అమ్మయ్యే క్రమంలో ప్రతి క్షణం అపురూపమే! ఈ సమయంలో తీసుకునే ఆహారం దగ్గర్నుంచి, చేసే వ్యాయామం దాకా.. ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు మహిళలు. ఇంకొంతమందైతే కడుపులో పెరుగుతున్న చిన్నారి కోసం మరో ముద్ద ఎక్కువగానే తింటుంటారు. అయితే ఇలా చేయాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన ఈ అందాల అమ్మ.. తనకు పుట్టబోయే రెండో బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తూనే తగిన జాగ్రత్తలు పాటిస్తోంది. అంతేకాదు.. అవన్నీ కాబోయే తల్లులకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో అందరితోనూ పంచుకుంటోంది.
నెల తప్పిన దగ్గర్నుంచి అది తినకూడదు.. ఇది తినడం మంచిది కాదు.. అని వాళ్లూ వీళ్లూ చెప్పడంతో ఆహారానికి సంబంధించి తమ కోరికలను చంపుకొంటుంటారు చాలామంది మహిళలు. కానీ మనసుకు నచ్చిన రుచిని ఆస్వాదించమంటోంది కరీనా. అయితే అది కూడా మితంగానే మంచిదంటోంది. త్వరలోనే తను మరో బిడ్డకు జన్మనివ్వబోతోన్న క్రమంలో కాబోయే అమ్మలకు తాను పాటిస్తోన్న కొన్ని ఆహార నియమాలు చెబుతూనే.. మరికొన్ని జాగ్రత్తలను కూడా సూచించింది బెబో.
ఇద్దరి కోసం వద్దు!
* గర్భం ధరించిన మహిళలకు పెరుగు చాలా మంచిది. అది పొట్ట ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని పెంచుతుంది. అందుకే నేను కూడా పెరుగు బాగా తింటున్నా. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్న భోజనం సమయంలో తీసుకుంటున్నా.
* నేను రోజూ తీసుకునే భోజనంలో టీస్పూన్ నెయ్యి తప్పనిసరిగా వేసుకుంటా. ముఖ్యంగా పప్పు, పరాఠాలు తీసుకున్నప్పుడు వాటిలో నెయ్యి వేసుకుంటా. సులభమైన పద్ధతిలో పోషకాలను మన శరీరానికి అందించడానికి దీనికి మించిన మార్గం లేదన్నది నా భావన. అలాగే పాలు, నెయ్యి.. వంటి పాల పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి.. ఎముకల్ని దృఢంగా మార్చుతాయి.
* ప్రెగ్నెన్సీ సమయంలో ఇద్దరి కోసం తినాలని చాలామంది ఆరాటపడుతుంటారు. కానీ అలా తినాలన్న నియమం ఎక్కడా లేదు. అందుకే మీకోసం మీరు ఆహారం తీసుకోండి.. తద్వారా కడుపులోని బిడ్డకూ పోషకాలు అందుతాయి. అలాగే మీ మనసుకు నచ్చిన పదార్థాలు తినడానికి వెనకాడకండి. అయితే అది కూడా ఎక్కువ మొత్తంలో కాకుండా.. తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినడం మంచిది. తద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
* ప్రస్తుత కరోనా సమయంలో గర్భిణులే కాదు.. ఎవరైనా సరే.. ఇంట్లో ఎప్పటికప్పుడు వండుకున్న ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. తద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు.. ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు..!
* ఇలా ఆహారంతో పాటు గర్భిణులకు వ్యాయామమూ ముఖ్యమే. రోజుకు 40 నిమిషాల పాటు వ్యాయామం చేయమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ముందుగా మీ వైద్యుల సలహా తీసుకొని, మీ ఆరోగ్యాన్ని పరిశీలించుకొని.. నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చేయడం మంచిది. నేనైతే ప్రతిరోజూ యోగా చేస్తాను. ఇది నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించడంతో పాటు నా శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చుతుంది.
* ఇంటి పనైనా, వ్యాయామమైనా అలసిపోయినా సరే కొనసాగిస్తుంటారు కొంతమంది. అయితే అలసటగా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకోవడమే మంచిది. అంతేకానీ.. కచ్చితంగా చేయాలన్న నియమం పెట్టుకొని శరీరాన్ని కష్టపెడితే అది మీకు, మీ కడుపులో పెరుగుతోన్న బిడ్డకే నష్టం.
ఇది నా మెనూ!
* ఉదయం లేవగానే ఒక గ్లాసు పాలు తాగుతా. * మధ్యాహ్నం భోజనం సమయంలో పరాఠా లేదా పప్పన్నం తింటా. అయితే ఏది తిన్నా టీస్పూన్ నెయ్యిని జత చేసుకోవడం మాత్రం మర్చిపోను. అలాగే కప్పు పెరుగు తీసుకుంటా. * ఇక ఎప్పుడైనా ప్రత్యేకంగా తినాలనిపిస్తే ఇంట్లో ఉండే ఏదైనా పిండితో హల్వా చేసుకొని తినేస్తా.
|
ప్రతికూల ఆలోచనలు రానివ్వకండి!
ప్రస్తుతం చాలామంది కరోనా భయంతోనే సతమతమైపోతున్నారు. తమకెక్కడ వైరస్ సోకుతుందోనన్న ఆందోళన చాలామందిలో ఉంది. కానీ గర్భిణిగా ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు అస్సలు మంచిది కాదు. కాబట్టి ప్రతికూల ఆలోచనలకు, నెగెటివ్‌గా ఆలోచించే వారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఇక వైరస్ బారిన పడకుండా కనీస జాగ్రత్తలన్నీ పాటించాలి. మనకు నచ్చిన ఆహారం తీసుకుంటూ, మనసుకు నచ్చిన పనులు చేస్తూ పోతే ప్రతి క్షణాన్నీ ఆస్వాదించచ్చు.. తద్వారా ఎలాంటి చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా ఉంటాయి.. సంతోషంగా కూడా ఉంటాం..! కాబోయే తల్లులూ.. హ్యాపీ ప్రెగ్నెన్సీ!!