పెళ్లంటే పది కాలాల పాటు నలుగురూ మాట్లాడుకునేంత అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకుంటారు. కానీ ఏ దుర్ముహూర్తాన ఈ కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిందో అప్పట్నుంచి పెళ్లిళ్ల స్వరూపమే మారిపోయింది. అందరూ ఒక్కచోట చేరి ఆడిపాడే సందళ్లు కరువయ్యాయి. మనసారా మాట్లాడుకుంటూ విందు భోజనం చేసే అవకాశమే లేకుండా పోయింది. ఈ క్రమంలో తమకు నచ్చినా నచ్చకపోయినా ఎంతో సింపుల్‌గా పెళ్లి తంతు ముగించేస్తున్నాయి చాలా జంటలు.
అయితే తమిళనాడుకు చెందిన ఓ జంట ఈ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడాలనుకోలేదు. అలాగని కొవిడ్ నిబంధనల్ని విస్మరించలేదు. అటు నియమాలు పాటిస్తూనే.. ఇటు తమ బంధువులందరినీ తమ వివాహంలో భాగం చేసింది. ‘ఏముంది.. వర్చువల్‌గానే కదా!’ అనుకుంటున్నారా? అంతకుమించిన సర్ప్రైజే ఇచ్చారీ కొత్త జంట. అందుకే ‘వాట్ యాన్ ఐడియా!’ అంటూ అందరూ ఈ న్యూ కపుల్‌ని తెగ ప్రశంసించేస్తున్నారు. మరి, కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూనే అతిథులందరినీ వీరి పెళ్లిలో ఎలా భాగం చేశారు? ఎవరినీ చిన్నబుచ్చకుండా అందరినీ ఎలా సంతృప్తి పరచగలిగారు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
కరోనా దెబ్బకు పెళ్లిళ్లన్నీ అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే జరుగుతున్నాయి. ఇక కొంతమందేమో తమ పెళ్లి తంతును తమ బంధువులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తున్నారు. అయితే తమిళనాడుకు చెందిన శివప్రకాశ్ - మహతి జంట ఇంతకుమించిన ఆలోచనే చేసింది. సాధారణంగా మనం పెళ్లికి పిలవాలనుకున్న వారికే ఆహ్వాన పత్రిక అందిస్తాం. కానీ ఈ కపుల్ తమ పెళ్లికి వర్చువల్‌గా ఆహ్వానించడానికి కూడా అందరికీ ఇన్విటేషన్స్ అందించారు.
వివాహ విందు డోర్ డెలివరీ!
ఇక ఇలా ఆన్లైన్లో పెళ్లి చూసిన వారు అదే వేదికగా కొత్త జంటల్ని ఆశీర్వదిస్తుంటారు. అయితే ఇలా వారి ఆశీర్వచనాలు అందుకోవడమే కాదు.. తమ పెళ్లి భోజనాన్ని సరాసరి అతిథుల ఇళ్లకే పంపించి వారిని సర్ ప్రైజ్ చేశారు. ఈ క్రమంలో- ఆహ్వాన పత్రికలో పెళ్లి తేదీ, సమయం, తమ పెళ్లి వెబ్‌క్యాస్ట్ అయ్యే వెబ్‌సైట్స్, అందులోకి లాగిన్ అవడానికి పాస్వర్డ్.. వంటివన్నీ ప్రచురించారు. ఆపై ఆఖరున అచ్చు వేయించిన ఓ గమనిక అందరినీ ఆకట్టుకుంది. అదేంటంటే.. పెళ్లి రోజున వివాహ విందును ఇంటికే పార్శిల్ చేస్తామని, మీరు తప్పకుండా ఆ పార్శిల్ ప్యాకెట్స్‌ని స్వీకరించాలని అందులో రాసుంది. ఇలా వధూవరులు, వారి కుటుంబ సభ్యులు చర్చించి ఈ విభిన్న ఆలోచనతో ముందుకొచ్చారట!
‘కల్యాణ సప్పడు’లో ఏముందంటే!
కేవలం పార్శిల్‌ను స్వీకరించాలని చెప్పి చేతులు దులుపుకోవాలనుకోలేదీ జంట. అసలు వారు పంపించబోయే విందులో ఏయే పదార్థాలు, వంటకాలున్నాయో కూడా అతిథులకు ముందుగానే తెలియజేయాలనుకున్నారు. ఈ క్రమంలో ‘కల్యాణ సప్పడు (వివాహ విందు)’ పేరుతో ప్రత్యేకంగా ఓ కార్డు తయారుచేయించారు. పార్శిల్లో ఉన్న ఐటమ్స్ పేర్లను ఈ కార్డ్‌లో ప్రింట్ చేయించారు. అన్నం, కూరలు, స్వీట్స్, అప్పడాలు.. ఇలా మొత్తంగా పన్నెండు వంటకాలను నాలుగు టిఫిన్ క్యారియర్స్‌లో అరటి ఆకులతో సహా ప్యాక్ చేయించి.. వాటిని నాలుగు కలర్‌ఫుల్ వెదురు బ్యాగ్స్‌లో అమర్చారు. ఇలా ఈ బ్యాగ్స్‌తో పాటు మెనూ పేరుతో ప్రింట్ చేయించిన కార్డ్‌ను వీటికి అనుసంధానించి ఈ పార్శిల్‌ను అతిథుల ఇళ్లకు డోర్ డెలివరీ చేశారు. అంతేకాదు.. తాము పంపించిన పదార్ధాలను అరిటాకులో ఏ క్రమంలో వడ్డించుకోవాలో కూడా ఆ కార్డులో పేర్కొనడం విశేషం. ఈ కల్యాణ సప్పడుకు సంబంధించిన ఫొటోల్ని ఓ నెటిజన్ ట్విట్టర్లో పంచుకోగా.. ప్రస్తుతం ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి.
వావ్.. సూపర్బ్ ఐడియా!
‘ఇదో సరికొత్త వెడ్డింగ్ ట్రెండ్.. వివాహ విందు ఇలా ఇంటి ముంగిట్లోకే వచ్చింది..’ అంటూ సదరు నెటిజన్ పోస్ట్ చేసిన ఫొటోలు చూసిన నెట్ ప్రియులు ‘వావ్.. సూపర్బ్ ఐడియా’ అంటూ ఈ కొత్త జంటను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ‘ఇదో అద్భుతమైన ఐడియా.. అటు కరోనా నిబంధనల్ని పాటిస్తూనే.. ఇటు తమ పెళ్లిని అందరూ పది కాలాల పాటు గుర్తుంచుకునేలా చేశారు.. దీనివల్ల కొంతవరకు ఆహార వృథాను కూడా తగ్గించచ్చు..’ అని ఒకరంటే; ‘వర్చువల్‌గా పెళ్లి చూసి ఈ వేదికగానే ఇంట్లో అందరూ కలిసి వివాహ విందు ఆరగిస్తుంటే ఆ మజాయే వేరు! ఇక దీనికి తోడు నచ్చిన సంగీతాన్ని కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తుంటే అచ్చం పెళ్లికెళ్లి భోం చేసినట్లే అనిపించడం ఖాయం!’ అని మరొకరు అంటున్నారు. ఇంకొందరేమో ‘ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఇది మంచి ఐడియానే.. కానీ కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమేమో అనిపిస్తోంది..’ అంటూ విభిన్నంగా స్పందిస్తున్నారు.

ఏదేమైనా తమ బంధువుల్ని వర్చువల్‌గా పెళ్లికి పిలిచి.. వారికి విందు భోజనం ఇంటికే పార్శిల్ పంపించి.. వారిని సంతృప్తపరిచారీ కొత్త జంట. మరి, ఈ కొత్త జంట ఐడియా మీకెలా అనిపిస్తోంది? మీ మనసులోని మాటల్ని ‘వసుంధర.నెట్’ వేదికగా పంచుకోండి..!