ఓవైపు దీపావళి-క్రిస్మస్ పండగలు.. మరోవైపు పెళ్లిళ్ల హడావిడి.. ఇంకోవైపు చలికాలం మొదలు.. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంటుంది. పండగలు, శుభకార్యాల కోసం ఒకరింటికి మరొకరు వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. కరోనా కారణంగా వేడుకల సందడి తీరు మారింది. అయినప్పటికీ పెళ్లి, ఇతర శుభకార్యాల్లో కొంతమందైనా అతిథుల్ని పిలవడం, లేదంటే మనమే మన దగ్గరి బంధువుల పార్టీలు, వేడుకలకు హాజరవడం.. వంటివి చేస్తున్నాం. అది కూడా కనీస జాగ్రత్తలు పాటిస్తూనే! కానీ ఇలాంటి చిన్న చిన్న గుంపులే కరోనా వైరస్ విస్తరణకు కారణమయ్యే అవకాశం ఉందంటోంది వ్యాధి నివారణ, నియంత్రణ మండలి (సీడీసీ). పైగా చలికాలం వైరస్‌కు అనువైన కాలం కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తద్వారా అటు వేడుకలను ఎంజాయ్ చేస్తూనే, ఇటు కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరైతే ఆలస్యమెందుకు.. కరోనా వేళ వేడుకలకు/పార్టీలకు హాజరవ్వాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..
పండగలైనా, పెళ్లి వేడుకలైనా, ఇతర ప్రత్యేక సందర్భాలైనా, ఆఫీస్ మీటింగ్స్ అయినా.. ఇలాంటి విభిన్న అకేషన్స్‌లో కొంతలో కొంతమందైనా హాజరవడం సహజం. అది కూడా కరోనా బారిన పడకుండా కనీస జాగ్రత్తలు పాటిస్తూనే ఇలాంటి చిన్న చిన్న గెట్-టు-గెదర్ చేసుకుంటున్నారు చాలామంది. అయితే చలికాలంలో వైరస్ విస్తరణ మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నందు వల్ల ఇలాంటి వేడుకల సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అత్యవసరం!

ఆరుబయటే మంచిదట!
పుట్టిన రోజు, నిశ్చితార్థం, హల్దీ, మెహెందీ.. వంటి చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లు, పండగ వేడుకలు.. వంటివన్నీ ఇంట్లో చేసుకోవడం మనకు తెలిసిందే! ఈ క్రమంలో కొంతమంది అతిథుల్ని కూడా ఆహ్వానిస్తుంటాం. అయితే ఎంత తక్కువ మంది ఈ వేడుకలకు హాజరైనా సరే.. సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు వేడుక నిర్వహించే గదిలో గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా చూసుకోవాలి. ఒకవేళ అలాంటి సౌకర్యాలు మీ ఇంట్లో లేకపోతే.. మీ ఇంటి డాబాపై కూడా పార్టీకి ఏర్పాట్లు చేసుకోవచ్చు. తద్వారా చుట్టూ వాతావరణం ఓపెన్‌గా ఉంటుంది కాబట్టి.. ఇటు కుటుంబ సభ్యులు, అటు అతిథులు మాస్కులు పెట్టుకొని, సామాజిక దూరం పాటిస్తే వైరస్ ముప్పును, విస్తరించే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే!
పార్టీ కోసం ఏర్పాటు చేసిన వేదికను లేదంటే ఆ ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అలాగే అక్కడక్కడా అతిథుల కోసం హ్యాండ్-ఫ్రీ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఇక అందరూ మాస్కులు ధరించడం/వీలైతే అతిథుల కోసం ప్రత్యేకంగా మాస్కులు అందుబాటులో ఉంచడంతో పాటు, దూరం దూరంగా కూర్చోవడం, ఫొటోలు తీయించుకోవడానికి కూడా గుంపులు గుంపులుగా కాకుండా ఒకరిద్దరు చొప్పున వెళ్లడం.. వంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే భోజనం చేసే సమయంలో కూడా అందరూ ఒక చోట చేరి పిచ్చా పాటీగా మాట్లాడుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆ సమయంలో మాస్క్ తొలగిస్తాం కాబట్టి వైరస్ విస్తృతికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే బంతిలోనే దూరం దూరంగా కూర్చొని తినాలి.

వీరి విషయంలో జాగ్రత్త!
ఇతర అనారోగ్యాలున్న వారు, గర్భిణులు, చిన్నారులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్లకు వైరస్ ముప్పు అధికంగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారు పార్టీలు/వేడుకలకు హాజరుకాకుండా ఇంట్లోనే ఉండడం మంచిది. ఒకవేళ మరీ దగ్గరి బంధువులు, పిలిస్తే వెళ్లకపోతే బాగుండదు అనుకుంటే మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, వేడుకలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారికి దూరంగా ఉండడం.. వంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం.. వంటి అనారోగ్యాలతో బాధపడుతున్నట్లయితే వారు నిర్మొహమాటంగా ఇంటికే పరిమితమవ్వాలి. అలాగే ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న వారు కూడా ‘మాకు ఎలాగూ నెగెటివ్ వచ్చింది కదా..!’ అన్న నిర్లక్ష్యంతో గుంపులోకి వెళ్తే మరోసారి ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఆహారం ఇలా వడ్డించండి!
పండగలైనా, వేడుకలైనా అతిథుల కోసం విభిన్న వంటకాలు, పిండి వంటలు చేయడం.. వాటిని ఎంతో ప్రేమగా కొసరి కొసరి వారికి వడ్డించడంలోనే మనకు అసలైన సంతృప్తి ఉంటుంది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించాలి కాబట్టి అలా వడ్డించే అవకాశం ఉండచ్చు.. ఉండకపోవచ్చు! కాబట్టి అతిథుల కోసం మీరు వండిన వంటకాలన్నీ ముందుగానే ఆకర్షణీయంగా ప్యాక్ చేసి ఉంచచ్చు.. భోజనం సమయానికి వాటిని వారు కూర్చున్న టేబుల్‌పై పెట్టేస్తే సరిపోతుంది! అయితే కొంతమంది నిశ్చితార్థం, హల్దీ, మెహెందీ, పెళ్లి కూతురిని చేయడం.. వంటి చిన్న చిన్న వేడుకల సమయంలో క్యాటరింగ్ సదుపాయం వినియోగించుకుంటుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బయటి నుంచి భోజనం తెప్పించడం కంటే ఇంట్లోనే పరిశుభ్రమైన వాతావరణంలో తగిన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వంట చేయడం లేదంటే వంట వాళ్లతో చేయించేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. అలాగే వారు వంట చేసే క్రమంలో తప్పనిసరిగా మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే! వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం కొంతమంది శీతల పానీయాలు అందిస్తుంటారు. వాటికి బదులుగా రోగనిరోధక శక్తిని పెంచే పండ్లరసాలు, హెర్బల్ టీలు అందిస్తే అటు వెరైటీగా ఉంటుంది.. ఇటు వారి ఆరోగ్యాన్ని కోరుకున్నట్లూ ఉంటుంది.
డీజేలు అసలే వద్దు!
ఈ మధ్య పార్టీ అయినా, ప్రత్యేక సందర్భమైనా డీజేలు, డ్యాన్సులు, ఆట-పాటలతో సందడి చేయకుండా ముగించే వారు చాలా తక్కువ మందే అని చెప్పచ్చు. అయితే ఈ క్రమంలో మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం అసలే కుదరదు. పైగా ఎక్కువ మంది ఒక చోట చేరతారు.. చేతులు చేతులు కలుపుతూ డ్యాన్స్ చేస్తారు! ఇలా చేయడం వల్ల వైరస్ ముప్పు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో డీజేలు వంటి సంగీత కార్యక్రమాలు లేకుండా వేడుకను సింపుల్‌గా జరుపుకునేలా ప్లాన్ చేసుకోవడమే ఉత్తమం. ఒకవేళ వేడుకలో మ్యూజిక్ ఉండాల్సిందే అనుకుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మంద్రస్థాయిలో మంచి సంగీతం ఏర్పాటు చేయండి. ఫలితంగా అటు మీకు, ఇటు అతిథులకు వినసొంపుగా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
చూశారుగా.. కరోనా సమయంలో ఇలాంటి వేడుకలకు హాజరయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో! అయితే వేడుకకు వెళ్లొచ్చాక కూడా మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం, ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం వల్ల తక్షణమే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.