కీర్తన ఇటీవలే కరోనా నుంచి కోలుకుంది. అయినా పదార్థాల రుచి, వాసన తెలియట్లేదని, ఏమీ తినాలనిపించట్లేదని వాపోతోంది.
విజితది కూడా ఇదే సమస్య. కరోనా బారిన పడిన ఆమెకు రుచి, వాసన కోల్పోవడం తప్ప మరే లక్షణమూ కనిపించలేదు. ఇక ఈ వైరస్ నుంచి బయటపడినా తన నోటికి ఏదీ రుచించట్లేదని బాధపడుతోంది.
మాయదారి కరోనా మహమ్మారి నుంచి ఎలాగోలా బయటపడితే చాలనుకుంటున్నారు చాలామంది. అయితే తీరా కోలుకున్న తర్వాత కూడా కొంతమందిని పలు అనారోగ్యాలు వేధిస్తున్నాయి. దగ్గు, జలుబు, నీరసం ఇంకా వదలకపోవడంతో పాటు కరోనా వల్ల కోల్పోయిన రుచి, వాసనను కూడా తిరిగి పొందడానికి చాలా సమయం పడుతుందని కొందరు బాధితులు తమ అనుభవాలను పంచుకోవడం మనం వింటూనే ఉన్నాం. అంతేకాదు.. కరోనా నుంచి బయటపడిన వారిలో సుమారు 98 శాతం మందిలో ఈ లక్షణాలు దూరమవడానికి 28 రోజుల దాకా సమయం పడుతుందని ఓ అధ్యయనంలో కూడా తేలింది. మరైతే, కరోనా నెగెటివ్ వచ్చినా రుచి, వాసన తిరిగి పొందాలంటే వారాలకు వారాలే వేచి చూడాలా? అంతకంటే వేరే మార్గం లేదా? అంటే ఎందుకు లేదు.. ఉందంటున్నారు నిపుణులు. కరోనా వల్ల కోల్పోయిన వాసన, రుచిని కొన్ని రకాల సహజసిద్ధమైన పదార్థాలతో త్వరగానే తిరిగి పొందే అవకాశం ఉందంటున్నారు. మరి, ఏంటా పదార్థాలు? తెలుసుకుందాం రండి..
కరోనా నెగెటివ్ వచ్చినా కొన్ని లక్షణాలు మాత్రం చాలామందిని పట్టిపీడిస్తున్నాయి. దగ్గు, జలుబు, కొంతమందిలో జ్వరం.. ఇలా వీటితో పాటు కోల్పోయిన రుచి, వాసన కూడా వెంటనే తిరిగి పొందలేకపోతున్నారు. దీంతో ఆహారం రుచించక ఆకలి మందగించడం, సరిగ్గా తినకపోవడం వల్ల అలసట, నీరసం.. వంటివి వారిని మరింతగా కుంగదీస్తున్నాయి. అందుకే అలాంటివారు ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో తక్కువ సమయంలోనే వాసన, రుచిని తిరిగి పొందే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.

వెల్లుల్లితో ఉపశమనం!
వెల్లుల్లి తినడానికే కాదు.. దాని వాసన చూడడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. కానీ నిజానికి ఇదే వాసన ముక్కుదిబ్బడను దూరం చేయడంతో పాటు ముక్కు రంధ్రాల్లో ఏదైనా వాపు ఉంటే తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకు దీనిలోని యాంటీ వైరల్ గుణాలే కారణమట! ఇలా కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని దాని వాసన చూడడం వల్ల కొవిడ్ వల్ల కోల్పోయిన రుచి, వాసన కూడా సత్వరమే తిరిగి పొందచ్చట!
ఒకవేళ ఇలా చేయడం ఇష్టం లేని వారు.. వెల్లుల్లితో చేసిన రసాన్ని కూడా తాగచ్చు. అందుకోసం కప్పు నీటిలో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి బాగా మరిగించుకోవాలి. ఆపై ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకున్నా చక్కటి ఉపశమనం కలుగుతుందంటున్నారు నిపుణులు. ఇక ఇందులో కలిపిన నిమ్మరసంలో జలుబును తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి జలుబు సమస్య ఉన్నా తగ్గుముఖం పడుతుందన్నమాట!

వాముతో ఇలా చేయండి!
దగ్గు, జలుబు.. వంటి లక్షణాలున్నప్పుడు వాము తీసుకోవడం మనకు తెలిసిందే! యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉండే వాము జలుబు, దగ్గును కలుగజేసే కారకాలతో సమర్థంగా పోరాడి వాటి బారి నుంచి మనల్ని రక్షిస్తుంది. అంతేకాదు.. ఇది కరోనా కారణంగా కోల్పోయిన రుచి, వాసనను తిరిగి పొందడంలోనూ సహకరిస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక న్యాప్కిన్ లేదా శుభ్రమైన క్లాత్లో టీస్పూన్ వామును మూటకట్టి దాన్ని రోజూ వాసన చూడాలి. ఇలా రోజులో కొన్ని సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందట!

ఆవిరి పట్టాలి!
ఆముదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ముక్కు దిబ్బడ, సైనసైటిస్.. వంటి సమస్యల్ని దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయి. అంతేకాదు.. కొవిడ్ కారణంగా కోల్పోయిన రుచి, వాసన పసిగట్టే సామర్థ్యాలను తిరిగి పొందేలా చేస్తుందట ఈ ఆముదం నూనె. అయితే ఇందుకోసం మనం చేయాల్సిందల్లా.. ఈ నూనెను కాస్త గోరువెచ్చగా చేసి.. రెండు ముక్కు రంధ్రాల్లో రెండేసి చుక్కలు వేసుకోవాలి.. ఆపై గట్టిగా గాలి పీల్చి, వదులుతూ వ్యాయామం చేయాలి. అంతేకాదు.. మనం ఆవిరి పట్టే నీళ్లలో కొన్ని చుక్కల ఆముదం నూనె వేసుకున్నా మంచి ఫలితం ఉంటుందట!

ఇది కూడా అరోమాథెరపీ లాంటిదే!
అలసిపోయిన మనసును, నీరసపడిపోయిన శరీరాన్ని తిరిగి ఉత్తేజపరిచే శక్తి అరోమాథెరపీకి ఉందనడంలో సందేహం లేదు. అందుకే కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు కొన్ని అత్యవసర నూనెలతో మసాజ్ చేయించుకొని తిరిగి యాక్టివ్గా మారిపోతాం. అయితే ఈ నూనెలు కొవిడ్ వల్ల కోల్పోయిన రుచి, వాసనని తిరిగి పొందడంలో సహకరిస్తాయట! అదెలాగంటే.. రోజ్, లవంగం, నిమ్మ, యూకలిప్టస్.. వంటి అత్యవసర నూనెల్ని రోజుకు మూడు నాలుగు సార్లు వాసన చూడడం వల్ల రుచి, వాసనను పసిగట్టే సామర్థ్యం క్రమంగా పెరుగుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మనమెంతో ఇష్టపడే కొన్ని సువాసనలు అంటే సబ్బులు, షాంపూలు, మాయిశ్చరైజర్స్.. వంటివి కూడా పదే పదే వాసన చూడచ్చు. తద్వారా కూడా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇలా ఎప్పుడెప్పుడు అవుతుందంటే..!
కరోనా అనే కాదు.. ఇతర అనారోగ్యాలు కూడా మనలో రుచి, వాసన పసిగట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సాధారణంగా అప్పుడప్పుడూ జలుబు, దగ్గు, జ్వరం.. వంటి సమస్యల బారిన పడ్డప్పుడు నోరంతా చేదుగా, రుచీపచీ లేకుండా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఇలా ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే..
* జలుబు, దగ్గు, ఫ్లూ, సైనస్ ఇన్ఫెక్షన్లు.. వంటి సమస్యల బారిన పడ్డప్పుడు
* తలకేదైనా బలమైన గాయం తగిలినప్పుడు
* బీపీ, యాంటీబయోటిక్స్.. వంటి మాత్రలు వాడుతున్నప్పుడు
* హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల సమస్యలున్నప్పుడు
* గాఢత ఎక్కువగా ఉండే రసాయనాలను పీల్చుకున్నప్పుడు
* తల, మెడ భాగాల్లో ట్యూమర్స్ ఉన్నప్పుడు
* క్యాన్సర్ ట్రీట్మెంట్ (తల లేదా మెడ భాగాల్లో)లో భాగంగా రేడియేషన్ చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ఇలా వివిధ సందర్భాల్లో మనం రుచి, వాసన చూసే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి సమస్య ఏదైనా సరే.. రుచి, వాసన చూసే సామర్థ్యం కోల్పోతున్నట్లనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి అసలు కారణమేంటో తెలుసుకోవాలి. ఒకవేళ కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా రుచి, వాసన పసిగట్టే సామర్థ్యం తిరిగి పొందలేదంటే పైన చెప్పిన సహజసిద్ధమైన చిట్కాల్ని పాటించచ్చు. అప్పటికీ ఫలితం కనిపించకపోతే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.