Image for Representation
హాయ్ డాక్టర్. నా వయసు 45. ఇప్పటివరకు మాకు పిల్లల్లేరు. ఈ వయసులో మేము పిల్లల కోసం ట్రై చేయచ్చా? ఒకవేళ పిల్లలు పుడితే వారిలో ఏమైనా సమస్యలు తలెత్తుతాయా?
జ: వైద్యశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో 40 సంవత్సరాలు పైబడిన వారికి కూడా పిల్లలు పుట్టడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే మీరు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.
మొదటిది - మీరు యుక్తవయసులో ఉన్నప్పుడు గర్భం రాలేదంటే.. ఇకపై కూడా దానంతటదే రావడమనేది దాదాపు అసాధ్యం.
రెండోది - 35 ఏళ్లు దాటినప్పటి నుంచి స్త్రీలలో అండాల నిల్వ తగ్గిపోతూ వస్తుంది. అందుకని మీకు పరీక్షలన్నీ చేసి చూసిన తర్వాత.. బహుశా దాత నుంచి అండాల్ని స్వీకరించి (డోనర్ ఎగ్స్) దాని ద్వారా ఐవీఎఫ్ చేయాల్సిన పరిస్థితి ఉండచ్చు. ఎందుకంటే మీకు అండాలు తక్కువగా ఉండడమే కాకుండా మీ అండాలతో గర్భం ధరిస్తే ఈ వయసులో బిడ్డలకు డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే ముందుగా మీ ఆరోగ్యం ఎలా ఉందో (అంటే మీకు హైబీపీ, షుగర్, డయాబెటిస్.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలేమీ లేవని నిర్ధారించుకోవాలి.), తర్వాత మీ గర్భాశయం ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలిస్తారు. మీ శరీరంలో హార్మోన్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మీరు గర్భం ధరించడం కోసం వైద్యులు సరైన సలహా ఇవ్వగలుగుతారు.