'రాళ్లు తిని అరిగించుకోవాల్సిన వయసులో ఈ అరుగుదల సమస్యలేంటర్రా..?' - అంటూ పెద్దవాళ్లు వాపోతున్నారు.. కానీ ఏం చేయగలం..? చదువులూ, ఉద్యోగాల కోసం పరుగులు తీసే హడావుడిలో బయట దొరికే ఆహారం తినక తప్పదు. అలాంటప్పుడు దానివల్ల కలిగే జీర్ణ సమస్యలూ తప్పవు కదా మరి..! ఇంట్లో తయారు చేసే ఆహారం కూడా వందశాతం ఆరోగ్యకరమైనదే అని చెప్పలేం. విషపూరితమైన కూరగాయలు, కల్తీ సరుకులు మన ఆహారాన్ని కలుషితం చేస్తున్నాయి. నగరాలలో ఈ సమస్య మరీ ఎక్కువ. పెరిగే హాస్పిటళ్ల సంఖ్యకీ, తరిగి పోతున్న మన ఆరోగ్యానికీ ఇదే కారణం. అలాగని తినకుండా ఉండలేం కదా.. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటనేగా మీ ప్రశ్న..? అయితే జీర్ణ సమస్యలని నివారించే ఈ వంటింటి చిట్కాలను పాటించండి.

అజీర్తికి జీలకర్ర దివ్యౌషధం..!
* కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు లేదా ఎసిడిటీ బాధిస్తున్నప్పుడు కాస్త జీలకర్రను నమలడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
* టేబుల్‌స్పూను జీలకర్రను శుభ్రంగా కడిగి, 150మి.లీ. నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరకడుపున ఆ నీటిని తాగి, జీలకర్రను తినాలి. క్రమం తప్పకుండా నెల రోజులపాటు ఇలా చేయడం వల్ల అజీర్తి, మలబద్ధకం పూర్తిగా నయమవుతాయి.
* రెండు టీస్పూన్ల జీలకర్రను పావులీటరు నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి వచ్చాక, చల్లార్చాలి. చల్లారిన జీలకర్ర కషాయాన్ని వడగట్టి, పరకడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు మాయమవుతాయి. అంతేకాకుండా వూబకాయం కూడా క్రమంగా తగ్గుతుంది.
* జీలకర్రకు బదులుగా వామును ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది. అయితే వామును తక్కువ మోతాదులో వాడాలని గుర్తుంచుకోండి. ఒక స్పూను జీలకర్రకు బదులుగా పావుస్పూను వామును మాత్రమే వాడాలి.

పుదీనా, తులసి ఎంతో మేలు చేస్తాయి.!
* పుదీనా ఆకులు, తులసి ఆకులు శుభ్రంగా కడిగి, పావు లీటరు నీటిలో వేసి మరిగించాలి. నీరు సగానికి ఇగిరి పోయిన తర్వాత స్టౌ మీద నుంచి దించాలి. ఆ నీరు గోరు వెచ్చగా అయిన తర్వాత వడగట్టకుండా ఆకులతో సహా తీసుకోవాలి.
క్రమం తప్పకుండా దీన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తీరడమే కాకుండా, శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.
ఇంగువ ..
* ఉదయాన్నే పరకడుపున పావుస్పూను ఇంగువని గ్లాసెడు నీటిలో కలుపుకుని తాగితే మలబద్ధకం నయమవుతుంది.

అల్లం రసం..
అజీర్తికి, పైత్యానికి అల్లం రసం వాడటం మన పెద్దవాళ్లు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న పరిష్కారం.
* అల్లం ముక్కను తురిమి దానికి అర గ్లాసు నీటిని చేర్చాలి. నీరు సగానికి వచ్చే వరకూ మరిగించాలి. కాస్త చల్లారిన తర్వాత వడగట్టి ఈ కషాయాన్ని తాగితే అజీర్తి తగ్గుతుంది.
పై చిట్కాలను పాటించినా ఉపశమనం లభించక, జీర్ణ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టరు సలహా పాటించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.!