో చోటు దక్కించుకుంది.
శృతి హాసన్
2017 తర్వాత మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి హాసన్ ఈ ఏడాది మళ్లీ మేకప్ వేసుకుంది. ఇందులో భాగంగా ‘దేవి’ అనే షార్ట్‌ఫిలింలో నటించిన ఆమె ‘యారా’ (హిందీ) సినిమాలోనూ హీరోయిన్గా మెప్పించింది. ఇక ఐదుగురు తమిళ దర్శకులు తెరకెక్కించిన ‘పుత్తం పుదు కాలై’ చిత్రంలోనూ సందడి చేసింది. వీటితో పాటు ఆమె చేతిలో ‘వకీల్ సాబ్’, ‘క్రాక్’, ‘లాభం’ వంటి క్రేజీ సినిమాలున్నాయి. సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం, సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండడంతో ఈ ఏడాది ఆమె కోసం అభిమానులు భారీగానే ట్వీట్లు, రీట్వీట్లు చేశారు. ఇక ట్విట్టర్లో 7.7 మిలియన్ల మంది ఫాలోవర్లున్న శృతి.. 339 మందిని ఫాలో అవుతోంది.
త్రిష
18 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోన్న త్రిష ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచింది. గతేడాది ‘పేట’ సినిమాతో సందడి చేసిన ఆమె ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’, ‘రామ్’, ‘రాంగీ’.. తదితర చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామను ట్విట్టర్లో 5.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె 47 మందిని అనుసరిస్తోంది.