చాలామంది మహిళల్లో గర్భం ధరించిన మొదట్లో (సుమారు ఆరు నుంచి పన్నెండు వారాల మధ్యలో) వాంతులవడం, నీరసంగా అనిపించడం.. వంటి పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. దీన్నే 'మార్నింగ్ సిక్నెస్' అంటారు. సాధారణ భాషలో దీనినే 'వేవిళ్లు'గా వ్యవహరిస్తారు. ఈ సమయంలో శరీరంలో హార్మోన్లలో కలిగే మార్పులు, విటమిన్ల లోపం, ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం, వ్యాయామం లోపించడం.. వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంటుంది. దీంతో ఏమవుతుందో ఏమోనని కొంతమంది మహిళలు భయాందోళనలకు గురవుతుంటారు. ఈ క్రమంలో 'మార్నింగ్ సిక్నెస్' సమస్యను సహజసిద్ధంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం రండి..

ఏం తింటున్నారు??
క్యాలరీలు ఎక్కువగా ఉండే వేపుళ్లు, మసాలా వంటి ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల అవి సులభంగా జీర్ణం కావు. కాబట్టి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా లభించే బంగాళాదుంప, బ్రెడ్, పాస్తా.. వంటి పదార్థాల్ని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు వాంతులవకుండా ఉంటుంది. అలాగే కొంతమంది మహిళలకు ఈ సమయంలో కొన్ని ఆహార పదార్థాల వాసన అంటే పడదు. కాబట్టి అలాంటి పదార్థాల్ని తినకపోవడమే మంచిది. అలాగే పండ్ల రసాలు, సూప్స్.. వంటి సులభంగా జీర్ణమయ్యే ద్రవ పదార్థాల్ని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది.
అసలేం తినట్లేదా??
అతిగా తినొద్దన్నారు కదా అని అసలే తినకుండా ఉంటున్నారా?? కొంతమందైతే తింటే వాంతి వస్తుందనే భయంతో అసలేం తినకుండా కడుపంతా ఖాళీగా ఉంచుకుంటారు. కానీ ఇలా ఖాళీ కడుపుతో ఉండడం వల్ల కూడా వాంతులయ్యే అవకాశముంది. ఎందుకంటే కడుపులో ఆహారం జీర్ణం చేయడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది. ఎక్కువ సేపు ఏమీ తినకుండా ఉంటే ఈ ఆమ్ల స్థాయులు పెరిగిపోయి వాంతులు, వికారానికి దారితీస్తాయి. కాబట్టి కడుపును ఖాళీగా ఉంచుకోకపోవడమే మంచిది. కాబట్టి ఆహారం ఏం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండకపోవడమే మంచిది.
అతిగా తింటున్నారా??
గర్భం ధరించిన సమయంలో అతిగా తినేయడం వల్ల కూడా ఆహారం సరిగ్గా జీర్ణం కాక వాంతి వస్తుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఒకేసారి అతిగా తినడం మాని.. రోజుకు కనీసం ఐదారు సార్త్లెనా సరే.. కొద్ది మొత్తంలో ఆహారం తీసుకుంటే సమస్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

పుక్కిలించాలి..
మామూలుగా ఏదైనా తిన్న తర్వాత నోరు సరిగ్గా కడుక్కోకపోతే దంతాల్లో ఆహారం చిక్కుకొని నోటి నుంచి వాసన వస్తుంటుంది. గర్భధారణ సమయంలో ఆ వాసనకు కూడా వాంతి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తిన్న తర్వాత బ్రష్ చేసుకోవడం లేదా పుక్కిలించడం చాలా ముఖ్యం. అలాగే ఒకవేళ వాంతి అయితే ఆ తర్వాత కూడా నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే ఈ దుర్వాసన కూడా తిరిగి వాంతి రావడానికి కారణం కావచ్చు.
అలాగే గాఢమైన వాసన వచ్చే అమ్మోనియా, డీజిల్, పెట్రోల్.. వంటి ఇంధనాల వాసనలు చూడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇవి కొందరికి పడక వాంతి వచ్చే అవకాశం ఉంటుంది.
మంచినీళ్లు తాగుతున్నారా?
మార్నింగ్ సిక్‌నెస్‌ను తగ్గించుకోవడానికి మరో మార్గం శరీరంలో నీటిశాతం ఎప్పుడూ తగినంత ఉండేలా చూసుకోవడం. దీనికోసం గంటకోసారైనా ఓ గ్లాసు చొప్పున నీళ్లు తాగుతూ ఉండాలి. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా సాగడంతోపాటు వాంతుల సమస్య కూడా తగ్గిపోతుంది.

అల్లం టీ..
మార్నింగ్ సిక్‌నెస్‌ను తగ్గించుకోవడానికి ఉపయోగపడే అద్భుత ఔషధం.. అల్లం టీ. ప్రతిరోజూ దీన్ని తాగడం వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఫలితంగా వాంతి రాకుండా ఉంటుంది. అలాగే దీనివల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
అలాగే నిమ్మకాయ, పుదీనా, చామొమైల్.. వంటి ఔషధ గుణాలున్న పదార్థాలతో తయారు చేసిన టీ తాగడం వల్ల కూడా సమస్యను తగ్గించుకోవచ్చు. వీటిలో పుదీనాతో తయారు చేసిన టీ తాగడం వల్ల మార్నింగ్ సిక్నెస్ సమస్యతో పాటు గుండెలో మంట కూడా తగ్గిపోతుంది.
కరివేపాకుతో..
వాంతులను తగ్గించడంలో కరివేపాకు కూడా ఉపయోగపడుతుంది. దీనికోసం.. కొన్ని కరివేపాకుల్ని తీసుకుని వాటి నుంచి రసం పిండాలి. దీనికి చెంచా చొప్పున తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు కనీసం రెండు మూడు సార్త్లెనా తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పుల్లగా ఉండేవి..
పుల్లటి పదార్థాలు తినడం వల్ల కూడా సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికోసం కొన్ని నీళ్లలో (మరీ చల్లటి నీళ్లు వద్దు) కాస్త నిమ్మరసం కలుపుకొని తాగడం లేదంటే నిమ్మకాయ ముక్క వాసన చూడడం.. లాంటివి చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల వాంతుల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
సోంపు..
సోంపు నోటి దుర్వాసనను పోగొట్టడానికి మాత్రమే కాదు.. వాంతులు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి గర్భం ధరించిన మొదట్లో ఈ సమస్య ఎప్పుడు ఎదురవుతుందో తెలియదు కాబట్టి ఎప్పుడూ సోంపును అందుబాటులో ఉంచుకోవడం చాలా మంచిది.
ఆదరాబాదరాగా వద్దు!
గర్భం ధరించిన తర్వాత ఏ పనైనా సరే ఆదరాబాదరా పడకుండా నెమ్మదిగా చేయాలి. లేదంటే పనులు వేగంగా చేయడం వల్ల కూడా కొంతమందిలో తల తిరగడం, వాంతులు కావడం వంటివి జరుగుతుంటాయి.
వ్యాయామం..
ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందులో భాగంగా నడక చాలా మంచిది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడడంతో పాటు శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఫలితంగా అటు ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇటు మార్నింగ్ సిక్నెస్ సమస్య కూడా తగ్గుతుంది.
గర్భధారణ సమయంలో ఈ సమస్య రావడానికి ఒత్తిడి కూడా ఒక కారణమే. కాబట్టి ఒత్తిడి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిరోజూ యోగా, మెడిటేషన్.. వంటివి చేయాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి క్రమంగా సమస్య కూడా తగ్గుతుంది.