హలో డాక్టర్. నా వయసు 24, మా వారి వయసు 30 ఏళ్లు. మాకు పెళ్లై రెండేళ్లవుతోంది. పిల్లల్లేరు. నాకు పీసీఓఎస్ ఉంది.. మా వారికి Azoospermia ఉంది. డాక్టర్ని సంప్రదిస్తే స్పెర్మ్ డోనర్ దగ్గరికి వెళ్లమన్నారు. కానీ అది నాకు ఇష్టం లేదు. అది తప్ప ఇంకో దారి లేదా? ఒకవేళ వెళ్తే ఎదురయ్యే లాభనష్టాలేంటి? దాని పద్ధతేంటి? దయచేసి చెప్పండి. - ఓ సోదరి
జ: మీకు పీసీఓఎస్ సమస్య ఉంటే అండం విడుదల కావడానికి మందులు వాడాల్సి ఉంటుంది. కానీ మీ వారికి Azoospermia అంటే సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అందులో వీర్య కణాలు అసలే లేవని అర్థం. అయితే దీనికి కారణాలు రెండు రకాలుగా ఉండచ్చు.
మొదటిది - అసలు వీర్య కణాలు తయారు కాకుండా ఉండడం,
రెండోది - వృషణాల్లో తయారవుతున్నా కూడా అవి ప్రయాణం చేసే దారిలో అడ్డంకులు ఉండడం వల్ల అవి బయటికి రాలేకపోవడం. వీటిలో ఏ సమస్య వల్ల మీ వారికి Azoospermia ఉందో తెలుసుకోవాలంటే స్క్రోటల్ అల్ట్రాసౌండ్ స్కాన్, హార్మోన్ పరీక్షలు, టెస్టిక్యులర్ బయాప్సీ.. వంటి పరీక్షలు చేసి చూడాలి.
ఒకవేళ స్పెర్మ్స్ తయారీ వరకు సరిగ్గానే ఉంటే సూటిగా టెస్టిస్లో నుంచే స్పెర్మ్స్ని తీసుకొని వాటిని మీ అండంతో కలిపి ఫలదీకరణం చెందిస్తారు. ఇలా ఐవీఎఫ్ ద్వారా మీరు గర్భం ధరించచ్చు.
ఒకవేళ లోపల తయారు కావడమే జరగ్గపోతే అప్పుడు తప్పనిసరిగా డోనర్ స్పెర్మ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డోనర్ స్పెర్మ్ తీసుకోవాలా? వద్దా? అనేది మీ ఇద్దరి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు గనుక డోనర్ ఐవీఎఫ్కి సరే అంటే మీకు చికిత్స చేసే డాక్టర్ దాని పద్ధతేంటో వివరిస్తారు.