నలభై దాటినా సరే - ఫిట్నెస్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి. యోగ సాధనలో ఆరితేరిన ఈ అందాల తారతో ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎవరూ పోటీ పడలేరేమో. అంతే కాదు.. ఎప్పటికప్పుడు వివిధ ఆరోగ్యకరమైన వంటకాలు తయారుచేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియా పేజీల్లో అందరితో షేర్ చేస్తుంటుంది. వాటిలోని పోషక విలువల్ని వివరిస్తూ తన ఫ్యాన్స్‌లో ఆరోగ్యం పట్ల అవగాహనను మరింతగా పెంచుతుంటుందీ అందాల అమ్మ. ఇప్పుడు 'మీకు సంతోషం సీక్రెట్ తెలుసా' అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చిందీ బ్యూటీ. మరి ఆ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..
ఇలా హ్యాపీగా ఉండండి!
‘ఒక్కసారి నిశితంగా గమనిస్తే- ఒక సత్యం బోధపడుతుంది. అదేంటంటే- సంతోషంగా ఉండడం చాలా సింపుల్. మన జీవితంలోని చాలా చిన్న చిన్న విషయాల్లోనే మనకు అపరిమితమైన సంతోషం లభిస్తుంది.
మనకు నచ్చిన వారితో కాసేపు సరదాగా గడపడం.. పాత స్నేహితులను కలవడం.. చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకోవడం.. కొద్దిసేపు ఎండ తగిలేలా అలా కూర్చోవడం, మనసుకు నచ్చిన ఆహారం తీసుకోవడం.. క్లోజ్ ఫ్రెండ్ తో కలిసి కాసేపు ఆడుకోవడం... మన శరీరాన్ని, మనసుని సంరక్షించుకోవడానికి మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోవడం... ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనులను పూర్తి చేయడం.. లేదా కాసేపు అలా నడుస్తూ ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించడం.. ఇలా ఏదైనా సరే.. మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు వెంటనే - హ్యాపీ హార్మోన్లు విడుదలైపోతాయి.. అందుకే- ఎంత బిజీగా ఉన్న సరే- మీ మనసుకు నచ్చిన పనులు చేసేయండి.. అపరిమితమైన సంతోషాన్ని సొంతం చేసుకోండి..
ఇంతకీ మీకు బాగా సంతోషం కలిగించే పనేంటో నాతో పంచుకుంటారు కదూ..’ అంటూ సంతోషం సీక్రెట్ చెప్పేసింది ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ!
అంతేకాదు.. దీనితో పాటు సంతోషానికి కారణమయ్యే కొన్ని రసాయనాలు, వాటి ప్రత్యేకత, అవి ఏ సమయంలో విడుదలవుతాయి? వంటి విషయాలను తెలిపే ఓ ఫొటోని కూడా పోస్ట్ చేసింది. మరి అవి కూడా ఓసారి చూద్దాం రండి..

డోపమైన్: (రివార్డు కెమికల్) ఎప్పుడు విడుదలవుతుంది? ఏదైనా పనిని పూర్తి చేసినప్పుడు స్వీయ సంరక్షణకు సంబంధించిన పనులు చేసినప్పుడు (శారీరక లేదా మానసిక సంరక్షణకు అవసరమైనవి) నచ్చిన ఆహారం తీసుకున్నప్పుడు చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకున్నప్పుడు
 ఆక్సిటోసిన్ (లవ్ హార్మోన్) ఎప్పుడు విడుదలవుతుంది? చిన్నపిల్లలు, పెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు; ఆత్మీయులను, కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్నప్పుడు; ఆప్యాయంగా చేతులు పట్టుకున్నప్పుడు; ఇతరులను ప్రశంసించినప్పుడు
 సెరటోనిన్ (మూడ్‌ని నియంత్రణలో ఉంచుతుంది) ఎప్పుడు విడుదలవుతుంది? ధ్యానం, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి చేసినప్పుడు అంతేకాదు.. సూర్యరశ్మిలో ఉన్నా, పచ్చని ప్రకృతిలో నడిచినా, అరటి పండ్లు తిన్నా ఈ రసాయనం విడుదలవుతుంది.
 ఎండార్ఫిన్: (నొప్పులను తగ్గిస్తుంది) ఎప్పుడు విడుదలవుతుంది? కామెడీ వీడియోలు చూసినప్పుడు, బాగా నవ్వినప్పుడు; ఎస్సెన్షియల్ నూనెలు వాడినప్పుడు వ్యాయామం చేసినప్పుడు డార్క్ చాక్లెట్ తిన్నప్పుడు
|
మొత్తంమీద ఇలా – ‘మనం చేసే చిన్న చిన్న పనులతోనే ఎంతో సంతోషంగా ఉండచ్చు. కాబట్టి వీటిలో మీకు నచ్చిన వాటిని చేస్తూ సంతోషంగా ఉండండి’ అని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. మరి మనమూ పాటించేద్దామా?
బీ హ్యాపీ ఫరెవర్!