చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే బొమ్మల్లో చిన్న కిచెన్ సెట్‌ను మనం చూసే ఉంటాం. ఈ సెట్లో స్టౌవ్, గిన్నెలు, గరిటెలు, ప్లేట్లు.. మొదలైన వంట సామగ్రి అంతా పిల్లలు ఆడుకునేందుకు వీలుగా చాలా చిన్నగా ఉంటాయి. వాటిని ఉపయోగిస్తూ పిల్లలు నిజంగానే వంట చేసినట్లుగా ఊహించుకొని సరదా పడుతుంటారు. ఒకవేళ అలాంటి చిట్టి చిట్టి వంట సామాన్లను ఉపయోగిస్తూ నిజంగానే వంట చేస్తే ఎలా ఉంటుంది..? వినడానికి బాగున్నా.. అలా చేయడం అసాధ్యం అనుకుంటున్నారు కదూ..! కానీ, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది తమిళనాడుకు చెందిన ఓ జంట. ఇందుకోసం వీళ్లు ఓ చిట్టి కిచెన్ సెటప్‌ని రూపొందించి అందులో రకరకాల వంటలు తయారు చేస్తున్నారు. అంతేకాదు, యూట్యూబ్‌లో ‘ది టైనీ ఫుడ్స్’ పేరుతో ఓ ఛానల్‌ను ప్రారంభించి తమ కుకింగ్ వీడియోలను అందులో అప్లోడ్ చేస్తుండడం విశేషం. ఈ క్రమంలో మన దేశంలో తొలి మినియేచర్ కుకింగ్ ఛానల్‌గా గుర్తింపు సంపాదించుకుంది ‘ది టైనీ ఫుడ్స్’. మరి వీళ్లకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది..? వీళ్లు ఇప్పటివరకు తయారు చేసిన రెసిపీలేంటి..?.. మొదలైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అలా మొదలైంది..!
తమిళనాడుకు చెందిన రామ్‌కుమార్, వలర్మతి దంపతులు పెళ్లి తర్వాత తనుపూడి అనే గ్రామంలో స్థిరపడ్డారు. రామ్ తమ గ్రామానికి దగ్గర్లో ఉన్న తిరువన్నమలైలో వ్యాపారం చేస్తుంటే.. వలర్మతి ధర్మపురి గ్రామంలో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే వలర్మతికి ఖాళీ సమయంలో యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోలు చూడడం అలవాటు. ఈ క్రమంలో ఒకరోజు తను జపాన్‌కు చెందిన ఓ మినియేచర్ కుకింగ్ ఛానల్ వీడియోలను చూసింది. ఇందులో వాళ్లు చిట్టి కిచెన్ సెట్‌తో వంటలు చేస్తుండడం చూసి తనకూ ఓ ఆలోచన వచ్చింది. ఇలాంటి వీడియోలు నేనెందుకు ప్రయత్నించకూడదని..! తన మనసులోని ఈ ఆలోచనను భర్త రామ్‌తో పంచుకుంది. రామ్‌కు కూడా తన ఐడియా నచ్చడంతో ఓ మినీయేచర్ కుకింగ్ ఛానల్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుందీ జంట.
పల్లె సంస్కృతి ఉట్టిపడేలా..
తమ కుకింగ్ ఛానల్ ద్వారా వీళ్లు ప్రత్యేకంగా భారతీయ వంటలు.. అందులోనూ దక్షిణ భారతదేశపు వంటలనే ఎక్కువగా చేసి చూపిస్తుంటారు. అంతేకాదు, తమ కిచెన్ సెటప్ కూడా మన పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా పంట పొలాల్లో, పూరి గుడిసెల్లోనే ఉంటుంది. తాము వంట చేసే ఇల్లు, వాడే వంట సామగ్రి.. మొదలైనవన్నీ కూడా ఓ సాధారణ రైతు ఇంటిని తలపిస్తాయి. ఇందుకోసం వీళ్లు ప్రత్యేకంగా కార్డ్బోర్డ్, మట్టితో ఓ చిన్న ఇంటిని రూపొందించారు. ఇంటి చుట్టూ నీటి పంపు, గొర్రెలు, పాత సైకిల్, ఆవు, కోడి.. మొదలైనవన్నీ చిన్న చిన్న ఆకృతుల్లో రూపొందించి అందంగా అమర్చారు. అంతేకాదు, వీళ్లు వంట చేయడానికి ఉపయోగించే వంట పాత్రలు సైతం మట్టివే కావడం విశేషం. ఇలా రామ్, వలర్మతి జంట తమ మినియేచర్ కిచెన్ ద్వారా రుచికరమైన పిండి వంటలు, వెజ్ & నాన్-వెజ్ రెసిపీలతో పాటు.. హైదరాబాదీ దమ్ బిర్యానీ, చికెన్ బర్గర్, పానీ పూరీ, నూడుల్స్, ఫ్రైడ్‌రైస్, ఐస్‌క్రీమ్స్.. ఇలా మనకు ఊహకందని రెసిపీలెన్నో తయారు చేస్తుండడం విశేషం.

వంట చేయడం తన బాధ్యత.. షూట్ చేయడం నా బాధ్యత..!
తమ ఛానల్ గురించి రామ్ స్పందిస్తూ ‘నా భార్య వంటలు బాగా చేస్తుంది. మొదట్లో తన కుకింగ్ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టాలని అనుకునేవాడిని. అదే సమయంలో మాకు జపాన్‌కు చెందిన ఓ మినియేచర్ కుకింగ్ ఛానల్ గురించి తెలిసింది. అలాంటి కిచెన్‌నే మన ప్రాంతీయతకు దగ్గరగా రూపొందించి కుకింగ్ వీడియోలు రూపొందించాలని మేము నిర్ణయించుకున్నాం. అలా 2017, నవంబర్‌లో ‘ది టైనీ ఫుడ్స్’ పేరుతో మా యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాం. మా వీడియోల్లో వంటలే కాదు చుట్టూ కనిపించే వస్తువులను చూసినప్పుడు కూడా వీక్షకుడికి ఎంతో కొంత కొత్తదనం అనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక అసలు విషయానికొస్తే వంటలు చేయడం నా భార్య బాధ్యతైతే.. వాటికి అవసరమైన సామగ్రిని సమకూర్చడం, వీడియో షూట్ చేసి, దానిని ఎడిట్ చేయడం నా బాధ్యత’ అని పేర్కొన్నాడు.
వారాంతాల్లో విడియోలు..!
తమ కుకింగ్ వీడియోల గురించి వలర్మతి చెబుతూ ‘వృత్తిరీత్యా మేమిద్దరం వారమంతా మా పనులతో బిజీగా ఉంటాం. అందుకే వారాంతాల్లో కుకింగ్ వీడియోలు రూపొందించాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ప్రతి శనివారం మా ఛానల్లో ఓ వీడియో అప్లోడ్ అయ్యేలా మేము ప్లాన్ చేసుకున్నాం. మా వీడియోలకు వీక్షకుల నుంచి ప్రశంసలు రావడం మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. కొన్ని రెసిపీలను ప్రయత్నించమని అప్పుడప్పుడు మా ఫాలోవర్లు కామెంట్లు, మెసేజెస్ ద్వారా సూచించడం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటుంది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.

ప్రస్తుతం ‘ది టైనీ ఫుడ్స్’ ఛానల్‌కు యూట్యూబ్‌లో 7,41,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా వీళ్లు ఇప్పటివరకు 131 వీడియోలు రూపొందించారు. సాధారణంగా మిగతా కుకింగ్ వీడియోలలో ఉన్నట్లు ‘ది టైనీ ఫుడ్స్’ ఛానల్ వీడియోల్లో వండే విధానాన్ని వివరిస్తోన్న చెఫ్ మాటలు మనకు వినిపించవు. దీనికి బదులు వీడియో కింద వంటకు కావాల్సిన పదార్థాల్ని, వండే విధానాన్ని ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ రూపంలో వివరిస్తుంటారు. అంతేకాదు, ప్రతి వీడియో మొదట్లో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటున్నట్లుగా రెండు బొమ్మల ద్వారా చెప్పిస్తూ వీడియోను ప్రారంభించడం ఈ వీడియోలకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంటుంది.
Photos: Screengrab