మనల్ని నెలనెలా పలకరించిపోయే నెలసరి సరైన సమయానికి వస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అదే ఒక్కోసారి కాస్త ముందుగా రావడం, మరోసారి కాస్త ఆలస్యమవడం, ఇంకోసారి నెలలకు నెలలే రాకుండా ఉండడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తేనే అసలు సమస్యేంటో అర్థం కాక చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇలాంటి అనుభవాలు మనలోనూ చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అయితే గర్భం ధరించినప్పుడు కాకుండా మిగతా సమయాల్లో ఇలా నెలసరి క్రమం తప్పుతోందంటే అందుకు బోలెడన్ని కారణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో నిర్ధారించుకొని ఆదిలోనే పసిగడితే నెలసరి సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఇతర అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ గర్భం ధరించకపోయినా పిరియడ్స్ మిస్సవుతున్నాయంటే/సక్రమంగా రావట్లేదంటే అందుకు అసలు కారణమేంటో మనమూ తెలుసుకుందాం రండి..
పిరియడ్ మిస్సవడం/నెలసరి క్రమం తప్పడం.. ఈ రోజుల్లో మనలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందుకు మనం పాటించే జీవన విధానంలో మనకు తెలిసో, తెలియకో చేసే కొన్ని తప్పిదాలే కారణం అంటున్నారు నిపుణులు. తద్వారా ఇది క్రమంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే మొదట్లోనే నెలసరి సమస్యలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

వ్యాయామం మితిమీరితే..!
ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఈ రోజుల్లో చాలామంది విభిన్న వ్యాయామాలను తమ రోజువారీ ప్రణాళికలో చేర్చుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది తమ లక్ష్యాల్ని త్వరగా చేరుకోవాలన్న ఉద్దేశంతో మరీ ఎక్కువగా కష్టపడిపోతుంటారు. ఇలా వ్యాయామం మితిమీరితే దాని ప్రభావం రుతుచక్రంపై పడుతుందంటున్నారు నిపుణులు. అధిక వ్యాయామం పిట్యూటరీ హార్మోన్లు, థైరాయిడ్ హార్మోన్ల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా వాటిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇవి నేరుగా అండోత్పత్తి, రుతుక్రమంపై దాడి చేస్తాయి. కాబట్టి వర్కవుట్స్ ఎంత సేపు చేయాలి? మీ శరీరానికి ఏ వ్యాయామం సూటవుతుంది? అన్న విషయాల గురించి మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం కాకుండా నిపుణులను అడిగి తెలుసుకోవడం మంచిది.

ఎప్పుడూ అవే ఆలోచనలా?
వ్యక్తిగతంగానో, వృత్తిపరంగానో ఎదురయ్యే సవాళ్లు మన మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనలు ఎదురవడం సహజం. అయితే ఇవి ఒక పరిమిత స్థాయి వరకు ఉంటే పర్లేదు.. కానీ సుదీర్ఘ కాలం పాటు ఇలాంటి ప్రతికూల ఆలోచనలతోనే గడిపితే మాత్రం ఆరోగ్యపరంగా ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మితిమీరిన ఒత్తిడి ప్రభావం రుతుచక్రం పైనా పడుతుందట. అదెలాగంటే.. ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో గొనడోట్రోఫిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది అండోత్పత్తిని అడ్డుకోవడంతో పాటు, నెలసరి సక్రమంగా రాకుండా చేస్తుంది. కాబట్టి ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు నచ్చిన పనులు చేస్తూ దాన్ని దూరం చేసుకోవాలి. ఒకవేళ పరిస్థితి మీ చేయి దాటి పోతే మాత్రం నిపుణులను సంప్రదించడం మంచిది.

పెరిగినా, తగ్గినా సమస్యే!
సాధారణంగా బరువు మరీ ఎక్కువగా, మరీ తక్కువగా ఉన్న మహిళల్లోనే ఇర్రెగ్యులర్ పిరియడ్స్ లేదా నెలసరి మిస్సవడం.. వంటి సమస్యలు తలెత్తడం మనం గమనించచ్చు. అయితే ఇలా మన బరువు కూడా రుతుచక్రంపై ప్రతికూల ప్రభావం చూపుతుందట! సాధారణంగా మన బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 18-25 మధ్యలో ఉండాలి. అదే 25 దాటిందంటే అది అధిక బరువు కిందే లెక్క! ఇలా బీఎంఐ స్థాయులు మరీ ఎక్కువగా ఉన్న వారి శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్థాయులు అదుపు తప్పుతాయి. ఫలితంగా రుతుచక్రంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిజానికి ఈ రెండు హార్మోన్లు మన శరీరంలో నెలసరిని క్రమబద్ధీకరిస్తాయి. అలాంటిది ఇవే క్రమం తప్పితే ఇక నెలసరి సక్రమంగా ఎలా వస్తుంది చెప్పండి.
ఇక బరువు మరీ తక్కువగా ఉన్న వారిలోనూ నెలసరి మిస్సవడం/సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలొస్తాయి. అందుకూ కారణం లేకపోలేదు. బాగా సన్నగా ఉన్న వారిలో పోషకాహార లోపం కూడా ఉండచ్చు. తద్వారా కొవ్వులు, పోషకాలు తగినన్ని శరీరానికి అందక సరైన స్థాయుల్లో హార్మోన్లు విడుదల కావు. దీని ప్రభావం అంతిమంగా రుతుచక్రం పైనే పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే మీ ఎత్తును బట్టి ఎంత బరువుండాలో తెలుసుకొని.. దాని ప్రకారం మీ జీవన విధానంలో మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది.

ఆ మందుల వల్ల కూడా!
మన అనారోగ్యాల్ని బట్టి వాడే మందులు పదే పదే మార్చినప్పుడు దీని ప్రభావం అంతిమంగా నెలసరి పైనే పడుతుందంటున్నారు నిపుణులు. అయితే ఈ మందులు కొంతమందిలో దుష్ప్రభావాల్ని కలిగించడమే దీనికి కారణమట! వీటితో పాటు గర్భ నిరోధక మాత్రలు, గర్భ నిరోధక పద్ధతులు కూడా అప్పుడప్పుడూ పిరియడ్ మిస్సవడానికి కారణమవుతాయి. కాబట్టి ఈ క్రమంలో ఏమాత్రం తేడాగా అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రలు మార్చితే ప్రయోజనముంటుందేమో ప్రయత్నించచ్చు.

ఇవి కూడా!
* థైరాయిడ్ పనితీరు అదుపు తప్పితే హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి నెలసరిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ప్రస్తుతం ప్రభావవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
* నెలసరి మిస్సవడానికి/రుతుచక్రం అదుపు తప్పడానికి కారణమయ్యే అతి ముఖ్యమైన కారణాల్లో పీసీఓఎస్ ఒకటని ఓ పరిశోధనలో తేలింది. దీనివల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత లోపించి నెలసరి అదుపు తప్పడానికి కారణమవుతుంది. అయితే ఇది దీర్ఘకాలిక సమస్య కాబట్టి దీన్నుంచి పూర్తిగా బయటపడడం వీలు కాదు. అందుకే చక్కటి జీవనశైలితో పీసీఓఎస్‌ను అదుపు చేసుకుంటే ఇటు రుతుక్రమం గాడిలో పడుతుంది.. అటు భవిష్యత్తులో సంతాన సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు.

* పాలిచ్చే తల్లుల్లో నెలసరి రాకపోవడం అనేది సహజమే. ఎందుకంటే.. పిట్యూటరీ గ్రంథి ఉత్పత్తి చేసే ప్రొలాక్టిన్ హార్మోన్ ఈ సమయంలో పాల తయారీపై దృష్టి పెడుతుంది. తద్వారా అండోత్పత్తి జరగదు.. నెలసరి కూడా రాదు. అయితే నిరంతరాయంగా పాలిస్తేనే కొన్నాళ్ల పాటు ఇలా నెలసరి ఆగిపోతుంది. అలాకాకుండా అప్పుడప్పుడూ పాలిస్తే తిరిగి నెలసరి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఇర్రెగ్యులర్ పిరియడ్స్/పిరియడ్స్ మిస్సింగ్.. వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే నిపుణుల్ని సంప్రదించడం మంచిది.
* మెనోపాజ్ దశలోకి ప్రవేశించే మహిళల్లోనూ రుతుచక్రం అదుపు తప్పడం మనం సర్వసాధారణంగా గమనించచ్చు. ఈ క్రమంలో నెలసరికి కారణమయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు తగ్గడమే ఇందుకు కారణం! అయితే ఇది సాధారణమే అయినా.. దీనికి తోడు పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, విపరీతమైన వైట్ డిశ్చార్జి, ఒక్కసారిగా బరువు పెరిగిపోవడం.. వంటి అసాధారణ లక్షణాలు కనిపిస్తే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లడం ఉత్తమం.
గర్భం ధరించకపోయినా నెలసరి అదుపు తప్పుతోందంటే దానికి కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకున్నారు కదా! కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తే మీ సమస్యకు ఆదిలోనే చెక్ పెట్టచ్చు.. లేదంటే ఈ సమస్య మరో సమస్యకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదు.