ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. సాధారణంగా ఈ పండ్లు సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య ఎక్కువగా లభిస్తాయి. కొన్ని గుండ్రంగా, కొన్ని హృదయాకారంలో.. ఉండే ఈ పండ్లను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఎంతో రుచికరంగా ఉండే సీతాఫలాలు ఆరోగ్యానికీ ఎంతో అవసరం. ఇందులో ఎ, సి, బి6 వంటి విటమిన్లతో పాటు కాపర్, పొటాషియం, పీచు.. వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. పైగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా! కాబట్టి ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఈ పండు తినడం శ్రేయస్కరం. మరి, ఈ మధుర ఫలంలో ఉన్న పోషకాలేంటి? అవి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపకరిస్తాయో తెలుసుకుందాం రండి...
* మీరు చాలా బలహీనంగా ఉండి.. ఏ పని చేయడానికీ శరీరం సహకరించట్లేదా? అయితే సీతాఫలం తినండి. ఎందుకంటే ఈ పండులో శరీరానికి శక్తినిచ్చే గుణాలు అధికంగా ఉంటాయి.
* ఆహారం త్వరగా జీర్ణం కావట్లేదా?? అయితే సీతాఫలం తినడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే కాపర్ మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవడంలో సహాయపడుతుంది.
* ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు విశ్రాంతినివ్వడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ ఖనిజం గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

* ఇది శరీరానికి చలువ చేయడంతో పాటు రక్తహీనత సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది.
* ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. సీతాఫలం ఇందుకు సహకరిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంపై ఏర్పడిన వాపును తగ్గించడంలో సహకరిస్తాయి.
* ఇందులో కొవ్వులు తక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ పండు తినడం వల్ల మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు.
* ఈ పండులో ఉండే అసిటోజెనిన్, ఆల్కలాయిడ్స్.. అనే సమ్మేళనాలు ఎలాంటి క్యాన్సర్లు రాకుండా శరీరాన్ని కాపాడతాయి.
* సీతాఫలంలో బి-కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. ఫలితంగా ఒత్తిడి, టెన్షన్.. నుంచి ఉపశమనం పొందచ్చు.
* ఈ పండులో విటమిన్ సి, రైబోఫ్లేవిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చూపు స్పష్టంగా కనిపించేందుకు సహాయపడతాయి.
* మధుమేహంతో బాధపడే వారికి ఈ పండు చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఈ పండు తినడం వల్ల శరీరం తక్కువ మొత్తంలో చక్కెరల్ని గ్రహిస్తుంది. ఫలితంగా టైప్-2 మధుమేహం నుంచి రక్షించుకోవచ్చు.
* సీతాఫలంలో కాపర్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. దీనివల్ల శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయులు పెరుగుతాయి. గర్భం దాల్చిన మహిళలకు ప్రతిరోజూ వెయ్యి మైక్రోగ్రాముల కాపర్ అవసరం. ఇది పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది. కాపర్ తక్కువైతే పూర్తిగా నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సీతాఫలం ఎక్కువగా తినడం మంచిది.
* అలాగే గర్భం దాల్చిన మహిళల్లో వేవిళ్లు, మూడ్ బాగోలేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం.. లాంటి చాలా సమస్యలు ఉంటాయి. సీతాఫలం వీటన్నింటికీ చెక్ పెట్టేస్తుంది.
* ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడతాయి.
* కొంతమందికి పాలు తాగడమంటే అసలు ఇష్టం ఉండదు. అలాంటి వారు సీతాఫలం తినడం వల్ల పాలు తాగినంత బలం, శక్తి వస్తాయి.

ఇలాంటివి కొనడం మంచిది..
సీతాఫలాలను కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలూ కొన్నున్నాయి. అవేంటంటే..
* ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉన్న పండ్లను కొనచ్చు. కానీ నల్లగా మారిన వాటిని కొనకపోవడమే మంచిది.
* ఒకవేళ పూర్తిగా పండని వాటిని తీసుకొని ఇంట్లో పండించుకోవాలంటే.. సాధ్యమైనంత మేరకు పెద్దగా ఉన్న వాటిని మాత్రమే తీసుకోండి. చిన్నగా ఉన్నవి పండే అవకాశం తక్కువ.
* అలాగే మీరు కొన్న కాయలను.. ఒక గోనె సంచిలో ఉంచి ఓ మూలన ఉంచండి. రెండు రోజుల్లో అవి పండుతాయి.
* పండ్లను కొంటే రెండు రోజుల్లోపే తినడం మంచిది. అంతకు మించితే అవి పాడైపోతాయి.
* పండ్లను ఫ్రిజ్‌లో నేరుగా కాకుండా కవర్లో ఉంచి పెట్టడం మంచిది.
ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ పండుని వెంటనే తినాలనిపిస్తోంది కదూ! అలాగని మరీ ఎక్కువగా లాగించేయకండి. రోజుకు నాలుగైదు వరకైతే సరే.. అంతకు మించితే మాత్రం అజీర్తే! గుర్తుంచుకోండి..