పాలు, పాల సంబంధిత ఉత్పత్తులన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అలాగే పాలతో చేసిన పనీర్ కూడా ఈ కోవకు చెందిందే. పనీర్ టిక్కా మసాలా, పనీర్ ఖీర్, పనీర్ బర్ఫీ.. ఇలా పనీర్‌తో నోరూరించే కూరలు, స్వీట్లు చాలానే తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా ఎక్కడ చూసినా మెనూలో పనీర్ది ఓ ప్రత్యేక స్థానం. ఎందుకంటే దీనిలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉండడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో పనీర్ తయారీ విధానం, దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఓ సారి చూద్దామా..!
కావాల్సిన పదార్థాలు
* పాలు - లీటరు
* నిమ్మరసం - అర చెంచా (దీనికి బదులుగా కాస్త సిట్రికామ్లం లేదా ఒకటిన్నర చెంచా వెనిగర్‌ని కూడా ఉపయోగించచ్చు.)
తయారీ విధానం
గిన్నెలో పాలు పోసి మరిగించాలి. పాలు మరిగేటప్పుడే నిమ్మరసం వేసి కలియబెట్టాలి (ఒకవేళ మీరు సిట్రికామ్లం కలపానుకుంటే మాత్రం.. నేరుగా కాకుండా రెండు చెంచాల నీటిలో అరచెంచా సిట్రికామ్లం వేసి బాగా కలిపి తర్వాత పాలలో కలపాలి.). ఈ క్రమంలో పాలు విరిగిపోయి ముద్దలుగా తయారవుతాయి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఓ ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక కాటన్ లేదా పలుచటి వస్త్రంలో పోసి గట్టిగా మూటకట్టినట్లు కట్టేయాలి. ఇలా చేయడం వల్ల నీళ్లు చాలావరకు బయటకు పోతాయి. తర్వాత వస్త్రంలోని ఘనపదార్థాన్ని చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక పలుచటి వస్త్రంలో పెట్టి దానిమీద నుంచి మరో పలుచటి గుడ్డ కప్పి దానిపై ఒక బరువైన వస్తువు ఉంచాలి. ఇలా చేయడం వల్ల అందులో ఇంకా ఏమైనా నీళ్లు మిగిలిపోతే వాటిని వస్త్రం పీల్చుకుని పనీర్ చక్కగా తయారవుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
* పనీర్‌లో ఉండే మంచి కొవ్వు, ప్రొటీన్ల వల్ల గర్భిణులకు వేవిళ్లు, అలసట, బలహీనత.. వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రొమ్ము, కోలన్.. వంటి క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని తగ్గించేస్తాయి. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్.. ఈ రెండూ కడుపులోని బిడ్డ ఎదుగుదలకు, తల్లీబిడ్డల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. ఇది తినడం వల్ల ఆస్టియోపొరోసిస్, దంతాల సమస్యలు, కీళ్ల నొప్పులు దరిచేరకుండా ఉంటాయి. ఫలితంగా దంతాలు, ఎముకలు దృఢంగా ఉంటాయి.
* అలాగే ఇందులో ఉండే లిపిడ్లు, పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర ఎముక సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తాయి.
* పనీర్‌లో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేస్తుంది. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఈ పదార్థంలో మోనోశ్యాచురేటెడ్, పాలీఅన్శ్యాచురేటెడ్ కొవ్వులు శరీర బరువును తగ్గించడంలో దోహదం చేస్తాయి.
* మనం తిన్న ఆహారం నుంచి లభించే ప్రొటీన్లు శరీరంలో సులభంగా జీర్ణమవుతాయి. అలాగే పనీర్‌లో ఉండే ప్రొటీన్లు కూడా త్వరగా జీర్ణమై జీర్ణశక్తిని పెంచుతాయి. ఫలితంగా అజీర్తి, గ్యాస్ట్రిక్, మలబద్ధకం.. వంటి సమస్యలకు దూరంగా ఉండచ్చు.
* కొంతమందికి ఎంత తిన్నా సరే మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుందంటారు. దీనివల్ల ఎక్కువగా తిని బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆకలిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఈ లక్షణం కూడా పనీర్‌కి ఉంది.
* పోషకాలు, ఖనిజాలు పనీర్ నుంచి అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి మహిళలకు మెనోపాజ్ దశలో ఎదురయ్యే చిరాకు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
* కొందరికి చిన్న తనంలోనే చర్మంపై ముడతల్లాంటివి వస్తుంటాయి. దీంతో ముసలివాళ్లలా కనిపిస్తారు. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. రోజూ పనీర్‌ని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయి.
* అలాగే ఇందులో ఉండే కాపర్ వల్ల జుట్టు కూడా దృఢంగా తయారవుతుంది.