Image for Representation
పెళ్లైన ప్రతి మహిళా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది.. తల్లిప్రేమను పొందాలని తపిస్తుంది. అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన బ్రెయన్నా లాక్వుడ్ కూడా ‘అమ్మా’ అన్న పిలుపు కోసం ఆరాటపడింది. అయితే ఆదిలోనే సంతాన సమస్యలు ఆమె కలను కల్లలు చేశాయి. ఎలాగైనా అమ్మ కావాలని పరితపించిన ఆమె.. ఎందరో డాక్టర్లను కలిసింది.. ఎన్నో చికిత్సలు చేయించుకుంది.. ఆఖరికి ఐవీఎఫ్ దాకా కూడా వెళ్లింది. ఇలా ఆమె చేసిన ప్రతి ప్రయత్నం విఫలయత్నమే అయింది. అయినా తన తల్లి సహాయంతో ఇటీవలే ఓ పండంటి పాపాయికి జన్మనిచ్చి అమ్మతనాన్ని పొందిందామె. అంతేనా.. ఈ క్రమంలో తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయింది బ్రెయన్నా. మరి, ఎన్ని నోములు నోచినా తనకు కలగని సంతానం తన తల్లి ద్వారా ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన బ్రెయన్నా లాక్వుడ్కు ఆరోన్ లాక్వుడ్తో 2016లో వివాహమైంది. సాధారణంగా అన్ని జంటల్లాగే పెళ్లి తర్వాత అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందాలనుకున్నారీ క్యూట్ కపుల్. కానీ ఎంత ప్రయత్నించినా సంతాన సమస్యలు బ్రెయన్నాకు అడ్డంకిగా మారాయి. కొన్ని సార్లైతే గర్భం ధరించినా అది నిలవకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురయ్యారు లాక్వుడ్ దంపతులు. ఇలా ఎంత ప్రయత్నించినా సంతానం కలగకపోయే సరికి వైద్యుల్ని ఆశ్రయించారు.
అన్నీ విఫలయత్నాలే!
ఓవైపు తాను తల్లినవుతానో, లేదోనన్న బాధ.. మరోవైపు మానసిక ఒత్తిడితోనే ఎందరో డాక్టర్లను కలిశారీ దంపతులు. అమ్మానాన్నలు కావాలన్న ఆశతో ఇంజెక్షన్ల దగ్గర్నుంచి ఐవీఎఫ్ దాకా ఏ చికిత్సకూ వెనకాడలేదు వారు. ఈ క్రమంలో రెండుసార్లు గర్భం ధరించిన బ్రెయన్నా.. ఓసారి ఒక బిడ్డను, మరోసారి కవలల్ని కడుపులోనే పోగొట్టుకుంది. ఇంకోసారైతే గర్భసంచి వెలుపల పిండం ఏర్పడి (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) మరోసారి అబార్షన్ అయింది. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవడంతో తాను ఇక తల్లిని కాలేనేమోనన్న నిరాశలోకి కూరుకుపోయిందామె. ఆ సమయంలో ఆఖరి ప్రయత్నంగా సరోగసీ (అద్దె గర్భం) విధానం ద్వారా తల్లిదండ్రులు కావచ్చని వైద్యులు లాక్వుడ్ జంటకు సూచించారు. అందుకోసం కుటుంబ సభ్యులు లేదంటే తెలిసిన వారి సహాయం కోరచ్చని వారు సలహా ఇచ్చారు. అయితే అప్పటికే పీకల్లోతు బాధలోకి కూరుకుపోయిన బ్రెయన్నా-ఆరోన్లకు డాక్టర్ సలహా చీకట్లో వెలుగు రేఖలా కనిపించింది. ఈ ఐడియా బాగానే ఉంది.. కానీ అద్దె గర్భం కోసం ఎవరు ముందుకొస్తారు? అని ఆలోచనలో పడిపోయిన లాక్వుడ్ జంటకు.. బ్రెయన్నా తల్లి జూలీ లవింగ్ అండగా నిలిచింది.
అలా మనవరాలికి తల్లైంది!
కన్న కూతురిని తల్లిని చేయాలన్న ఉద్దేశంతో అద్దె గర్భానికి ఒప్పుకున్న తన తల్లి త్యాగం మరువలేనిదంటోంది బ్రెయన్నా. ‘అమ్మతనం కోసం సుమారు నాలుగేళ్ల పాటు ఎన్నో చికిత్సలు చేయించుకొని నిరాశ చెందిన మాలో మా అమ్మ జూలీ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆఖరి ప్రయత్నంగా అద్దె గర్భం ద్వారా అమ్మతనాన్ని పొందచ్చని డాక్టర్లు చెప్పిన తర్వాత నాకోసం అమ్మే స్వయంగా ముందుకొస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో గర్భం ధరించిన మా అమ్మ.. ఇటీవలే పండంటి ఆడపిల్లను ప్రసవించి నాకు కానుకగా అందించింది. ఆమె త్యాగం మరువలేనిది.. ఆమె రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. ఇక ఎప్పటికీ గొడ్రాలిగా మిగిలిపోవాల్సిందేనేమో అన్న నిరాశలోకి కూరుకుపోయిన నా జీవితంలో తిరిగి వెలుగులు నింపింది మా అమ్మ. ఇలా నా చిన్నారిని నా చేతుల్లోకి తీసుకోవడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను.. మా బుజ్జాయికి బ్రియర్ జ్యులెట్టే లాక్వుడ్ అని పేరు పెట్టాం..’ అంటూ మురిసిపోతోంది బ్రెయన్నా.
ఆ ఆప్షన్ మీ చేతుల్లోనే ఉంది!
సంతానం కలగకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించిన బ్రెయన్నా.. అందుకోసం ప్రస్తుత రోజుల్లో ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, బాధపడాల్సిన అవసరం లేదని తన పాపాయి పుట్టాకే తెలుసుకున్నానంటోంది. ‘ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మనకెదురయ్యే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నట్లు నా సంతానలేమి సమస్యకు సరోగసీ విధానం ఓ వెలుగు రేఖలా కనిపించింది. నేనే కాదు.. నాలా ఎంతోమంది అమ్మతనం కోసం పరితపించిపోతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాకపోవడంతో నిరాశ పడుతున్నారు. అయితే అమ్మ కావాలంటే తానే గర్భం ధరించాల్సిన అవసరం లేదు.. అందుకు విభిన్న మార్గాలున్నాయి.. నేను ఎంచుకుంది కూడా అలాంటి ఓ మార్గమే! మీరు కూడా బాధ పడకుండా వైద్యుల సలహా మేరకు మీకు నచ్చిన మార్గాన్ని అన్వేషించి అమ్మతనాన్ని పొందచ్చు..’ అంటూ సంతానలేమితో బాధపడుతోన్న ఇతర మహిళల్లో ధైర్యం నింపుతోంది బ్రెయన్నా.
|
ఫిట్నెస్ వల్లే ఇది సాధ్యమైంది!
మరి, ఇదిలా ఉంటే.. ఇప్పటికే 51 ఏళ్ల వయసున్న బ్రెయన్నా తల్లి జూలీ.. ఈ వయసులో గర్భం ధరించడం, ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే! కానీ తన ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి వల్లే ఇదంతా సాధ్యమైందంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు జూలీ. ‘నాకు ముందు నుంచే ఫిట్నెస్పై శ్రద్ధ ఎక్కువ. ఈ క్రమంలో ఇప్పటికే నేను 19కి పైగా మారథాన్లలో, ఎన్నో ట్రయాథ్లాన్లలో పాల్గొన్నా. అదే నా హెల్త్ సీక్రెట్! నా కూతురు, కొడుకు కడుపులో పడ్డప్పుడు కూడా నాకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు.. అప్పుడు ప్రెగ్నెన్సీని ఎంతగా ఎంజాయ్ చేశానో.. ఇప్పుడు నా మనవరాలికి జన్మనిచ్చే క్రమంలో కూడా అంతే ఆస్వాదించా..’ అంటూ తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు జూలీ.
|