కూరల్లో కాస్త కారం ఎక్కువైతే చాలు.. అస్సలు తట్టుకోలేరు కొందరు. ముఖమంతా ఎర్రగా మారి, కళ్లలో నీళ్లొచ్చేస్తాయి. ఇంత కారమా? అని ఆ వంట చేసినవారిని తిట్టుకుంటుంటారు. అయితే పచ్చిమిర్చిని మరీ ఇలా ఎక్కువగా, ఘాటు తట్టుకోలేనంత స్థాయిలో కాకున్నా రోజూ కచ్చితంగా తీసుకోవాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎందుకంటే ఇందులోని ఔషధ గుణాలు అలాంటివి మరి. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత వివరంగా తెలుసుకున్నారంటే మీరు కూడా దీని వాడకాన్ని రోజూ తప్పనిసరి చేసేస్తారు. మరి అవేంటో చూద్దామా..
గాయాలు మానిపోతాయ్..
పచ్చిమిర్చిలో విటమిన్ 'సి' పుష్కలంగా లభిస్తుంది. అరకప్పు తరిగిన పచ్చిమిర్చి ముక్కల్లో దాదాపు 181 మిల్లీగ్రాముల సి విటమిన్ ఉంటుంది. ఒక రోజుకు మన శరీరానికి కావలసిన విటమిన్ సి శాతాన్ని ఇది భర్తీ చేస్తుంది. ప్రత్యేకించి గాయాల పాలైనప్పుడు పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ గాయాలను సులభంగా తగ్గించుకోవచ్చు. అంతేకాదు.. విటమిన్ 'సి' సమృద్ధిగా ఉండే పచ్చిమిర్చిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఎముకల సంబంధిత వ్యాధుల ముప్పు నుంచి బయటపడే అవకాశాలు అధికంగా ఉంటాయి.

రక్తస్రావం కాకుండా..
శరీరానికి ఏదైనా గాయమైనప్పుడు కొందరికి ఎక్కువగా రక్తస్రావమవుతుంది. దీనివల్ల ఒక్కోసారి ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో రక్తప్రసరణను నియంత్రించేందుకు విటమిన్ 'కె' తప్పనిసరి. శరీరంలో రక్తం గడ్డకట్టేందుకు సహకరించే విటమిన్ ఇది. పచ్చిమిర్చిలో ఇది పుష్కలంగా ఉండడం వల్ల గాయమైనప్పుడు రక్తం వెంటనే గడ్డకట్టి, అధిక స్రావం జరగకుండా కాపాడుతుంది.
చక్కటి కంటిచూపుకి..
మెరుగైన కంటి చూపు మీ సొంతం కావాలంటే పచ్చిమిర్చిని తప్పకుండా రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇందులో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ 'ఎ' ఎక్కువగా ఉంటుంది. అరకప్పు పచ్చిమిర్చి ముక్కల్లో 884 |గీవిటమిన్ 'ఎ' లభిస్తుంది. ఇది ఎర్ర రక్తకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు దీన్ని రోజూ తీసుకోవడం వల్ల కంటి పనితీరు బాగుంటుంది.

మెరుగైన జీర్ణవ్యవస్థకు..
పచ్చిమిర్చిలో కేవలం విటమిన్లే కాకుండా మెరుగైన జీర్ణవ్యవస్థకు దోహదపడే ఫైబర్ కూడా లభ్యమవుతుంది. అరకప్పు పచ్చిమిర్చిలో ఒక రోజుకు అవసరమైన ఫైబర్‌లో 6 శాతం వరకు అందుబాటులో ఉంటుందని ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) శాస్త్రవేత్తలు నిర్ధరించారు. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంతో పాటు శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర వహిస్తుంది.
మరెన్నో..
* పచ్చిమిర్చిలో విటమిన్ 'సి' మెండుగా ఉండడం వల్ల దీన్ని రోజూ తీసుకునే వారి చర్మం కాంతివంతంగా ఉంటుంది. * ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఎలర్జీలు, ఇతర చిన్న చిన్న వ్యాధుల బారిన పడకుండా చాలావరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. * దగ్గు, జలుబు వంటి సమస్యలను దరిచేరకుండా చేయడంతో పాటు వూపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడంలోనూ సహాయపడుతుంది. * పచ్చిమిర్చిని తరచూ తీసుకునేవారి నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఆహారాన్ని నమిలి, సులభంగా జీర్ణం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. * వయసు పెరిగేకొద్దీ ముఖంపై ఏర్పడే ముడతలను తగ్గించడంలో పచ్చిమిర్చిలోని ఔషధగుణాలు సహకరిస్తాయి. * శరీరంలో పేరుకునే విషపదార్థాలను బయటకు పంపి, మలబద్ధకం సమస్యను తగ్గించడంలో పచ్చిమిర్చి తోడ్పడుతుంది.
|
చూశారుగా.. 'కారం.. కారం' అనకుండా పచ్చిమిర్చిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలో. ఇటు రుచికి రుచి, అటు ఆరోగ్యానికి ఆరోగ్యం! మరి ప్రయత్నిస్తారు కదూ..