సృజనకు నెలసరి అంటే విపరీతమైన భయం! ఎందుకంటే ఈ సమయంలో తనకు గడ్డల్లా బ్లీడింగ్ అవుతుంటుంది. దీంతో రెండుమూడు రోజుల ముందు నుంచే ఆమెకు కడుపు నొప్పి, నడుం నొప్పి మొదలవుతాయి.
విజితదీ ఇదే సమస్య! అయితే ప్రతిసారీ ఈ నొప్పి భరించలేక మాత్రలు వేసుకుంటుందామె.
ఇలా నెలసరి వచ్చే ముందు చాలామందికి పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, మూడ్ స్వింగ్స్.. వంటి సమస్యలు తలెత్తడం సహజమే! అయితే కొంతమందిలో ఈ నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. అలాగని ప్రతి నెలా మాత్రలతో తాత్కాలిక ఉపశమనం పొందితే దీర్ఘకాలంలో అది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి ఇలాంటి నొప్పుల్ని సహజసిద్ధంగానే తగ్గించుకోవాలంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బాత్రా.
వివిధ ఆరోగ్య సమస్యలు - వాటి నుంచి విముక్తి కలిగించే సూపర్ డ్రింక్స్, వాటిలోని సుగుణాలను ‘50 దేశీ సూపర్ డ్రింక్స్’ పేరుతో తను రాసిన పుస్తకంలో పొందుపరిచారామె. ఈ క్రమంలోనే నెలసరి నొప్పుల్ని పరిష్కరించుకోవడానికి మన వంటింట్లోనే చక్కటి పరిష్కార మార్గముందంటూ అందులో నుంచి ఓ సూపర్ డ్రింక్ రెసిపీ, దానిలోని ఆరోగ్య రహస్యాలను ఇన్‌స్టా పోస్ట్ రూపంలో పంచుకున్నారు బాత్రా.
మనం రోజూ వంటల్లో వివిధ రకాల మసాలాలు, పదార్థాలు వాడుతుంటాం. వీటితో కూరల రుచి పెరగడమే కాదు.. ఇవి ఆరోగ్యానికీ ఎంతో మంచివి. వాము కూడా అలాంటి పదార్థమే అంటున్నారు బాత్రా. వాము, బెల్లం, నీళ్లు కలిపి తయారుచేసే ఈ సూపర్ డ్రింక్‌తో నెలసరి నొప్పుల్ని తక్షణమే తగ్గించుకోవచ్చంటున్నారామె.
ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చు!
‘నెలసరి రావడానికి ముందు, నెలసరి సమయంలో చాలామంది కడుపునొప్పి, నడుంనొప్పితో సతమతమవుతుంటారు. అలాంటి వారికి ఈ డ్రింక్ చక్కగా పనిచేస్తుంది. దీన్ని తయారుచేసుకోవడం కూడా చాలా సులభం. ఇందుకోసం..
కావాల్సినవి
* వాము - టీస్పూన్
* బెల్లం - కొద్దిగా
* నీళ్లు - కప్పు
తయారీ
ముందుగా నీళ్లు మరిగించాలి. ఆపై అందులో వాము, బెల్లం వేసి పావుగంట పాటు సిమ్‌లో మరిగించాలి. ఇలా తయారైన పానీయాన్ని చల్లార్చుకొని తాగచ్చు.. లేదంటే గోరువెచ్చగానైనా తీసుకోవచ్చు.
బోలెడు ప్రయోజనాలు!

ఈ పానీయం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటంటే! * నెలసరి నొప్పుల్ని, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడంలో ఈ పానీయాన్ని మించింది మరొకటి లేదు. * కండరాల్ని శాంతపరిచే గుణాలు ఈ డ్రింక్‌లో పుష్కలంగా ఉన్నాయి. అలాగే పరగడుపునే తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు. * కొంతమందికి నెలసరి సమయంలో గడ్డల్లాగా బ్లీడింగ్ అవుతుంటుంది. తద్వారా విపరీతమైన కడుపునొప్పి, నడుం నొప్పి వేధిస్తాయి. అలాంటి వారు ఈ డ్రింక్ తాగితే నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందచ్చు. అలాగే బ్లీడింగ్ కూడా సాఫీగా జరిగేలా చేస్తుందీ పానీయం. * వాములో యాంటీబయోటిక్, అనస్థెటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించి, దానివల్ల కలిగే నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం పొందేలా చేస్తాయి. * చిన్నవయసులోనే జుట్టు నెరిసిపోవడం ఇప్పుడు కామనైపోయింది. అయితే వాముతో చేసిన ఈ పానీయం ఆ సమస్య తలెత్తకుండా అరికడుతుంది..’ అంటూ ఈ స్పెషల్ డ్రింక్ గురించి చెప్పుకొచ్చారు బాత్రా.
|
ఇవీ ఉపశమనం కలిగించే మార్గాలే!

* నెలసరి నొప్పుల్ని దూరం చేసుకోవడానికి కాపడం పెట్టడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో హీటింగ్ ప్యాడ్‌ని పొత్తి కడుపు, నడుం నొప్పి ఉన్న చోట (లోయర్ బ్యాక్) కాసేపు ఉంచితే నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందచ్చు. * ఏవైనా శారీరక నొప్పులు వేధిస్తున్నప్పుడు వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. నెలసరి నొప్పులకూ ఇదే చిట్కాను ఫాలో అవ్వచ్చు. ఈ నొప్పితో రాత్రుళ్లు చాలామందికి నిద్ర పట్టదు. అలాంటప్పుడు పడుకునే ముందు వేడి నీళ్లతో స్నానం చేస్తే నొప్పి కాస్త తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి..! * ఇక ఇలాంటి సమయంలో హెర్బల్ టీలు తాగినా నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు.
 * కొన్ని వ్యాయామాలు కూడా నెలసరి నొప్పుల్ని దూరం చేస్తాయి. అయితే ఈ క్రమంలో ఎలాంటి వ్యాయామాలు చేయాలన్న విషయం నిపుణుల్ని అడిగి సలహా తీసుకోవచ్చు. * ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెజర్.. వంటి చికిత్సా పద్ధతులు కూడా నెలసరి నొప్పుల్ని దూరం చేస్తాయట! ఈ క్రమంలో సంబంధిత నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఉత్తమం. * నెలసరి సమయంలో కలయికలో పాల్గొన్నా కూడా ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ సమయంలో లైంగిక చర్య కారణంగా సుఖ వ్యాధులు సోకే ప్రమాదమూ లేకపోలేదన్నది మరికొందరు నిపుణుల అభిప్రాయం. ఏదేమైనా దీని గురించి మీ గైనకాలజిస్ట్‌ని అడిగి తగిన సలహా తీసుకోవడం మంచిది.
|
అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలగట్లేదంటే మాత్రం సంబంధిత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే ఇలాంటి నొప్పులు కొన్ని సందర్భాల్లో ఇతర ప్రత్యుత్పత్తి సమస్యలకూ సూచితమట! కాబట్టి ముందే జాగ్రత్త పడితే భవిష్యత్తులో ఇతర సమస్యల ముప్పు తప్పించుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు.