సంతాన లేమి, తరచూ గర్భస్రావాలు, థైరాయిడ్, పీసీఓఎస్, హార్మోన్ల అసమతుల్యత.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే సమస్యలకు లెక్క లేదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ప్రత్యుత్పత్తి సమస్యలతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే వీటన్నింటికీ మూలకారణం రక్తహీనతే అంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఇలాంటి అనారోగ్యాలు మహిళల్ని అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికంగానూ కుంగదీస్తున్నాయంటున్నారామె. మరి, దీనికి పరిష్కారం లేదా అంటే.. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ సిద్ధాంతాన్ని పాటిస్తూ పూర్వకాలపు పాకశాస్త్ర పద్ధతుల్ని అలవర్చుకోవడమే దీనికి అత్యుత్తమ మార్గమని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రక్తహీనతను ఎలా తగ్గించుకోవాలో వివరిస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారామె.
మారుతున్న కాలాన్ని బట్టి ప్రతి విషయంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వంట చేసే విధానంలోనూ ఎన్నెన్నో మార్పులొచ్చాయి. మట్టి పాత్రలు, ఇనుముతో తయారుచేసిన పాత్రలు కొన్నాళ్లు కనుమరుగైనా.. మళ్లీ ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందుకు కారణం వాటిలో దాగున్న ఆరోగ్య రహస్యాలే! ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ప్రస్తుతం రక్తహీనత మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని, దీన్ని ఎదుర్కోవాలంటే ఇనుప పాత్రల్లో వండుకోవడమే అత్యుత్తమమైన మార్గమని చెబుతున్నారామె. ఈ క్రమంలోనే ఐరన్ పాత్రల ప్రాముఖ్యాన్ని చెబుతూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు రుజుత.
ఈ సమస్యలన్నీ అందుకే!
‘శారీరక అలసట, నీరసం, మానసిక కుంగుబాటు.. ఇలాంటి లక్షణాలు ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపిస్తున్నాయి. ఇక చిన్నారుల్లో పదేళ్లు నిండకముందే జుట్టు నెరిసిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు సంతాన లేమి, తరచూ గర్భస్రావాలు, థైరాయిడ్, పీసీఓఎస్, హార్మోన్ల సమస్యలు.. వంటివన్నీ మహిళలకు పెనుశాపాలుగా మారుతున్నాయి. మరి, ఇవన్నీ ఎందుకు తలెత్తుతున్నాయో తెలుసా? వీటన్నింటికీ మూలకారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి సమస్యలన్నింటి వెనుకా ఒకే ఒక్క కారణం ఉంది.. అదేంటంటే.. సూక్ష్మపోషకాల లోపం.. అందులోనూ శరీరానికి తగినంత ఐరన్ లభించక రక్తహీనత తలెత్తడం వల్లే ఈ అనారోగ్యాలన్నీ చుట్టుముడుతున్నాయి. మన శరీరంలో హెమోగ్లోబిన్ తగినంత ఉంటే ఎంతో యాక్టివ్‌గా ఉంటాం.. బరువు తగ్గడానికైనా, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికైనా రక్తమే ప్రధానం. శరీరంలోని ప్రతి అవయవానికీ ఆక్సిజన్ని సరఫరా చేస్తూ.. శరీరాన్ని-మెదడును సమన్వయ పరచడంలో హెమోగ్లోబిన్ పాత్ర కీలకం. ఇది లోపిస్తే మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

అదొక్కటే పరిష్కారం!
మరి, వీటన్నింటికీ తగిన పరిష్కారం మన వంటింట్లోనే ఉంది. అదేంటంటే.. వంట చేసే క్రమంలో ఇనుముతో తయారుచేసిన పాత్రల్ని (కళాయి, తవా, గరిటెలు) ఉపయోగించడమే! ఇలా ఐరన్ పాత్రల్లో తయారుచేసే పదార్థాలతో పాటు మనం తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే వాటికి ప్రాధాన్యమిస్తే శారీరకంగా, మానసికంగా, సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. మరీ ముఖ్యంగా పొట్ట సంబంధిత సమస్యలు, స్లీప్ అప్నియా (నిద్ర పోతున్నప్పుడు శ్వాస ప్రక్రియలో సమస్యలేర్పడడం), ఐవీఎఫ్-కీమోథెరపీ చికిత్సలు తీసుకుంటున్న వారికి ఈ పాకశాస్త్ర పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రక్తహీనత ఉన్న వారిలో తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది.. తద్వారా స్వీట్స్ ఎక్కువగా తిని బరువు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. అలాంటప్పుడు ఇనుప పాత్రల్లో వండిన వంటకాలు తినడం వల్ల శరీరంలో హెమోగ్లోబిన్ పెరిగి స్వీట్ క్రేవింగ్స్ తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఇనుప పాత్రల్లో వంట చేసుకోవడం అలవాటు చేసుకోండి.. ఐరన్ లోపాన్ని సరిచేసుకోండి.. అయితే ఇక్కడ వంట కోసం ఉపయోగించే ఐరన్ పాత్రలు మరీ పెద్దవి, మరీ చిన్నవి కాకుండా చూసుకోవడం ముఖ్యం. అలాగే ఎక్కువసేపు అధిక మంటపై ఉడికించడం వల్ల అందులోని సూక్ష్మపోషకాలు నశిస్తాయి కాబట్టి.. తక్కువ మంటపై వండుకోవడం ఉత్తమం..’ అంటూ ఇనుప పాత్రల్లో దాగున్న ఆరోగ్య రహస్యాల గురించి చెప్పుకొచ్చారు రుజుత.
ఇనుప పాత్రల్లో ఏమేం వండుకోవచ్చు?

అంతేకాదు.. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు ఐరన్ పాత్రల్లో వంటకు సంబంధించి సందేహాలను అడగ్గా.. వాటిని మరో పోస్ట్‌లో భాగంగా నివృత్తి చేశారామె. అవేంటంటే..! ఐరన్ పాత్రల్లో ఎలాంటి కాయగూరల్ని వండుకోవచ్చు? అన్ని రకాల కాయగూరలను వండుకోవచ్చు. అయితే చింతపండు వంటి పుల్లటి పదార్థాలను మాత్రం వీటిలో కాకుండా ఇత్తడి పాత్రల్లో వండుకోవాలి. ఈ క్రమంలో నిండా మూత పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇనుప పాత్రల్లో వండే క్రమంలో కాయగూరలు త్వరగా మాడిపోతున్నాయి. అలా కాకూడదంటే ఏం చేయాలి? వంట పూర్తయ్యాక కూరను ఇనుప పాత్రల్లో అలాగే ఉంచకుండా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది.
 ఇనుప పాత్రల్ని ఎలా మెయింటెయిన్ చేయాలి? వాడకం పూర్తయ్యాక శుభ్రంగా కడిగి, పొడిగా ఆరబెట్టాలి. తడిదనం లేని, గాలి తగలని ప్రదేశంలో వాటిని భద్రపరచాల్సి ఉంటుంది. లేదంటే అవి త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా.. భద్రపరిచే ముందు వాటి ఉపరితలంపై కాస్త నూనె రాసి పేపర్లో లేదంటే మక్మల్ వస్త్రంలో చుడితే సరిపోతుంది. క్యాస్ట్ ఐరన్ పాత్రల్లో వండుకోవచ్చా? నిరభ్యంతరంగా వండుకోవచ్చు.
|